అంపశయ్యపై ఆదివాసీలు!

Adivasi lives on Ampasaiah

Update: 2023-08-27 00:45 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటికీ అగ్గి రాజేస్తున్న ఆదివాసీల భూమి పోరాటాలు కనిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వ పాలనకు ముందు అంటే బ్రిటిష్, నిజాం నవాబులు, అంతకుముందు కాకతీయులు, అలాగే మౌర్య చక్రవర్తుల పాలనలో సైతం ఆదివాసీల మనుగడే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో వారి నుండి తిరుగుబాటు పోరాటాలు జరిగాయనడానికి చారిత్రక సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి.

స్వయం పాలన కోసం కాకతీయులతో పోరాడి అమరులైన సమ్మక్క సారక్క నుండి నిజాం సేనలతో పోరు చేసిన రాంజీ గోండు, కొమురం భీం వరకు అలాగే మహారాష్ట్ర, చాందా, బస్తర్, జార్ఖండ్ వంటి ప్రాంతాల్లో సెడ్మాకి బాబురావు, వీర్ నారాయణ సింగ్, బిర్సా ముండా, మాణిక్ ఖర్గ్, బల్లార్షా వంటి యుగపురుషుల తిరుగుబాటు గురించి అందరికీ తెలిసిందే. వీరిలో చాలా మంది తమ మనుగడ కోసం పోరాటంతో మొదలై భారతదేశ స్వాతంత్య్రం కోసం చివరి శ్వాస వరకు పోరాడి ఉరితీతకు లేదా కాల్చివేతకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో భద్రాచలం నుండి రంపచోడవరం, ఏలూరు దాకా జరిగిన పోరాటాన్ని అణచివేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో కొమురం భీం పోరాటాన్ని అణచివేసేందుకు నిజాం రాజు మైసూర్ మహారాజు సైనిక దళాల సహాయం తీసుకోవడం జరిగిందని చెప్తుండేవారు.

గిరిజన చట్టాలెన్ని ఉన్నా…

భూమి, నీరు, అటవీ మాదే అంటూ జరిగిన అనేక ఆదివాసీల పోరాటాలపై అధ్యయనం చేసిన నాటి ప్రభువులు, బ్రిటిష్ ప్రభుత్వాలు, అలాగే మన ప్రభుత్వాలు గిరిజనుల కోసం ప్రత్యేక చట్టాలను తెచ్చాయి. 1917లో బ్రిటిష్ వాళ్లు అప్పటి మద్రాసు రాష్ట్రంలోని ప్రస్తుత ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో భూమి బదలాయింపు, వడ్డీ వ్యాపారాన్ని నియంత్రించేందుకు 1917 చట్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాలలో కలెక్టర్ (ఏజెంట్) అనుమతి లేకుండా గిరిజనుల నుండి గిరిజనేతరులకు భూమి బదలాయింపు జరగడానికి వీలులేదన్నది ఈ చట్టం సారాంశం. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1917 చట్టాన్ని సవరించి 1959 (ఎ.పి.ఎస్.ఎ.ఎల్.టి.ఆర్. చట్టం) ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూమి బదలాయింపు నియంత్రణ చట్టాన్ని చేశారు. ఇందులో గిరిజనుల నుండి గిరిజనేతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి బదలాయింపు జరగడానికి వీలు లేదని, అలాగే కలెక్టర్ అనుమతి ప్రసక్తి సైతం లేదన్నది స్పష్టం. 1963 నుండి ఈ చట్టాన్ని తెలంగాణ జిల్లాలలోని షెడ్యూల్డు ప్రాంతాలకు వర్తింపజేశారు కానీ ఈ చట్టం వల్ల జరిగిన మేలు గురించి అడిగిన నాధుడు లేరు.

1960 దశకంలో నక్సల్స్ నేతృత్వంలో జరిగిన పీడిత ప్రజల శ్రీకాకుళ గిరిజన తిరుగుబాటు వంటి పోరాటం దాకా రాష్ట్రంలో గిరిజనుల యోగక్షేమాలు కనుక్కున్న వాళ్లు అతి తక్కువలో తక్కువ. ఆ తర్వాత ఆదివాసుల మంచి చెడుల గురించి చర్చించడం, కొత్త చట్టాలు, కొత్త సంస్థలు వచ్చాయి. అందులో ఒకటి రెగ్యులేషన్ 1 ఆఫ్ 1970, ఇది 1959 నాటి చట్టాన్ని సవరించి రెండు బలమైన గట్టి మార్పులను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజనుల నుండి గిరిజనేతరులకు జరిగే బదలాయింపులే కాదు, గిరిజనేతరుల నుండి గిరిజనేతరులకు జరిగే బదలాయింపులు కూడా చెల్లవని. రెండోవది షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూమి కలిగి ఉన్న గిరిజనేతరులు ఆ భూమిని తాము అక్రమంగా సంపాదించుకోలేదని తామే రుజువు చేసుకోవాలని. అంటే 'రుజువు చేసుకునే బాధ్యత' (బర్డెన్ ఆఫ్ ప్రూఫ్) గిరిజనేతరుల మీదనే ఉంటుంది. దీని ఫలితంగా గిరిజనుల నుండి ఫిర్యాదు లేకుండానే సంబంధిత ప్రభుత్వ అధికారి షెడ్యూల్డు ప్రాంతాలలో భూమి ఉన్న గిరిజనేతరులందరికీ నోటీసులు జారీ చేసి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ నిరూపించుకోవాలి. సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఆ భూమిని స్వాధీనం చేసుకొని భూమి లేని గిరిజనులకు ఇయ్యవచ్చునన్నది స్పష్టం.

గిరిజనుల తొలగింపూ అత్యాచారమే

1/70 చట్టం నిబంధనలకు విరుద్ధంగా గిరిజనేతరులు మరొక గిరిజనేతరుని వద్ద భూమి కొనుగోలు చేస్తే ఆ భూమిపై కొనుగోలుదారు, అమ్మకందారు ఇద్దరూ ఆ భూమిపై హక్కులు కోల్పోతారని 1993లో రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. షెడ్యూల్డ్ ప్రాంతంలో గల ప్రభుత్వ భూమిని గిరిజనేతరులకు బదలాయించడం చెల్లదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా 1/70 భూ నిబంధనల కింద గిరిజనేతరునిగానే భావించాలని 1997లో సమత, మైనింగ్ కంపెనీకి మధ్య నడిచిన కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూమి నుండి వారిని తొలగించడం లేదా వారి అటవీ భూమి హక్కుల్లో జోక్యం చేసుకోవడం, గిరిజనులకు మాయమాటలు చెప్పి వారి జీవనోపాధి అయిన వ్యవసాయం చేసుకునే భూమిని సొంతం చేసుకోవడం కూడా అత్యాచారమే అని కొత్తగా రూపొందించిన సవరణ చట్టం 2015 తెలియజేస్తుంది. గిరిజనుల కోసం ఎంతో బలమైన గట్టి చట్టాలు ఉన్నప్పటికీ గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూనే ఉంది.

రియల్ రాబందులు పెరిగి..

నక్సల్స్ నేతృత్వంలో 1960 దశకంలో నాడు ఏ అమాయకపు ఆదివాసీల కోసమైతే పోరాటాలు జరిగాయో.. అలాంటి ఆదివాసీల కోసం ఎంతో బలమైన గట్టి చట్టాలను ప్రభుత్వాలు చేశాయి. అయినప్పటికీ ఆ చట్టాలను లెక్కచేయకుండా గిరిజన భూములలో వాలుతున్న రియల్ రాబందులు కూడా మాజీ మావోయిస్టులుగా, వారి సానుభూతిపరులు గా కనిపించడం నేడు అనారోగ్యకరమైన సూచికగా చెప్పక తప్పదు. విద్య, వైద్యం, ఉపాధి పరంగా గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూనే ఉందని అత్యధికులు చెబుతున్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతమైన మందమర్రి వంటి ప్రాంతంలో గిరిజనుల మెడపై గిరిజనేతరుల కత్తి వేలాడుతుండడం, గడిచిన ఐదేళ్లలో అక్కడ 500 కోట్ల రూపాయలకు పైగా విలువ ఉన్న గిరిజనుల భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగడం చూస్తే అంపశయ్యపై ఆదివాసీలు ఉన్నారనడంలో సందేహం అక్కర్లేదు అనిపిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రపతి, గవర్నర్, ఏజెన్సీ పరిధిలోని అధికారులు ఆదివాసీల భూ సమస్యను జాతి సమస్యగా కాకుండా జాతీయ సమస్యగా గుర్తించి చర్యలు తీసుకుంటే తప్ప ఆదివాసీల అస్తిత్వం ఉండదన్నది కాదనలేని సత్యం.

అనిల్ భగత్

జర్నలిస్ట్

94917 43506

Tags:    

Similar News