ఇప్పటికీ వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందరే!

దిశ, తెలంగాణ బ్యూరో : భూకబ్జా ఆరోపణలపై వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ నుంచి తొలగించారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం కూడా తెలిపారు. ఇదంతా జరిగి నెల రోజులైంది. వైద్యారోగ్య మంత్రిత్వశాఖ బాధ్యతలను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే చూసుకుంటున్నారు. మంత్రివర్గంలో ఈ మార్పులు చేర్పులు జరిగినా ఆ మంత్రిత్వశాఖకు సంబంధించిన వివిధ వెబ్‌సైట్లలో మాత్రం ఇంకా మంత్రి స్థానంలో ఈటల రాజేందర్ పేరు, ఫోటోలే దర్శనమిస్తున్నాయి. ఐటీ […]

Update: 2021-06-02 22:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : భూకబ్జా ఆరోపణలపై వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ నుంచి తొలగించారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం కూడా తెలిపారు. ఇదంతా జరిగి నెల రోజులైంది. వైద్యారోగ్య మంత్రిత్వశాఖ బాధ్యతలను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే చూసుకుంటున్నారు. మంత్రివర్గంలో ఈ మార్పులు చేర్పులు జరిగినా ఆ మంత్రిత్వశాఖకు సంబంధించిన వివిధ వెబ్‌సైట్లలో మాత్రం ఇంకా మంత్రి స్థానంలో ఈటల రాజేందర్ పేరు, ఫోటోలే దర్శనమిస్తున్నాయి. ఐటీ రంగంలో మేటి అని గొప్పగా చెప్పుకుంటున్నా మారిన పరిస్థితులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడంలో మాత్రం నత్తతో పోటీ పడుతోంది ఆ విభాగం.

ఈటల రాజేందర్‌పై ఏప్రిల్ 30వ తేదీన భూ కబ్జా ఆరోపణలు వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను మే నెల 2వ తేదీన కేబినెట్ నుంచి ఉద్వాసన పలికారు. ఆ తర్వాత నుంచి వైద్యారోగ్య మంత్రిగా కేసీఆరే కొనసాగుతున్నారు. జూన్ 2వ తేదీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రానే వచ్చింది. సరిగ్గా నెల రోజులైంది. కానీ వెబ్‌సైట్లలో మాత్రం వివరాలను అప్‌డేట్ చేయలేదు. కేవలం పేరు, ఫోటోలు మాత్రమే కాదు. మంత్రిత్వ శాఖ అడ్రస్ కూడా ఇంకా పాతదే కొనసాగుతోంది. పాత సచివాలయాన్ని కూల్చివేసి ఏడాది అవుతున్నా అడ్రస్ మాత్రం మారలేదు. ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా వివరాలను అందించడానికి ఉద్దేశించిన వెబ్‌సైట్‌లో ఇంకా పాత అడ్రస్, పాత వివరాలే ఉండడంతో ఆ వెబ్‌సైట్ నిర్వహణకే అర్థం లేకుండా పోయింది.

ఐటీ మంత్రిత్వశాఖ బాధ్యతలను నిర్వహిస్తున్న మంత్రి కేటీఆర్ నిత్యం ట్విట్టర్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఐటీ మార్పులను కాలానుగుణంగా అన్వయించుకుంటున్నా వెబ్‌సైట్ల మార్పుల విషయంలో మాత్రం ఇంకా దృష్టి పెట్టలేదు. అంతేగాక గతేడాది జూలై వరకూ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శాంతి కుమారి అటవీ శాఖకు బదిలీ అయ్యారు. కానీ ఇప్పటికీ వైద్యారోగ్య శాఖనే నిర్వహిస్తున్నట్లు కొన్ని వెబ్‌సైట్లలో దర్శనమిస్తున్నది.

వైద్య విద్య విభాగం (డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్-డీఎంఈ), ప్రజారోగ్యం-కుటుంబ సంక్షేమం (డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్), తెలంగాణ వైద్య విధాన పరిషత్, తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, డిపార్టుమెంట్ ఆఫ్ ఆయుష్ తదితర వైద్యారోగ్య విభాగాల్లో ఇప్పటికీ ఆ శాఖ మంత్రిగా ఈటల రాజేందరే కొనసాగుతున్నట్లు ఆయా విభాగాల వెబ్‌సైట్లు దర్శనమిస్తున్నాయి. ఈటల రాజేందర్‌పై గంటల వ్యవధిలో నిర్ణయాలు తీసుకుని విజిలెన్స్, రెవెన్యూ శాఖల అధికారులతో దర్యాప్తు చేయిస్తున్న ప్రభుత్వం ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత నెల రోజులు దాటినా వెబ్‌సైట్లలో మార్పులు చేయకపోవడం గమనార్హం.

Tags:    

Similar News