దుబ్బాకలో.. పనిచేసేవారికే పట్టం

దిశ ప్రతినిధి, మెదక్: ‘ప్రతిసారి ఎన్నికల ముందు ఎందరో నాయకులు వస్తున్నరు. ఎన్నో హామీలిస్తున్నరు. ఆ తర్వాత మరుస్తున్నరు. ఇలా అయితే కుదరదు. ఈ ఉప ఎన్నికల్లో మాకు ఇచ్చిన హామీలు పక్కాగా అమలు చేస్తామనే నాయకుడికే ఓట్లేసి గెలిపిస్తాం’ అంటూ దుబ్బాక ఉప పోరు బరిలో నిల్చున్న ఆయా పార్టీల నాయకులకు నియోజకవర్గ ప్రజలు తెగేసి చెబుతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలన్నీ ఇంటింటి ప్రచారం జోరుగా సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేతల […]

Update: 2020-10-20 20:48 GMT

దిశ ప్రతినిధి, మెదక్: ‘ప్రతిసారి ఎన్నికల ముందు ఎందరో నాయకులు వస్తున్నరు. ఎన్నో హామీలిస్తున్నరు. ఆ తర్వాత మరుస్తున్నరు. ఇలా అయితే కుదరదు. ఈ ఉప ఎన్నికల్లో మాకు ఇచ్చిన హామీలు పక్కాగా అమలు చేస్తామనే నాయకుడికే ఓట్లేసి గెలిపిస్తాం’ అంటూ దుబ్బాక ఉప పోరు బరిలో నిల్చున్న ఆయా పార్టీల నాయకులకు నియోజకవర్గ ప్రజలు తెగేసి చెబుతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలన్నీ ఇంటింటి ప్రచారం జోరుగా సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేతల ముందు ఓటర్లు పలు డిమాండ్లను ఉంచుతున్నారు. ప్రధానంగా అధికార పార్టీ గతంలో ఇచ్చిన హామీలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయడం, నేతన్నల కోసం టెక్స్‌టైల్స్ ఏర్పాటు, సిద్దిపేట తరహా వైద్య సౌకర్యం, బీడీ కార్మికులకు చేతినిండా పని కల్పించడం. తదితర పనులు చేస్తామని నమ్మదగిన హామీ ఇచ్చేవారికే తాము పట్టం కడతామని నియోజకవర్గ ఓటర్లు స్పష్టం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం.. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టడంతో దుబ్బాక ప్రాంత సమస్యలు పరిష్కారమవుతాయని స్థానికులు భావించారు. దుబ్బాక పాఠశాలలో చదివిన కేసీఆర్ తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతారని అందరూ అనుకున్నారు. కానీ నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మినహా, ప్రత్యేక పనులు చేపట్టిన దాఖలాలు లేవు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవడం వారిని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. అయితే ప్రతి ఎన్నికల ముందు నాయకులు వచ్చి హామీలివ్వడం, అవి అమలుకు నోచుకోకపోవడం పరిపాటిగా మారింది. దీంతో ఈ ఉప ఎన్నికల్లో ఆ పద్ధతికి స్వస్తీ పలుకాలని నియోజకవర్గ ప్రజలు భావించి తమ డిమాండ్లను సాధించుకొనే మార్గాల కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలో ఎన్నో హామీలిచ్చి మరిచిన అధికార పార్టీని ప్రశ్నిస్తూనే, ఇతర పార్టీల నాయకుల ముందు పలు డిమాండ్లు ఉంచుతున్నారు. వాటిని పక్కాగా తీరుస్తామనే వారు ముందుకు రావాలని స్పష్టం చేస్తున్నారు. నియోజకవర్గంలో సరైన విద్య, వైద్యం లేక మూడు దశాబ్దాలుగా దుబ్బాక నుండి వలసలు మొదలయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రమంగా మూడు జిల్లాల వ్యాపార కేంద్రంగా ఉండే దుబ్బాక-లచ్చపేట ఉనికిని కోల్పోయిందని, దుబ్బాక వెనుకబడిన ప్రాంతంగా ఉండడానికి వీల్లేదని, పూర్వ వైభవం తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

రెవెన్యూ డివిజన్‌ చేయాలే..

దుబ్బాకను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలనేది దశాబ్దాల కలగా ఉంది. ప్రస్తుతం ఉప ఎన్నిక వేళ దుబ్బాక రెవెన్యూ డివిజన్ అంశం ప్రధానంగా తెరపైకి వచ్చింది. అవసరమైతే రెవెన్యూ డివిజన్ సాధనకు పోరుబాట పట్టేందుకు కూడా సిద్ధమని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు దుబ్బాక అన్ని విధాలా అర్హత కలిగినదని, దుబ్బాకలో ఇప్పటికే దౌల్తాబాద్, రాయపోల్, తొగుట, మిరుదొడ్డి మండలాల వ్యవసాయ శాఖ ఏడీఏ కార్యాలయం ఉందని, డివిజన్ కేంద్రం ఏర్పాటుతో ఆర్డీవో కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు వస్తే తమ ప్రాంత అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని, అందుకు ఎట్టిపరిస్థితుల్లో దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రధాన డిమాండ్‌గా ప్రచారానికి వచ్చిన నాయకుల ముందు పెడుతున్నారు.

టెక్స్ టైల్స్ ఏర్పాటు చేయాల్సిందే..

సిద్దిపేట జిల్లాలో ఎక్కువగా చేనేత కార్మికులు వుండే ప్రాంతం దుబ్బాక అని, నేతన్నలకు ఇక్కడ ఉపాధి లేకపోవడంతో సిరిసిల్ల, షోలపూర్, భివండి, సూరత్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉందని నియోజకవర్గవాసులు చెబుతున్నారు. ఉపాధి అవకాశాలు సరిగ్గా లేకపోవడంతో ఈ ప్రాంత నేతన్నల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, 2014 సాధారణ ఎన్నికల్లో దుబ్బాకలో నేతన్నల కోసం టెక్స్ టైల్స్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పటికీ దానిని నెరవేర్చలేదని గుర్తు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లోనైనా దీనిపై స్పష్టమైన హామీనిచ్చి, నేత కార్మికులందరికీ డబుల్ బెడ్ రూమ్, తదితర 16 డిమాండ్లను పరిష్కరిస్తామనే భరోసానిచ్చేవారినే గెలిపిస్తామంటున్నారు.

వైద్యంలో వెనుకబడిన నియోజకవర్గం..

దుబ్బాక ప్రజలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షలాగే మారింది. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఆరేళ్లయినా దుబ్బాకలో వందపడకల ఆస్పత్రి పూర్తి కాలేదు. సిద్దిపేటతో పాటు దుబ్బాకలోనూ అదే రోజు వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. సిద్దిపేటలో ఆస్పత్రి పూర్తయి వైద్య సేవలు అందుతున్నా దుబ్బాకలో మాత్రం ఆస్పత్రి శంకుస్థాపనకే పరిమితమైంది. దీంతో అత్యవసర పరిస్థితిలో ఇక్కడి ప్రజలు సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఇకపై నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలు మెరుగు పడితేనే ఈ ప్రాంతగతి మారుతుందని ఉద్యోగులు, విద్యావంతులు బలంగా విశ్వసిస్తున్నారు. మరి వీటిని కల్పించేందుకు సిద్ధంగా ఉన్నవారు ఈ ఎన్నికల్లో ఓట్లు అడుగాలని వారు తెగేసి చెబుతున్నారు.

భూంపల్లి మండలం కావాల్సిందే..

దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లోని కొన్ని గ్రామాలను కలిపి అక్బర్ పేట-భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలతో భూంపల్లి మండలం ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా రోజుల నుండి ఉన్నది. సోలిపేట రామలింగారెడ్డి భూంపల్లిని మండల కేంద్రం చేస్తారనే ప్రచారం అప్పట్లో బాగా జరిగింది. కానీ ఇప్పటికీ ఆ దిశగా సర్కారు ఏమీ చేయడం లేదు. ఈ విషయంపై ప్రజలు అడిగితే మల్లన్నసాగర్ నిర్మాణం తర్వాత ముంపులో మునిగిన గ్రామాలు మినహా మిగిలిన (పాత మిరుదొడ్డి మండలంలోని) గ్రామాలను మిరుదొడ్డిలో విలీనం చేసి, భూంపల్లి మండలాన్ని ఏర్పాటు చేస్తారని చెబుతూ వస్తున్నారు. కానీ అవేవీ కాదని, భూంపల్లి-అక్బర్ పేట మండలం వెంటనే కావాల్సిందేనని ఆ ప్రాంత ప్రజలు ఈ ఎన్నికల సందర్భంగా మరోసారి తెరపైకి తెస్తున్నారు.

బీడీ కార్మికులకు జీవనోపాధి కల్పించాలి..

దుబ్బాక నియోజకవర్గంలో బీడీలు చుడుతూ జీవనం సాగించే వారు ఎక్కువగా ఉంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పీఎఫ్ కలిగిన కార్మికులకే పింఛన్ ఇస్తున్నది. సుమారు 27వేల మంది పీఎఫ్ సదుపాయం లేని వారు బీడీలు చుడుతున్నారు. బీడీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడంతో మహిళలకు ఉపాధి కరువైంది. దీంతో తమకు ప్రత్యామ్నాయ ఉపాధిని చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 75 శాతం బీడీ పరిశ్రమలు లాకౌట్ కావడంతో వీధిన పడిన కార్మికుల కోసం సీఎం చొవర చూపాలని గతంలో నుండి డిమాండ్ చేస్తున్నారు. గజ్వేల్, తూప్రాన్, చేగుంట వరకు పరిమితమైన పరిశ్రమలను దుబ్బాక వరకు విస్తరింపజేయాలని కూడా కోరుతున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ డిమాండ్లను మరోసారి నాయకుల ముందు పెడుతున్నారు. మరి ఈ ఎన్నికల రూపంలోనైనా నియోజకవర్గ సమస్యలు పరిష్కారమవుతావేమో వేచి చూడాలి.

Tags:    

Similar News