హరీశ్‌రావు ‘మూర్ఖుడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటల
దిశ, కమలాపూర్: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఉమామహేశ్వర గార్డెన్‌లో ఆదివారం గౌడ గర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ హరీశ్‌రావు, కేసీఆర్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాటలు నమ్మి హరీశ్ రావు హుజురాబాద్‌లో అడ్డా పెట్టి నా మనుషులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ టార్చర్ పెడుతున్నారని మంత్రి హరీష్ రావు, కేసీఆర్ లపై మండిపడ్డారు. ఒకనాడు కేసీఆర్ మాట్లాడితే తెలంగాణ జాతి పులకరించేదని, ఇప్పుడు మాట్లాడితే టీవీలు […]
దిశ, కమలాపూర్: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఉమామహేశ్వర గార్డెన్‌లో ఆదివారం గౌడ గర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ హరీశ్‌రావు, కేసీఆర్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాటలు నమ్మి హరీశ్ రావు హుజురాబాద్‌లో అడ్డా పెట్టి నా మనుషులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ టార్చర్ పెడుతున్నారని మంత్రి హరీష్ రావు, కేసీఆర్ లపై మండిపడ్డారు.
ఒకనాడు కేసీఆర్ మాట్లాడితే తెలంగాణ జాతి పులకరించేదని, ఇప్పుడు మాట్లాడితే టీవీలు బంద్ చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. డబ్బు సంచులు, పోలీసులను పంపే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ కు ఇటువంటి గతి ఎందుకు పట్టిందో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. తనతో 20 ఏళ్లు ఉద్యమ బిడ్డగా కలిసి పని చేసిన మంత్రి హరీశ్ రావు, హుజరాబాద్ లో అడ్డా పెట్టి చేస్తున్న పనులు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజానీకం చీదరించుకుంటుందన్నారు. ఇప్పటికైనా ఆలోచించుకొని పరువు కాపాడుకోవాలని హరీశ్ రావుకు హితవు పలికారు.
రాత్రిపూట దొంగలలాగా నా మనషులను బెదిరించే అధికారం ఎవరిచ్చారని, కేసీఆర్ ప్రగతి భవన్‌లో కూర్చొని ఆజ్ఞాపిస్తే దానిని అమలు చేస్తున్న మూర్ఖుడు హరీశ్ రావు అని ఘాటుగా విమర్శించారు. హరీశ్ రావు ఇటువంటి పిచ్చి పనులు ఆపకపోతే నీ భరతం పట్టడం ఖాయమని హెచ్చరించారు. ఆనాడు కేసీఆర్ చెప్పిన విధంగా కత్తి ఆంధ్రుడిది పొడిచే వాడు తెలంగాణోడు (మనోడు) అన్నట్టుగా, ఇప్పుడు కత్తి కేసీఆర్ అయితే పొడిచేవాడు హరీశ్ రావు అని గుర్తుంచు కోవాలన్నారు. 2023 వరకే కేసీఆర్ కు అధికారం ఉంటుందని, ఇక్కడికి వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులు మీ నియోజకవర్గాల్లో కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందజేయాలన్నారు. ఇక్కడికి వచ్చే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రేమతో, ప్రజల మెప్పు తో గెలవలేదని, ఓటుకు రెండు వేల రూపాయలు ఇచ్చి గెలిచారన్నారు. రాబోయే ఎన్నికల్లో నీ నియోజకవర్గానికి వచ్చి నీ భరతం పడతానని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో రజాకార్ల రాజ్యం విన్నాం కానీ ఇప్పుడు కేసీఆర్ పాలన రజాకార్ల రాజ్యాన్ని మించిపోయిందన్నారు. కేసీఆర్ అధికారం అంతం కాకపోతే, తెలంగాణ మేధావులారా, ప్రజలారా, రాజకీయ నాయకులారా, ప్రభుత్వ ఉద్యోగులరా ఈ సాంప్రదాయం ఇలానే కొనసాగితే ఇక్కడ చీకటి రాజ్యానికి, బానిసత్వానికి దారితీస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని గౌడ కులస్తులకు మోపెడ్ వాహనాలు ఇవ్వాలని, కల్లు మండువలు ఏర్పాటు చేయాలని, గౌడ సంఘాలకు ఐదు నుండి పది ఎకరాల భూమి ఇచ్చి ఈత వనాలు ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా గౌడ కులస్తులకు గౌడ బంధు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జితేందర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, నందీశ్వర్ గౌడ్, ధర్మారావు, పద్మ, తదితరులు పాల్గొన్నారు.