పట్టుకున్నా.. డ్రగ్స్ తయారీ కంటిన్యూ చేస్తున్రు

దిశ, పటాన్‌చెరు : ఫార్మా ముసుగులో కొందరు మత్తుపదార్థాలను తయారు చేస్తున్నారు. మూతపడ్డ పరిశ్రమలను ఎంపిక చేసుకుని అందులో డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. ఇటీవలే సుమారు రూ.100 కోట్ల విలువైన మత్తు పదార్థాలను ముంబాయికి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే వెలుగుచూశాయి. ఫార్మా ముసుగులో కొందరు మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారు. దీనికి జిల్లాలోని పారిశ్రామిక వాడలు అడ్డాలుగా మారుతున్నాయి. పటాన్‌చెరు నియోజకవర్గం గడ్డపోతారం పారిశ్రామిక‌వాడ పరిధిలో మూతపడిన ఓ పరిశ్రమలో తయారుచేసిన […]

Update: 2020-08-20 20:32 GMT

దిశ, పటాన్‌చెరు : ఫార్మా ముసుగులో కొందరు మత్తుపదార్థాలను తయారు చేస్తున్నారు. మూతపడ్డ పరిశ్రమలను ఎంపిక చేసుకుని అందులో డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. ఇటీవలే సుమారు రూ.100 కోట్ల విలువైన మత్తు పదార్థాలను ముంబాయికి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే వెలుగుచూశాయి.

ఫార్మా ముసుగులో కొందరు మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారు. దీనికి జిల్లాలోని పారిశ్రామిక వాడలు అడ్డాలుగా మారుతున్నాయి. పటాన్‌చెరు నియోజకవర్గం గడ్డపోతారం పారిశ్రామిక‌వాడ పరిధిలో మూతపడిన ఓ పరిశ్రమలో తయారుచేసిన సుమారు రూ.100 కోట్ల విలువ గల మేప్రిడిన్, కెటామెన్, ఇతర ముడి సరుకులను ఈ నెల 17న హైదరాబాద్‌ నుంచి ముంబైకి తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఈ విషయమై స్థానికంగా కలకలం రేగింది. అనంతరం పరిశ్రమలో తనిఖీలు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు అక్కడున్న యూనిట్, రియాక్టర్‌ను సీజ్ చేశారు. హైదరాబాద్‌ నగరానికి సమీపంలో ఉన్న గడ్డపోతారం, ఖాజిపల్లి, బొల్లారం పారిశ్రామిక వాడల్లో తరచూ డ్రగ్స్ తయారీ ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి.

గతంలోనూ..

2016‌లో బొల్లారం పరిధిలో రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. 2017‌లో బొల్లారం గండిగూడెం పరిధిలోని ఓ పరిశ్రమలో కల్తీకల్లు తయారీకి ఉపయోగించే రూ.75 లక్షల విలువైన అల్ఫాజోరలంను ప్రొహిబిషన్ టాస్క్‌ఫోర్స్ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2018‌లో అనంతరం పరిధిలో మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో సైతం గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి.

గడ్డపోతారం‌లో డ్రగ్స్ తయారీ గుట్టురట్టు

గడ్డపోతారం పారిశ్రామిక వాడల్లో డ్రగ్స్ తయారీ గుట్టురట్టు కావడం కలకలం రేపింది. అమ్మయ్య చెరువుపై భాగంలో ఉండే ఓ పరిశ్రమ ఆరు నెలల క్రితం మూతపడింది. దీన్ని లీజుకు తీసుకున్న డ్రగ్స్ తయారీదారులు.. రియాక్టర్లలో నిషేధిత మత్తు పదార్థాలను తయారు చేసి వాటిని ముంబాయికి తరలించే క్రమంలో డీఆర్ఐ అధికారులకు దొరికిపోయారు. గతంలో పట్టుబడ్డ ఓ నిందితుడు ఈ ఘటనలోనూ కీలకంగా వ్యవహరించాడని తేలింది. దీంతో సంబంధిత అధికారులు సదరు వ్యక్తిని వెంటబెట్టుకుని గడ్డపోతారం‌లోని పరిశ్రమలో 16న దాడి నిర్వహించారు. డ్రగ్స్ తయారీకి ఉపయోగించే ముడి సరుకులు రియాక్టర్‌ను గుర్తించి పరిశ్రమను సీజ్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో మూతపడిన మరిన్ని పరిశ్రమలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మూతపడిన పరిశ్రమలపై నిఘా ఉంచి, డ్రగ్స్ మాఫియాకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

మూతపడిన పరిశ్రమల్లో తయారీ..

దేశంలోనే పేరెన్నిక గల చాలా ఫార్మా పరిశ్రమలు పటాన్‌చెరు నియోజకవర్గంలో ఉన్నాయి. ఇందులో సుమారు 200 వరకు భారీ పరిశ్రమలు ఉండగా, 600 చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిర్వహణ, మార్కెటింగ్, వ్యాపార తదితర కారణాలతో మూతపడ్డాయి. మూతపడ్డ కొన్ని చిన్న పరిశ్రమలు మత్తు పదార్థాల తయారీ కేంద్రాలుగా మారాయి. ఏదైనా పరిశ్రమ ప్రారంభానికి అనుమతులు ఇచ్చే పీసీబీ, పరిశ్రమల విభాగం అధికారులు, డ్రగ్స్ కంట్రోల్ తదితర విభాగాలకు ఏ పరిశ్రమలు మూతపడ్డాయో కచ్చితమైన సమాచారం ఉండదు. దీంతో అక్రమార్కులు మూతపడిన వాటిని రహస్యంగా లీజుకు తీసుకునో లేక కొనుగోలు చేసో నిషేధిత ఉత్ప్రేరకాలను తయారు చేస్తున్నారు. పారిశ్రామిక‌వాడల్లో ఓ పరిశ్రమలో జరిపే ఉత్పాదనపై మరో పరిశ్రమకు కానీ, అందులో పనిచేసే సిబ్బందికి కానీ దీని గురించి పూర్తి సమాచారం తెలియదు. దీంతో రియాక్టర్ల వారీగా లీజుకు తీసుకుని రెండు మూడు నెలలపాటు డ్రగ్స్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఏ పరిశ్రమలో ఏం ఉత్పత్తి అవుతుందో ఎవరికీ తెలియకుండా పోతోంది. ఈ క్రమంలో అధికారులు సైతం డ్రగ్స్ తయారీని పసిగట్టలేకపోతున్నారు. ఇదే ఈ దందాకు అనుకూలంగా మారింది.

Tags:    

Similar News