దుబ్బాకలో.. అతివలే కీలకం!

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక ఉప పోరులో అతివల ఓట్లే కీలకం కానున్నాయి. డ్వాక్రా సంఘాల్లోని మహిళల ఓట్లకు డిమాండ్ పెరిగింది. దుబ్బాక సిట్టింగ్ స్థానాన్ని భారీ ఆధిక్యంతో సాధించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ చూస్తుండగా, ఎలాగైనా నియోజకవర్గంలో పాగా వేయాలని కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. ఆ పార్టీల ఆశలకు ప్రాణం పోసేది మహిళలే కావడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల మహిళా ప్రజాప్రతినిధులు, నాయకురాళ్లు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ తొలిసారిగా ఇద్దరు మహిళలు […]

Update: 2020-10-21 20:31 GMT

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక ఉప పోరులో అతివల ఓట్లే కీలకం కానున్నాయి. డ్వాక్రా సంఘాల్లోని మహిళల ఓట్లకు డిమాండ్ పెరిగింది. దుబ్బాక సిట్టింగ్ స్థానాన్ని భారీ ఆధిక్యంతో సాధించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ చూస్తుండగా, ఎలాగైనా నియోజకవర్గంలో పాగా వేయాలని కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. ఆ పార్టీల ఆశలకు ప్రాణం పోసేది మహిళలే కావడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల మహిళా ప్రజాప్రతినిధులు, నాయకురాళ్లు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ తొలిసారిగా ఇద్దరు మహిళలు బరిలో నిల్చున్నారు. ఒకరు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత కాగా, మరొకరు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి కత్తి కార్తీక పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మహిళల ఓట్లు ఎటు పడుతాయోననే టెన్షన్ ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో నెలకొంది.

దుబ్బాక నియోజకవర్గంలో 1,98,807 మంది ఓటర్లుండగా, అందులో 1,00,779 మంది మహిళా ఓటర్లున్నారు. పురుషులు 98,028 మంది మాత్రమే ఉన్నారు. దీంతో దుబ్బాక ఉపపోరులో అతివల ఓట్లే కీలకం కానున్నాయి. ప్రధానంగా దుబ్బాకలో చేనేత, బీడీ కార్మికులతో పాటు వ్యవసాయ మహిళా రైతులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యం మహిళలపై ఆధారపడి ఉండటంతో మహిళల ఓట్లు రాబట్టేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

అన్ని మండలాల్లో వారే ఎక్కువ..

దుబ్బాక శాసనసభ పరిధిలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, నార్సింగి, చేగుంట, గజ్వేల్ మండలాలన్నింటిలో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఉన్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే.. దుబ్బాకలో 55,208 ఓటర్లకుగానూ 27,725 పురుష ఓటర్లుండగా, 27,983 మంది మహిళా ఓటర్లు, మిరుదొడ్డిలో 31,762 ఓటర్లకుగానూ 15,586 పురుషులు, 16,176 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే తొగుటలో 26,751 ఓటర్లకుగానూ 13,268 పురుషులు, 13,483 మంది మహిళా ఓటర్లు ఉండగా, దౌల్తాబాద్‌లో 23,032 మంది ఓటర్లకుగానూ 11,466 పురుష ఓటర్లు, 11,566 మహిళా ఓటర్లున్నారు. రాయపోల్ మండలంలో 20,513 మంది ఓటర్లకుగానూ 10,229 పురుషులు, 10,284 మంది మహిళా ఓటర్లు ఉంటే, చేగుంట మండలంలో 32,829 మంది ఓటర్లుండగా 15,956 పురుషులు, 16,873 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే నార్సింగిలో 8,215 ఓటర్లకుగానూ 4,031 పురుషులు, 4,184 మహిళా ఓటర్లు, గజ్వేల్ మండలం చిన్న ఆరెపల్లి గ్రామంలో 446 ఓటర్లకుగానూ 217 పురుషులు, 229 మహిళా ఓటర్లు ఉన్నారు. సర్వీస్ ఓట్లలో 50 పురుషులు, ఒక మహిళ, మొత్తంగా 51 మంది ఉన్నారు.

తొలిసారిగా ఇద్దరు మహిళా అభ్యర్థులు..

దుబ్బాక నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి మహిళా అభ్యర్థులెవరూ బరిలో నిల్చోలేదు. కానీ సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఏర్పడిన ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 23 మంది బరిలో నిలిస్తే అందులో 21 మంది పురుష అభ్యర్థులు కాగా, ఇద్దరు మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి సోలిపేట సుజాత కాగా, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి కత్తి కార్తీక పోటీ చేస్తున్నారు. దొమ్మాట నియోజకవర్గంగా ఉన్న దుబ్బాక, శాసనసభ స్థానాల పునర్విభజనలో దుబ్బాక నియోజక వర్గం ఏర్పడింది. 1957లో తొలి ఎన్నిక జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో నాలుగు సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టీఆర్ఎస్, నాలుగు సార్లు టీడీపీ, మరోసారి కాంగ్రెస్(ఐ) అభ్యర్థి గెలుపొందగా, ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. వీరందరూ పురుషులు కాగా మహిళలు ఎవరూ బరిలో నిలవలేదు. ఈ సారి ఇద్దరు మహిళలు ఎన్నికల బరిలో నిలబడి పురుష అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందితే కూడా తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు ఉంటుంది.

మహిళా ప్రజాప్రతినిధులతో ప్రచారం

దుబ్బాక ఉప పోరులో ఇద్దరు మహిళా అభ్యర్థులు పోటీలో నిలవడం, నియోజకవర్గంలో మహిళా ఓటర్లు అధికంగా ఉండడంతో ఆయా పార్టీలు మహిళా ప్రతినిధులు, నాయకురాళ్లతో హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, సిద్దిపేట జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మతో పాటు సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోక వర్గ పరిధిలోని మహిళా సర్పంచులు, ఎంపీటీసీలు ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రచారం చేస్తుండగా, ఇటీవలే తొగుట ఎంపీపీ లత కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మరో ప్రధాన పార్టీయైనా బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావుకు ముద్దతుగా బీజేపీ జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణతోపాటు రాష్ట్రంలోని బీజేపీ మహిళా కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర మహిళా నాయకురాళ్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో మహిళా అభ్యర్థి కత్తి కార్తీక ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ ఈ ప్రాంతవాసి కాకపోవడంతో ఆమెకు పెద్దగా ఇక్కడి ప్రాంత మహిళల మద్దతు లభించడం లేదనే చర్చ నడుస్తున్నా, తనస్థాయిలో తాను ప్రచారం కొనసాగిస్తూ పలువురి మహిళల మద్దతును కూడగట్టుకుంటున్నది.

స్వయం సంఘాలతో సమావేశాలు

ప్రధానంగా మహిళా ప్రజాప్రతినిధులు, నాయకురాళ్లంతా స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళా ఓటర్ల దగ్గరికి పరుగులు పెడుతున్నారు. సంఘం అధ్యక్షురాలు, కార్యదర్శులతో మాట్లాడుతూ సంఘంలోని ఓట్లన్ని తమ అభ్యర్థికి వేయాలని అభ్యర్థిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మహిళా సంఘాలకు ఏ విధంగా మేలు చేస్తామనే విషయాన్ని వివవరిస్తూ గెలిపించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News