తండ్రిని చంపిన వాళ్లపై పగబట్టింది.. ఐఏఎస్ అయ్యింది.. ఉరిశిక్ష పడేలా చేసింది

దిశ,వెబ్‌డెస్క్: అమ్మ కనిపించే దైవం అయితే.. నాన్న కనిపించకుండా, నడిపించే దైవం.. నాన్నంటే భద్రత, భరోసా, బాధ్యత.. నాన్నంటే రిలేషన్ మాత్రమే కాదు.. ఎప్పటికీ అర్థం కాని ఓ ఎమోషన్.. ఆయన మనసు అర్థం కాని అంతరిక్షం. అలాంటి నాన్నని ఎవరో కర్కోటకులు హత్య చేస్తే.., తండ్రే లోకంగా బ్రతికే రెండున్నర నెలల వయస్సు, అంతకంటే చిన్నవయస్సున్న పిల్లలు పెద్దైన తర్వాత ఏం చేస్తారు? మనదేశంలో ఫేక్ ఎన్ కౌంటర్లు జరుగుతుంటాయి. ఆ ఫేక్ ఎన్ కౌంటర్లలో […]

Update: 2021-03-01 10:24 GMT

దిశ,వెబ్‌డెస్క్: అమ్మ కనిపించే దైవం అయితే.. నాన్న కనిపించకుండా, నడిపించే దైవం.. నాన్నంటే భద్రత, భరోసా, బాధ్యత.. నాన్నంటే రిలేషన్ మాత్రమే కాదు.. ఎప్పటికీ అర్థం కాని ఓ ఎమోషన్.. ఆయన మనసు అర్థం కాని అంతరిక్షం. అలాంటి నాన్నని ఎవరో కర్కోటకులు హత్య చేస్తే.., తండ్రే లోకంగా బ్రతికే రెండున్నర నెలల వయస్సు, అంతకంటే చిన్నవయస్సున్న పిల్లలు పెద్దైన తర్వాత ఏం చేస్తారు?

మనదేశంలో ఫేక్ ఎన్ కౌంటర్లు జరుగుతుంటాయి. ఆ ఫేక్ ఎన్ కౌంటర్లలో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటే.., నిందితులు మాత్రం వ్యవస్థలోని లోపాల్ని తమకి అనుకూలంగా మార్చుకొని, దర్జాగా, ధైర్యంగా బయట తిరుగుతూ అసలే పాపం ఎరగనట్టు, తాము ఏ తప్పూ చేయనట్టు హాయిగా బ్రతికేస్తుంటారు. అలాంటి ఒక నకిలీ ఎన్‌కౌంటర్ దాదాపు 39 సంవత్సరాల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో జరిగింది. ఆ రోజు 13 మంది మరణించారు. వారిలో డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ కృష్ణ ప్రతాప్ సింగ్ (కేపీ సింగ్) కూడా ఉన్నారు. ఆయన్ని చంపేస్తే చిన్నపిల్లలైన కూతుళ్లు కింజల్ సింగ్, ప్రంజల్ సింగ్ లు.., తన తండ్రిని పొట్టనపెట్టుకున్న దుర్మార్గులను కోర్టుకీడ్చి, అమ్మ కన్నీళ్లకు లెక్క చెప్తారని హంతకులు కూడా ఊహించి ఉండరు.

కేపీసింగ్ 1982లలోఉత్తర్ ప్రదేశ్ గోండా జిల్లా డీసీపీగా పనిచేస్తున్నారు. ఆ సమయంలో గోండా జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్ ఎస్సైగా ఆర్బీ సరోజ్ పనిచేస్తున్నాడు. అయితే ఎస్సై ఆర్బీ సరోజ్ తన సహచరలతో కలిసి స్థానిక నేరస్తులతో చేతులు కలిపాడు. అవినీతి అధికారిగా చెలామణి అయ్యాడు. భారీ ఎత్తున ఆస్తుల్ని కూడబెట్టాడు. ఆయన అవినీతి చిట్టాపై పలువురు డీసీపీ కేపీసింగ్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో డీసీపీ కేపీసింగ్ విచారణకు ఆదేశించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్సై ఆర్బీ సరోజ్ తో పాటూ పోలీస్ శాఖలో ఉన్న తన స్నేహితులతో కలిసి డీసీపీ కేపీసింగ్ ను హత మార్చాలని కుట్రపన్నారు.

కుట్రలో భాగంగా రామ్ భువాలన్, అర్జున్న పాసి అనే నేరస్థులు మాధవ్ పూర్ సమీపంలో ఓ ఇంట్లో ఉన్నారంటూ డీసీపీ కేపీసింగ్ సమాచారం అందించారు. సమాచారం అందుకున్న డీసీపీ కేపీసింగ్ అర్ధరాత్రి అందరూ నిద్రపోయే సమయంలో మాధవ్ పూర్ గ్రామంలో నిందితులు దాక్కున్న ఇంటి తలుపుల్ని తట్టాడు. అదే సమయంలో జరిగిన తోపులాటలో ఎస్సై ఆర్బీ సరోజ్ వెనక నుంచి కేపీసింగ్ ను పిలిచి ఛాతిపై కాల్పులు జరిపాడు. ఎస్సై ఆర్బీ సరోజ్, తన సహచరులతో కలిసి కేపీసింగ్ తో పాటూ మొత్తం 13 ని కాల్చి చంపాడు.

అనంతరం నెత్తుటి మడుగులో పడి ఉన్న కేపీసింగ్ ను ప్లాన్ ప్రకారం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నిందితులు జరిపిన కాల్పుల్లో డీసీపీ కేపీసింగ్ తో పాటూ 2 నిందితులు, 10 మంది స్థానికులు మరణించినట్లు ఎఫ్ ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయించాడు.

అప్పట్లో ఈ ఫేక్ ఎన్ కౌంటర్ దేశవ్యాప్తంగా సంచనలం రేపిన తర్వాత కొద్దిరోజుల్లోనే బూటకమని తేలింది. డీఎస్పీని తోటి పోలీసులే చంపారని తేటతెల్లమైంది. ఎస్సై సరోజ్ అవినీతిని డీఎస్పీ ప్రశ్నించాడనే అదును చూసి హతమార్చినట్లు తేలింది.

దీంతో డీఎస్పీ భార్య విభా సింగ్ రెండున్నరేళ్లు, ఒకటున్నరేళ్ల కూతుళ్లతో ఒంటరి పోరాటానికి దిగింది. విభాసింగ్ కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది. చార్జిషీట్లు, సాక్ష్యులు, వాయిదాతో కాలం గిర్రున తిరిగింది. కేసులో ఒక్కోదారి మూసుకుపోతోంది. పిల్లలకు ఊహతెలుస్తోంది. ఒక్కోసారి కూతుళ్లు నాన్నేడమ్మా అని అడిగితే తల్లి విభాసింగ్ ఉబికి వస్తున్న కన్నీళ్లు దిగమింగుకుంది. అలా రోజులు గడుస్తున్నాయి. తండ్రి మరణానికి కారణం ఏంటో ఆ పిల్లలకు తెలిసిపోయింది. అంతే ఎలాగైనా తనతండ్రి మరణానికి కారణమైన నిందితుల్ని కటకటాల్లోకి నెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే భర్త మరణంపై దర్యాప్తు జరిగే సమయంలో విభాసింగ్ కూతుళ్లైన కింజాల్ సింగ్, ప్రంజాల్ సింగ్‌లను ఢిల్లీ లేడీ శ్రీరామ్ కాలేజీలో జాయిన్ చేయించి, ఉన్నత విద్యను అందించింది. అంతలోనే మరో విషాదం. 2004 తల్లి క్యాన్సర్ తో మరణించి ఇద్దరిని ఒంటరిని చేసింది.

అయినా కింజాల్ సింగ్ , ప్రంజాల్ సింగ్ లు ఫేక్ ఎన్ కౌంటర్ లో మరణించిన తండ్రి మరణంపై న్యాయం కోసం క్యాన్సర్ తో మరణించిన తల్లి ఆశయం వైపు అడుగులు వేశారు. తమ జీవితాల్ని అంకితం చేశారు. సంకల్ప బలంతో ముందుకు సాగారు. ఐఎఎస్ అవ్వాలన్న తండ్రి కేపీ సింగ్ కలను నెరవేర్చారు. అలా గ్రాడ్యుయేషన్ ముగిసిన వెంటనే కింజాల్ సింగ్ , ప్రంజాల్ సింగ్ లు యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్దమయ్యారు. 2007 లో జరిగిన యూపీఎస్సీ పరీక్షలో కింజల్ సింగ్ 25 వ ర్యాంక్ తో ఐఏఎస్‌గా 252 వ ర్యాంక్ తో ప్రంజల్ సింగ్ ఐఆర్ఎస్ అధికారిణి’అయ్యారు.

అనుకున్నట్టుగానే పెద్ద కూతురు కింజల్ సింగ్ ఐఏఎస్ అయింది. జీవితకాలం ప్రతీకారాన్ని తీర్చుకునే టైమొచ్చింది. రంగంలోకి దిగి 30 ఏళ్లనాటి ఫైల్ తిరగదోడింది. దాచేస్తే దాగని సత్యం దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించింది. మొత్తం 19 మంది మీద చార్జిషీటు దాఖలయ్యాయి. 8మంది పోలీసులను సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. విచారణ జరిగే సమయంలో పదమంది చనిపోయారు. మరో ఏడుగురు రిటైరయ్యారు. బూటకపు ఎన్ కౌంటర్ చేసినందుకు సరోజ్ సహా ముగ్గురు పోలీసులకు మరణశిక్ష, మరో ఐదుగురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. 31 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించింది. కోర్టు మెట్ల మీద హర్షధ్వానాలు మిన్నంటాయి.

Tags:    

Similar News