అంకాపూర్ గ్రామం.. గ్రామ స్వరాజ్యానికి మార్గం
Ankapur village is a path to Gram swaraj
ఒక ఆలోచన, దాని ఆచరణ జీవితాలను అత్యున్నత స్థాయికి చేరుస్తుంది. సమిష్టి కృషి అభివృద్ధికి పునాదులు వేస్తుంది. రాచబాటలై రారాజులను చేస్తుంది. అందుకే ఎవరో వచ్చి ఏదో చేసి మన బతుకులు బాగు చేస్తారనే బానిస మనస్తత్వాన్ని వదులు కోవడం నేటి రైతులకు నిరుద్యోగులకు అత్యావశ్యకం. అదీ దేశానికే వెన్నెముకలైన రైతులకు మరీ అవసరం. వారు స్వయం ఆలోచనలతో వ్యవసాయంలో స్వయం సమృద్ధి సాధిస్తే దేశాభివృద్ధికి ఢోకా ఉండదు.
మానవ సమాజం పురోగమిస్తోంది. ప్రతి అపజయం విజయానికి మెట్టు కావాలి. అనుభవం జీవితాలకు గుణపాఠం కావాలి. అప్పుడే సరియైన వ్యవసాయం ద్వారా ప్రతి పల్లె ప్రగతి బాటలో పయనిస్తుంది. పట్టణ నగర జీవన వసతులతో పాటు ప్రకృతి సౌందర్య సొగసులు పల్లె ప్రజల జీవితాలను ఆనందమయం జేస్తాయి. అత్యద్భుతమైన మానవ సమాజ నిర్మాణానికి నాంది పలుకుతాయి. ఐకమత్యమే మహాబలం అనే సామెత ఊరకనే పుట్టలేదు.
వ్యవసాయ సంక్షోభానికి మూలం..
మూడున్నర దశాబ్దాలుగా అన్నదాతల ఆత్మహత్యల విషాదానికి ప్రధాన కారణం గ్రామాలలోని రైతుల్లో ఐక్యతా భావన కొరవడడం, సమిష్టి కృషికి స్వస్తి పలకడం, తాము కంపెనీల వలలో చిక్కుకుని నిరంతరంగా చేస్తున్న స్వయం తప్పిదాల నుండి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోకపోవడం, బానిస మనస్తత్వాన్ని వదలకపోవడం, ప్రగతిశీల ఇలోచనా రాహిత్యం మొదలగు అవలక్షణాలు గ్రామీణ వ్యవసాయ సంక్షోభానికి అతిపెద్ద కారణంగా చెప్పొచ్చు. బహుళజాతి కంపెనీల కుట్రలు కుతంత్రాలకు వ్యవసాయం బలి పీఠమెక్కి ప్రజా జీవితం విషపూరిత ఆహారంతో రక రకాల క్యాన్సర్ లాంటి అతి భయంకర రోగాలతో పటా పంచలవుతుంది. మానవ జీవనానికి మూలాధారమైన భూమిలో విచక్షణా రహితంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఇంకా ఇతరత్రా అవాంఛనీయ రసాయన పదార్థాలను వాడి నిర్జీవం చేసి అధిక పెట్టుబడి భారంతో ఆత్మహత్యల పాలవుతూ ఆరోగ్యకరమైన ఆహార సంక్షోభానికి కారణమవుతున్నారు.
స్వయం సమృద్ధి సాధించి..
సరైన ఆలోచన చేస్తే అభివృద్ధికి సవాలక్ష మార్గాలు. అవి ఆచరిస్తే అభివృద్ధి సుగమమవుతుంది. అప్పుడే పర్యావరణ, ప్రకృతి హిత వ్యవసాయానికి దారులు పడతాయి. గతం నుండి నేర్చుకొని, వర్ధమానములో ఆచరిస్తూ, భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. స్వయం తప్పిదాలకు స్వస్తి పలికి, అంకిత భావంతో సమిష్టి కృషి చేస్తే అభివృద్ధి సాధ్యమనే నగ్న సత్యంను ఆధునిక రైతులు గ్రహించాలి. గ్రామ గ్రామాన రైతులు వ్యవసాయాన్ని సమూల మార్పులతో రసాయన రహితంగా, స్థానిక విత్తనాలతో, పంటల వైవిధ్యంతో మోనో కల్చర్‌కు స్వస్తి పలకడం ద్వారా గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తూ దేశాభివృద్ధికి పెద్ద పీట వేయవచ్చు. ఇలా స్వయం సమృద్ధి సాధించిన గ్రామాల్లో అంకాపూర్ దేశంలోనే ప్రముఖమైనది.
అంకాపూర్ గ్రామం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఆర్మూర్‌కు దగ్గరగా జాతీయ రహదారి 63లో వుంది. ఒకప్పుడు అన్ని గ్రామాల లాగే విత్తనాల పెట్టుబడులతో, అప్పుల బాధలతో ఆత్మహత్యలు వెళ్లదీసిన చరిత్ర అంకాపూర్‌కూ ఉన్నది. కానీ ఆ రైతులు తాము చేస్తున్న స్వయం తప్పిదాలను గ్రహించారు. ఆత్మావలోకనంతో స్థానిక విత్తనాలతోనే సంక్షోభం గట్టెక్కొచ్చు అనే అభిప్రాయానికి వచ్చి, ఎర్ర జొన్న, మొక్క జొన్న, సోయా బీన్, పసుపును విరివిగా మేలు రకంగా పండించడం మొదలు పెట్టారు. ఆ విత్తనాలకు స్థానికంగా, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్ధాయిలో డిమాండ్ పెరిగింది. కోట్ల రూపాయలు గడించింది. రైతులు ధనికులయ్యారు. 35 సంవత్సరాల క్రితమే గ్రామాభివృద్ధి కమిటీతో పాటు, ఇతర కమిటీలు వేసుకొని సమిష్టిగా, ఐక్యతతో రాజకీయాలను పక్కనపెట్టి వ్యవసాయ అభివృద్ధికి పునాదులు వేశారు. గ్రామాభివృద్ధి కమిటీ చర్చల ద్వారా లాభదాయక వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ నాటు కోళ్లను పెంచడం మొదలు పెట్టారు. అంకాపూర్ కోడి మాంసం రాష్ట్ర వ్యాప్తంగా పేరు గాంచింది. రైతుల ఆదాయాన్ని పెంచింది.
ప్రపంచానికే అంకాపూర్ ఆదర్శం
అంకాపూర్ నుండి సుమారు 500 మంది ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లోనూ వివిధ ఉద్యోగాల ద్వారా గ్రామ ఆదాయాన్ని పెంచుతున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లాంటి బంగ్లాలు, వీధులు, కార్లు, ఇతర వాహనాలతో మహానగరాన్ని తలపించేలా వుంది అంకాపూర్ గ్రామం. 32 విత్తన శుద్ధి కర్మాగారాలు 2016లోపే అక్కడ నెలకొన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 1520 ఇండ్లు, 5,689 జనాభా ఉంది. మొక్కజొన్న కంకులను విరివిగా పండిస్తారు. ప్రభుత్వ సాయాన్ని ఆశించడం వాళ్లకు టైం వేస్ట్ ప్రక్రియ. ఇక్రిశాట్, ICAR సంస్థలు కూడా అంకాపూర్ విత్తనాలు మేలైనవిగా గుర్తించాయి. తెలంగాణలోని వివిధ గ్రామాల రైతు కూలీలు అంకాపూర్, పస్తాపూర్‌లలో పని ద్వారా ఉపాధి పొందుతున్నారు. అంకాపూర్ వ్యవసాయాభివృద్ధికి ప్రధాన కారణం ఆ గ్రామ మహిళా రైతులే. ఇతర కూలీలతో పాటు ఆ గ్రామ మహిళా రైతులు కష్టించి పనిచేస్తారు. అంకాపూర్ చికెన్ ను పార్సిల్ల ద్వారా ఇతర దేశాలకు పంపిస్తున్నారు. ఒకప్పుడు నకిలీ విత్తనాలతో నష్ట పోయిన అంకాపూర్ రైతులు తామే మేలు రకం విత్తనాలు తయారు చేయాలని నిర్ణయించుకుని విత్తన సార్వభౌమత్వాన్ని (seed sovereignty) సాధించారు. ఈ గ్రామ యువత అంకాపూర్ కొరకు ప్రత్యేక పోర్టల్‌ని తయారు చేసి అంతర్జాతీయంగా ఈ గ్రామం గురించి తెలుసుకునేలా చేస్తున్నారు. మట్టి నుండి మాణిక్యాలు బురద నుండి బువ్వను తీసే ఈ గ్రామం తెలంగాణకు దేశానికే కాదు మొత్తం ప్రపంచానికే ఆదర్శం.
అప్పుడే గాంధీ కల నెరవేరుతుంది..
ఏ రైతు బంధు పథకాలూ, బీమాలూ తమను వ్యవసాయ సంక్షోభం నుండి గట్టెక్కించలేవని, తమ పురోగమన ఆలోచనలే, గ్రామగ్రామాన అంకాపూర్ గ్రామ రైతుల స్ఫూర్తిదాయక విధానాలే తమ అసలైన బంధులని, రైతు బాంధవులు గ్రహించాలి. ఇప్పుడున్న స్వార్థ రాజకీయాల వలన ఇంకో వంద సంవత్సరాలైనా తాము అప్పుల బాధలనుండి గట్టెక్కలేమని గ్రహించి, తమ విత్తనాలకు తామే ధరలు నిర్ణయించుకునేలా, తాము ఏ పంటలు పండించాలో తామే నిర్ణయించుకునేలా అంకాపూర్‌ను ఆదర్శంగా తీసుకుంటే ప్రతి గ్రామం స్వయం సమృద్ధిని సాధించడం ఖాయం. దేశం అభివృద్ధి చెందడం సులభం. పాలకులకు ఇసుమంత చిత్తశుద్ది వున్నా అంకాపూర్ గ్రామ రైతుల స్ఫూర్తిని, వాళ్ల వ్యవసాయ విధానాలను, వాళ్ల సమిష్టి తత్వాన్ని, ఆ గ్రామ మహిళా రైతుల శ్రమ తత్వాన్ని ముందుకు తీసుకెళ్లి, యావద్దేశం స్వయం సమృద్ధిని సాధించేలా చేసి విదేశీ అప్పుల నుండి బంధ విముక్తి గావించొచ్చు. మనమే ఇతర దేశాలకు ఋణాలివ్వొచ్చు. రాజకీయం వ్యాపారం కాదు. రాజకీయాలు ప్రజాసేవార్ధమనే భావన ప్రతి ఆధునిక రాజకీయవాదిలో కలగాలి. ఆచరించాలి. అప్పుడే మహాత్మాగాంధీతోపాటు స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తి నెరవేరుతుంది. అక్రమ సంపాదన అంతా జాతికి అంకితం చేయాలి.
(రేపు గాంధీ జయంతి సందర్భంగా)
- గడీల సుధాకర్ రెడ్డి
ప్రధాన కార్యదర్శి, REBS
99489 36488