మందుల షాపులూ ‘డ్రగ్స్​కు’ బాట.. ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయాలు

దిశ, తెలంగాణ బ్యూరో: మాదక ద్రవ్యాలు అలవాటు కావడానికి కొన్ని మెడికల్​ షాపులూ కారణమవుతున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నది. డాక్టర్​ నుంచి ఎలాంటి ప్రిస్ర్కిప్షన్​ లేకుండానే విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్​, స్టెరాయిడ్లు, నిద్రమాత్రలు ఇవ్వడం వలన ఎంతో మంది యువత మత్తులో మునిగిపొతున్నట్టు స్పష్టం చేసింది. ఆ మందులను అతిగా వాడిన వారిలో మానసిక స్థితి కంట్రోల్​ తప్పి, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకూ పాల్పడుతున్నట్టు గుర్తించింది. గతంలో వరంగల్​ జిల్లాలో ఈ తరహాలో కొన్ని కేసులు […]

Update: 2021-09-21 19:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మాదక ద్రవ్యాలు అలవాటు కావడానికి కొన్ని మెడికల్​ షాపులూ కారణమవుతున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నది. డాక్టర్​ నుంచి ఎలాంటి ప్రిస్ర్కిప్షన్​ లేకుండానే విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్​, స్టెరాయిడ్లు, నిద్రమాత్రలు ఇవ్వడం వలన ఎంతో మంది యువత మత్తులో మునిగిపొతున్నట్టు స్పష్టం చేసింది. ఆ మందులను అతిగా వాడిన వారిలో మానసిక స్థితి కంట్రోల్​ తప్పి, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకూ పాల్పడుతున్నట్టు గుర్తించింది. గతంలో వరంగల్​ జిల్లాలో ఈ తరహాలో కొన్ని కేసులు జరిగినట్టు వివరించింది.

ఇది భవిష్యత్​ తరానికి నష్టం చేకూరుస్తుందని సూచించింది. ఇలా డాక్టర్​ సలహా లేకుండా రోజుల తరబడి షెడ్యూల్​ హెచ్​, హెచ్​1, ఎక్స్​ కేటగిరికి చెందిన మందులు వాడిన వారు క్రమేణా నార్కొటిక్స్​ డ్రగ్స్​ కు అలవాటుపడుతున్నట్టు స్వయంగా హెల్త్​ ఆఫీసర్లే ఆప్​ ది రికార్డులో చెబుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 65 శాతం మెడికల్​ షాపులలో ఇదే పరిస్థితి ఉన్నట్లు ఆరోగ్యశాఖ నొక్కి చెప్పింది. ఈ పరిస్థితిని నియంత్రించాలంటే ప్రతీ షాపు, దానికి అనుబంధంగా ఉన్న గోదాంలలో సీసీ కెమెరాలను ఇన్​ స్టాల్​ చేసి జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఉన్న మానిటరింగ్​ సెల్​ కు అనుసంధానం చేయాలని అధికారులు సూత్రపాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఫైలెట్​ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లాలో ఈ చర్యలను షురూ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతీ మెడికల్​ షాపులో సీసీ కెమెరాలు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం నెలరోజుల్లో వీటిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు తప్పవని కలెక్టర్​ వీ.పీ గౌతమ్​ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ప్రజారోగ్య పరిరక్షణ కొరకు రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో ప్రారంభించాలని ఫార్మాకౌన్సిల్​ అధికారులు కోరుతున్నారు.

హెవీ డోసు కోసమే డ్రగ్స్​….

డ్రగ్స్​, కాస్మోటిక్స్​ యాక్ట్​ 1940, 1945 ప్రకారం యాంటిబయోటిక్స్​, స్టెరాయిడ్లు, నిద్రమాత్రలు, కొన్ని రకాల ఎలర్జీలకు వాడే హెవీ డోసులతో కూడిన మందులు, దగ్గు సిరప్​లను డాక్టర్​ రాసిచ్చిన ప్రిస్కిప్షన్ లేకుండా మందులు షాపులలో విక్రయించరాదు. కానీ అధికారుల నిర్లక్ష్యం, యాజమాన్యాల బాధ్యతరాహిత్యంతో గత కొన్నేళ్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా మందులను అమ్ముతున్నారు. దీంతో చాలా మంది యువత ఆరోగ్యంపై ప్రభావం పడుతున్నదని డాక్టర్లు అంటున్నారు. చిన్నపాటి జ్వరం, దగ్గు, అలసటకూ 4వ, 5వ జనరేషన్​ మందులు ఇస్తూ పరోక్షంగా బాధితుల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నారు. వాస్తవంగా యాంటిబయోటిక్స్​ను వైద్యుల సూచనతో మాత్రమే వాడాల్సి ఉంటుంది. కానీ చాలా మంది స్వల్పంగా అస్వస్థతకు గురైన నేరుగా మెడికల్​ షాపులలోకి వెళ్లి ఒకటిరెండ్రోజులు ఈ మందులను వాడుతున్నారు.ఆ తర్వాత వదిలేస్తున్నారు. దీంతో బ్యాక్టీరియా మళ్లి తిరగబెట్టి సూపర్​ బక్స్​ ప్రభావన్ని చూపిస్తున్నది. దీంతో పాటు దగ్గు, ఎలర్జీలు, ఆర్థరైటీస్, ఆస్తమా​ వంటి సమస్యలకూ స్టెరాయిడ్లు వాడుతున్నారు. ఇవి శరీరంలో ఇమ్యూనిటీ తగ్గించి లాంగ్​ టైంలో కిడ్నీ, లివర్​, లంగ్స్​ని కూడా ఖరాబ్​ చేస్తున్నాయి. అంతేగాక షుగర్ లెవల్స్​ పెరిగి బ్లాక్​ ఫంగస్​ తదితరవి దాడి చేస్తున్నాయి. ఇక ఒత్తిడి, మానసిక సమస్యలతో నిద్రపట్టకపోతే ఆల్కప్రక్స్​, ఆల్కజ్రోబమ్​ వంటి మాత్రలను అతిగా వాడటం వలన అవి వేసుకుంటేనే నిద్ర వచ్చే పరిస్థితికి చేరుకుంటాం. అంతేగాక కొన్ని రకాల దగ్గు సిరఫ్​ లు కూడా మత్తును కలిగిస్తున్నాయి. చాలా మంది వీటిని ఆల్కహాల్​ కు బదులు నేరుగా తీసుకుంటున్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇదే తంతు. దీంతో కొన్నాళ్లకు సదరు వ్యక్తుల శరీరానికి ఆ మందులు పనిచేయవు. దీంతో ఆటోమెటిక్​గా హెవీ డోసులతో కూడిన డ్రగ్స్​ కు బానిస అవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక హెడ్యూల్​ ఎక్స్​ కేటగిరీకి చెందిన మానసిక సమస్యలకు వాడే మత్తు పదార్ధాలు యాంటీసోషల్​ సంఘటనలకు కారణమవుతున్నట్లు స్పష్టం చేశారు.

చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలి..

మెడికల్​ షాపులలో అవగాహన లేని ఫార్మాసిస్ట్​ లను నియమించుకోవడం వలన ఇలాంటి పరిస్థితి వస్తున్నట్లు హెల్త్​ డిపార్ట్​మెంట్​ ప్రాథమికంగా అంచనా వేసింది. దీంతో నకిలీ లను ఏరివేసేందుకు డ్రగ్స్​, కాస్మోటిక్స్​ చట్టాలను సమర్ధవంతంగా అమలు చేయాలి. తద్వారా మందుల దుర్వినియోగం జరగదు. అంతేగాక షాపులకు వచ్చిన బాధితులకు కూడా అవగాహన కల్పించేందుకు వీలు ఉంటుంది. దీంతో అవసరమైన మందులు మాత్రమే పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఇతర అవయవాల పై ప్రభావం పడదు. మరోవైపు కొన్ని మందులు తీసుకున్న తర్వాత కొన్ని రకాల ఆహారాలు తీసుకోకూడదు. ఇలాంటి వాటిపై అవగాహన కల్పించాలంటే క్వాలిఫై ఫార్మాసిస్ట్​లు అవసరం.

డాక్టర్​ సలహా లేకుండా వాడకూడని కొన్ని మందులు…

ఆల్ఫాజోలం, బాలోప్లోక్సిన్​, బుప్రేనోర్ఫైన్​, కాప్రోమైసిన్​, సెఫ్​డినిర్​, ఆంబోబార్టిటాల్​, ఆంప్రేటామైన్, బార్బిటాల్​, సైక్లోబార్పిటాల్​, కేటామైన్​, జోల్పాడెమ్​, ట్రామాడోల్​, లివోప్లేక్సాసిన్​, నైట్రోజెపాపమ్​ తదితరవి ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు మంచి నిర్ణయం: డా ఆకుల సంజయ్​ రెడ్డి ఫార్మా కౌన్సిల్​ మెంబరు మెడికల్​ షాపులలో సీసీకెమెరాల ఏర్పాటు మంచి నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని వేగంగా అన్ని షాపులకు వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలి. ఇప్పటికే పక్క రాష్ర్టాల్లో ఈ విధానం కొనసాగుతున్నది. ఆరోగ్య తెలంగాణ కావాలంటే మందులు దుర్వినియోగం కాకుండా చూడాలి. అవగాహన లేని వారు ఇచ్చే మందులతో వివిధ రకాల హెల్త్​ కాంప్లికేషన్లు వస్తాయి. దీంతో ఆర్థికంగానూ నష్టపోవాల్సి వస్తుంది. ఇవన్నీ తొలగిపోవాలంటే మెడికల్​ షాపులలో నకిలీ ఫార్మాసిస్ట్​ లను గుర్తించి చర్యలు తీసుకోవాలి. అంతేగాక అర్హులై వారికి కనీసం 30వేలు వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.

Tags:    

Similar News