రాష్ట్ర అభివృద్ధిపై.. చిత్తశుద్ధి ఉందా?
Are the politicians of AP sincere about the development of the state?
అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందటానికి కావలసినన్ని భౌతిక వనరులను ప్రకృతి వరంగా ప్రసాదించింది. అయినా రాష్ట్రం అభివృద్ధి చెందవలసిన స్థాయిలో ప్రగతి సాధించలేదు. కారణాలు పరిశీలిస్తే... ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం ప్రకారం దేశంలో ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా సుమారు 5 కోట్లు. గ్రామీణ జనాభా 70.4శాతం, పట్టణ జనాభా 29.6శాతం. గుజరాత్ తరువాత 974 కి.మీ.తో రెండవ, అతి పొడవైన సముద్ర తీర ప్రాంతం కలిగి ఉన్న ప్రాంతం. అతి విలువైన కోహినూర్ వజ్రం రాష్ట్రంలో కొళ్ళూర్‌లో లభించింది. మూడు పంటలు పండే సారవంతమైన భూములు, కృష్ణా, గోదావరి, పెన్నా మొదలైన ప్రధాన నదులు, దట్టమైన ఉష్ణమండల అడవులు, మంచి వాతావరణం, సున్నపురాయి, మేంగనీస్, రాతినార, ఇనుము, బంతి బంకమట్టి, వజ్రం, గ్రాఫైట్, డోలమైట్, గెలాక్సీ గ్రానైట్ మొదలైన ఎన్నో సహజ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. కష్టించే ప్రజలు, చదువుకున్న యువతీ యువకులు విస్తారంగా ఉన్నారు.
ఇక్కడి అభివృద్ధి మరిచి...
ఇక్కడి నుంచి వెళ్లిన నాయకులు దేశ రాజకీయాల్లో రాష్ట్రపతిగా నీలం సంజీవ రెడ్డి, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు అత్యున్నత పదవులు పొందారు. అలాగే మరీ వెనకబడిన సీమ ప్రాంతం నుండి వచ్చి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే ఎక్కువ మంది ఉన్నారు. అంతేందుకు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి సైతం రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే! కానీ ఆ ప్రాంతం ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతంగానే ఎందుకు ఉంది? ఇంతమంది రాజకీయ నేతలు ఉన్నప్పటికీ.. సీమ అభివృద్ధి చాలా పరిమితంగా జరిగింది. అంటే, జరగవలసినంత స్థాయిలో జరగలేదు. ఎందుకంటే, వాళ్ల ప్రధాన దృష్టి అప్పటికే బాగా అభివృద్ధి చెందిన ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌లో తమ స్వంత సంపదను సృష్టించుకోవడం కోసం, ఉన్నదానిని పెంచుకోవడం కోసం వారు పరితపించారు. అందుకే అక్కడే వారు విశాలమైన భూములు ఎకరాల కొద్దీ కొన్నారు. రాజ భవనాలను తలపించే ఇళ్ళు, ఫామ్ హౌస్‌లు తదితర ఆస్తులు సంపాదించుకున్నారు. చూస్తుండగానే లక్షల కోట్లకు ఎగబాకారు. ప్రస్తుతం వారి వారసులు కూడా అక్కడి ఆస్థులు పరిరక్షించుకోవడానికి, పెంచుకోవటానికే ఆసక్తిని చూపుతున్నారు. తప్పా ఆంధ్రప్రదేశ్ గురించి ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి వాళ్లు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో అనేక భౌతిక వనరులు ఉన్నప్పటికీ, ఈ ప్రాంతాల అభివృద్ధిపై వారు మనసు పెట్టలేదు. రాయలసీమపై ప్రకృతి చూపిన వివక్షతోపాటు, రాజకీయ నాయకులు చూపిన నిర్లక్ష్యం కూడా తక్కువది కాదు.
అలాగే ఇక్కడి నుండి వెళ్లి సినీరంగ ప్రముఖులు ఎందరో అక్కడ ఆస్తులు సంపాదించారు. రాజకీయాల్లో రాణించారు. సీనిరంగ ప్రముఖులు కూడా ఇక్కడి గురించి ఆలోచించుకుండా హైదరాబాద్‌లోనే స్టూడియోలు, సినిమా హాళ్లు నిర్మించారు. కానీ సువిశాలమైన ఆంధ్రాలో సినిమా రంగానికి చెందిన 24 క్రాఫ్ట్ లలో దేనినీ వారు అభివృద్ధి చేయలేదు. కానీ తెలుగు చలనచిత్ర సీమ అంటే ఆంధ్రా ప్రాంతానికి చెందినవారే ఎక్కువగా ఉంటారు. వీరు ఉమ్మడి రాష్ట్రంలోనూ హైదరాబాద్‌ను మినహాయించి ఇతర ప్రాంతాల్లో చేసిన సేవ ఏమీలేదు.
కేంద్రంతో ఢీకొనలేని నాయకులు
ఇక ప్రస్తుత రాజకీయ విషయాలకు వస్తే, ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి ప్రాంతానికి న్యాయం చేయలేని నాయకులు.. స్వరాష్ట్రంలో నైనా ప్రగతి సాధిస్తారేమోననుకుంటే ప్రస్తుత నాయకులు కనీసం విభజన హామీలు సైతం సాధించుకోలేకపోతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ అనేక వాగ్దానాలు చేసింది. ముఖ్యంగా వెంకయ్యనాయుడు రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర అభివృద్ధి కోసం, పరిశ్రమల రాయితీల కోసం, స్పెషల్ కేటగిరీ కోసం అనేక డిమాండులు పెట్టాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున తనదైన శైలిలో గుక్క తిప్పుకోకుండా తన వాదనలను బలంగా వినిపించాడు. కానీ గత 9 ఏళ్ళలో ఈ ప్రాంత అభివృద్ధికి బీజేపీ చేసింది ఏమీ లేదు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా రాష్ట్ర విభజన చట్టంలో చేసినటువంటి అనేక వాగ్దానాలను ఆచరణలో బీజేపీ అమలు చేయలేదు. రావాలసిన నిధులు ఇవ్వలేదు. పోలవరం, స్పెషల్ స్టేటస్ వంటి హామీలను నెరవేర్చలేదు. ఒక రకంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిట్టనిలువునా మోసం చేసింది. అయినా ప్రధానిని నిలదీసే దమ్ము మన నాయకులకు లేదు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేది కేవలం నినాదంగా మిగలనుంది. లాభాలతో నడిచే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కారుచౌకగా అమ్మటానికి కేంద్రం కుట్ర చేస్తోంది. రైల్వే జోన్ ఊసు లేదు. ఓడ రేవులు అదానీ కబంధ హస్తాలలో చిక్కాయి.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని లేని అనాధ అయింది. చంద్రబాబు, జగన్ మధ్య రాజధాని నిర్ణయం రచ్చ, రచ్చ అవుతుంది. వేల ఎకరాల పంట భూములు ఇచ్చిన రైతుల ఆకాంక్షలు నెరవేర లేదు. సుదీర్ఘ ఉద్యమాలు చేసినా ప్రయోజనం దక్కలేదు. పైగా అరెస్టులు, అవమానాలు లభించటం దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘ కాలం పనిచేసిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్ అవినీతి కేసుల్లో పీకల లోతుల్లో మునిగి ఉన్నారు. కోర్టు కేసులకు భయపడుతున్నారు. అందుకే వారు బీజేపీని డిమాండ్ చేయాలంటే, పార్లమెంటులో నిలదీయాలంటే వణికి పోతున్నారు. అందుకే గత 9ఏళ్ళుగా అన్ని విషయాల్లో కేంద్రానికి తిరుగులేని మద్దతు ప్రకటించారు. అయినా మోదీ కనికరించటం లేదు. ఇక పవన్ కల్యాణ్ బీజేపీకి సన్నిహితుడైనా, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేసింది ఏమీ లేదు. అందుకే ఏపీ ప్రజలు ఇప్పటికైనా ఆలోచించుకొని ఓటును వినియోగించుకోవాలి. ఇక్కడి అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉన్న పార్టీలను ఎన్నుకోవాలి.
డా. కోలాహలం రామ్ కిశోర్
98493 28496