మహిళా క్రికెటర్ల కాంట్రాక్టు పునరుద్ధరణకు ఈసీబీ విముఖత..?
దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా క్రీడా టోర్నీలన్నీ నిలిచిపోగా.. కనీసం దేశవాళీ క్రికెట్ కూడా ఆడే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు క్రికెటర్ల కాంట్రాక్టు పునరుద్ధరణపై సుదీర్ఘంగా సమీక్షిస్తున్నాయి. పురుష క్రికెటర్ల సంగతి పక్కన పెడితే.. ఇప్పుడిప్పుడే ఆదరణకు నోచుకుంటున్న మహిళల క్రికెట్‌కు కరోనా పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఇంగ్లాండ్‌లో మహిళా క్రికెట్‌ను బలోపేతం చేసేందుకు గతేడాది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) […]
దిశ, స్పోర్ట్స్:
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా క్రీడా టోర్నీలన్నీ నిలిచిపోగా.. కనీసం దేశవాళీ క్రికెట్ కూడా ఆడే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు క్రికెటర్ల కాంట్రాక్టు పునరుద్ధరణపై సుదీర్ఘంగా సమీక్షిస్తున్నాయి. పురుష క్రికెటర్ల సంగతి పక్కన పెడితే.. ఇప్పుడిప్పుడే ఆదరణకు నోచుకుంటున్న మహిళల క్రికెట్‌కు కరోనా పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఇంగ్లాండ్‌లో మహిళా క్రికెట్‌ను బలోపేతం చేసేందుకు గతేడాది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. దీని ప్రకారం దేశంలోని ఎనిమిది దేశవాళీ జట్లకు సంబంధించి జట్టులో ఐదుగురి చొప్పున క్రికెట్ కాంట్రాక్టులు ఇస్తామని ప్రకటించింది. దేశవాళీ క్రికెట్‌ను బలోపేతం చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్ మహిళా జట్టును పటిష్టంగా తయారు చేయాలనేదే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. కాగా, 2020 మే 1న ఈ కాంట్రాక్టు జాబితా విడుదల చేస్తామని ఈసీబీ గతేడాది అక్టోబర్‌లో ప్రకటించింది. కానీ ఇంత వరకు ఆ కాంట్రాక్టుల ఊసే ఎత్తడం లేదు.
ఈ విషయంపై ఈసీబీ వుమెన్స్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ క్లేర్ కార్నర్ స్పందిస్తూ.. 40 మందికి కాంట్రాక్టులు ఇవ్వాలనే నిర్ణయానికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నామన్నారు. కానీ కరోనా సంక్షోభం కారణంగానే జాబితా విడుదల ఆలస్యమైందన్నారు. ‘క్రికెట్ మీదే ఆధారపడి జీవిస్తున్నవారికి ఈ ఆలస్యం చాలా ఇబ్బందిని కలిగిస్తుందని తెలుసు. కానీ ఒకవైపు కరోనా సంక్షోభం, మరోవైపు ది హండ్రెడ్ లీగ్ కూడా వాయిదా పడటం వల్లే సరైన సమయంలో మహిళల కాంట్రాక్టులు ప్రకటించలేకపోయామని’ క్లేర్ చెప్పారు. ఈ ఏడాది కాంట్రాక్టు అమలులోనికి రావడం కష్టమేనని ఆమె పరోక్షంగా చెప్పారు. మరోవైపు వచ్చే వారం మహిళా క్రికెటర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని ఈసీబీ భావిస్తోంది. ఈ సమీక్షలు జరిగిన జాప్యానికి గల కారణాలను మహిళా కౌంటీ క్రికెటర్లకు వివరించనుంది. అంతేకాకుండా కొత్త కాంట్రాక్టులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో కూడా ఈ సమావేశంలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.