మేకులు కొట్టకుండానే హ్యాంగింగ్!
దిశ, వెబ్‌డెస్క్ : సొంతిల్లు ఉంటే పర్వాలేదు కానీ.. అద్దె ఇంట్లో ఉంటే మాత్రం ఓ కండిషన్ అందరినీ తెగ ఇబ్బంది పెడుతుంది. అదేనండి ‘గోడలకు మేకులు కొట్టకూడదు’ అనే రూల్. ఆ రూల్ వినగానే.. మరి టీవీ ఎక్కడ హ్యాంగ్ చేసుకోవాలి? బట్టలు, వాల్ క్లాక్ ఎక్కడ తగిలించాలి? ఫ్యామిలీ ఫొటోను బీరువాకే అంకితం చేయాలా? వంటి చాలా చాలా ప్రశ్నలు మన మైండ్‌లో మెదులుతాయి.. కానీ ఏం చేయలేం. అయితే ఓ కుర్రాడు.. దీనికి […]
దిశ, వెబ్‌డెస్క్ : సొంతిల్లు ఉంటే పర్వాలేదు కానీ.. అద్దె ఇంట్లో ఉంటే మాత్రం ఓ కండిషన్ అందరినీ తెగ ఇబ్బంది పెడుతుంది. అదేనండి ‘గోడలకు మేకులు కొట్టకూడదు’ అనే రూల్. ఆ రూల్ వినగానే.. మరి టీవీ ఎక్కడ హ్యాంగ్ చేసుకోవాలి? బట్టలు, వాల్ క్లాక్ ఎక్కడ తగిలించాలి? ఫ్యామిలీ ఫొటోను బీరువాకే అంకితం చేయాలా? వంటి చాలా చాలా ప్రశ్నలు మన మైండ్‌లో మెదులుతాయి.. కానీ ఏం చేయలేం. అయితే ఓ కుర్రాడు.. దీనికి పరిష్కారం కనిపెట్టాడు. మేకులు కొట్టకుండానే వస్తువులు వేలాడదీసుకోవచ్చు. ఇంతకీ ఎవరా కుర్రాడు? అతడు ఏం కనిపెట్టాడు?
దుబాయ్‌లో నివసిస్తున్నభారత సంతతి కుర్రాడు ఇషిర్ వాద్వా ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. తన స్కూల్ ప్రాజెక్టు కోసం రూపొందించిన ‘క్లాపిట్’ అనే ప్రొడక్ట్ ద్వారా గోడపై దేన్నయినా హ్యాంగ్ చేయొచ్చని నిరూపించాడు. ఇందులో భాగంగా.. ముందు స్టీల్ టేపులను గోడకు అతికిస్తారు. ఆ తరువాత నియోడిమియమ్ మ్యాగ్నెట్‌ను వాడి ఆ టేపులు గోడకు బలంగా అతుక్కొని ఉండేలా చేస్తారు. ఇదే తను చేసిన ప్రాజెక్ట్. స్కూల్లో లెవల్‌లో ఈ ప్రాజెక్ట్‌కు గాను ప్రైజ్ కూడా అందుకున్న ఇషిర్.. దీని ద్వారా ఎంత బరువునైనా వేలాడదీయొచ్చని చెబుతున్నాడు. తన ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీని కూడా మేకులు అవసరం లేకుండానే హ్యాంగ్ చేసి నిరూపించాడు కూడా.
‘ఇది ప్రతి ఇంట్లో ఉండే సమస్యే. మేకులు కొట్టడం వల్ల గోడలు డ్యామేజ్ అవుతుంటాయి, గోడలకు రంధ్రం చేయడానికి లేబర్ కావాలి, డస్ట్ పొల్యూషన్ ఏర్పుడుతుంది.. ఇలాంటి కొన్ని సమస్యలు ఫేస్ చేస్తుంటాం. అందుకే యూఎస్‌లో ఇంజనీరింగ్ చేస్తున్న అన్నయ్య అవిక్‌తో కలిసి ఈ సమస్యకు పరిష్కారం చూపించాలనుకున్నాను. అప్పుడు రెండు స్టీల్ టేప్స్, ఓ స్ట్రాంగ్ మ్యాగ్నెట్‌తో ఓ పరిష్కారం కనిపించింది. ఇందుకోసం ఆల్ఫా స్టీల్ టేప్, బేటా స్టీల్ టేప్ ఉపయోగిస్తున్నాం. రెండు మ్యాగ్నెట్‌లు ఒక్కచోటుకు వస్తే.. క్లాప్ సౌండ్ ధ్వనిస్తుంది. అందుకే దీనికి క్లాపిట్ అనే పేరు పెట్టాం’ అని ఇషిర్ తెలిపాడు.
ఇషిర్ తండ్రి సుమేశ్ వాద్వా ఉద్యోగం చేస్తుండగా.. కొడుకు చేసిన ఈ ప్రయోగానికి ఫిదా కావడమే కాకుండా దాన్నే బిజినెస్‌గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇషిర్.. ఇంజినీరింగ్ చదువుతున్న తన అన్న అవిక్, తండ్రి సాయంతో దీనికి సంబంధించిన ప్రొడక్ట్‌ను తయారుచేయడానికి సిద్ధమయ్యాడు. మొదట ఈ ప్రొడక్ట్‌ను దుబాయ్‌లో లాంచ్ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేస్తామని సుమేశ్ చెబుతున్నాడు.