పట్నం నుంచి పల్లెకు.. బట్టబయలైన నకిలీ అధికారి దందా..
దిశ, కుకునూరు : చెడు వ్యసనాలకు బానిసై ఈజీ మనీ కోసం కొందరు నకిలీ ఆఫీసర్ అవతారమెత్తుతున్నారు. ప్రధానంగా వ్యాపారులనే టార్గెట్ చేసి యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. వసూళ్లు చేసిన సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడుపుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన నేరగాళ్లు ఇప్పుడు పల్లెల్లోనూ విస్తరిస్తున్నారు. తాజాగా ఓ ఫేక్ అధికారి కుకునూరు పోలీసులకు చిక్కడంతో అసలు వ్యవహారం బట్టబయలైంది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వ్యాపారులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఓ […]
దిశ, కుకునూరు : చెడు వ్యసనాలకు బానిసై ఈజీ మనీ కోసం కొందరు నకిలీ ఆఫీసర్ అవతారమెత్తుతున్నారు. ప్రధానంగా వ్యాపారులనే టార్గెట్ చేసి యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. వసూళ్లు చేసిన సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడుపుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన నేరగాళ్లు ఇప్పుడు పల్లెల్లోనూ విస్తరిస్తున్నారు. తాజాగా ఓ ఫేక్ అధికారి కుకునూరు పోలీసులకు చిక్కడంతో అసలు వ్యవహారం బట్టబయలైంది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వ్యాపారులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఓ నకిలీ అధికారిని పోలీసులు పట్టుకున్నారు. కుకునూరు సీఐ బాలసురేశ్ బాబు కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వజ్జల. శ్రీనివాస్ కుమార్ జల్సాలకు అలవాటుపడ్డాడు. ఈజీ మనీ కోసం నకిలీ పుడ్ ఇన్స్‌స్పెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ ఆఫీసర్, డాక్టర్ గా చెలామణివుతూ అక్రమ వసూళ్ల దందాకు పాల్పడుతున్నట్టు సీఐ వెల్లడించారు.
కాగా, ఈ నెల 26 న కుకునూరు మండలం కమ్మరిగూడెంకు చెందిన చిలకల.శరత్ బాబు అనే వ్యాపారి వద్దకు కారులో శ్రీనివాస్ కుమార్ తో పాటు అతని అసిస్టెంట్ వినోద్ లాల్ వచ్చి తాము పొల్యూషన్ కంట్రోల్ ఆఫీసర్ ని చెప్పి షాపులో తనిఖీ చేసారని తెలిపారు.ఈ క్రమంలో నిషేధిత ప్లాస్టిక్ సంచులు ఉండటంతో రూ.10 వేలు జరిమానా విధించి చెల్లించాలని బెదిరించినట్లు తెలిపారు.రూ 3వేలు ముట్టజెప్పడంతో అక్కడినుంచి వెళ్లిపోయారని,అనుమానం వచ్చి బాధితుడు కుకునూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడని సీఐ పేర్కొన్నారు. నిందితులు బసులో ప్రయాణిస్తున్న క్రమంలో సమాచారం మేరకు ఆంధ్ర-తెలంగాణ ఇంటర్ చెక్ పోస్టు వద్ద తనిఖీ చేయడంతో పట్టుబడ్డారని తెలిపారు.
ఆదివారం శ్రీనివాస్ కుమార్, వినోద్ లాల్, కారు డ్రైవర్ చైతన్యలను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి కారు, రూ.3వేల నగదు, నకిలీ గుర్తింపు కార్డు, కేస్ ఫైల్ పత్రాలు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. కాగా, రెండు రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్‌లో నిందితులపై పలు కేసులు ఉన్నాయని సీఐ బాలసురేశ్ బాబు, ఎస్సై పైడిబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏజెన్సీలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని, షాపుల వద్దకు అపరిచిత వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు.