మంత్రి మల్లారెడ్డి జాప్యంతో రేకెత్తుతోన్న అనుమానాలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కొందరు నాయకుల పనితీరుతో అభాసుపాలవుతోంది. గతేడాది సీఎం కేసీఆర్ పుట్టిన రోజున పెద్దల మెప్పుకోసం అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. కానీ, వాటిని సంరక్షించడంలో విఫలమయ్యారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొక్కలు నాటేందుకు రూ.లక్షలు వెచ్చించినా వాటిని పట్టించుకోకపోవడంతో ఎండిపోయాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీవాసుల కోసం ఏర్పాటు చేసిన హెర్బల్పార్కు (నందనవనం) ఏడాదైన నేటికీ ప్రారంభించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి […]
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కొందరు నాయకుల పనితీరుతో అభాసుపాలవుతోంది. గతేడాది సీఎం కేసీఆర్ పుట్టిన రోజున పెద్దల మెప్పుకోసం అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. కానీ, వాటిని సంరక్షించడంలో విఫలమయ్యారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొక్కలు నాటేందుకు రూ.లక్షలు వెచ్చించినా వాటిని పట్టించుకోకపోవడంతో ఎండిపోయాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీవాసుల కోసం ఏర్పాటు చేసిన హెర్బల్పార్కు (నందనవనం) ఏడాదైన నేటికీ ప్రారంభించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఇప్పటికైనా దృష్టిసారించాలని కోరుతున్నారు.
దిశ, జవహర్ నగర్: గతేడాది జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అట్టహాసంగా హెర్బల్ గార్డెన్స్ ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. వాటి సంరక్షణకు నీళ్లు పోయకపోవడంతో పూర్తిగా ఎండిపోయాయి. జవహర్ నగర్ తన గుండె కాయ అని చెప్పుకునే కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి స్థానికంగా 4ఎకరాల 3గుంటలు (సర్వే నంబర్ 759 లోని 2 ఎకరాల 11గుంటలు, సర్వే నంబర్ 974లో ఎకరా 32గుంటలు) ప్రభుత్వ భూమిలో ఎర్బల్ పార్క్ కోసం శంకుస్థాపన చేసి మొక్కలు నాటారు. హెర్బల్ గార్డెన్ ఏర్పాటు చేసినా అధికారికంగా ప్రారంభానికి నోచుకోలేదు. అలాగే, పలు ప్రాంతాల్లో నాటిన మొక్కలు పూర్తిగా ఎండిపోయాయి. అటు టీఆర్ఎస్ శ్రేణులు గానీ, ఇటు అధికార యంత్రాంగం పట్టించుకోక పోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ యేడు కూడా హరిత హారం పేరిట పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమానికి వార్షిక ఆదాయంలో పది శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిధులను ఖర్చుచేయడం పక్కాగా అమలు చేస్తున్న మంత్రి తిరిగి వాటి సంరక్షణపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం.
పార్కుల పరిరక్షణకు దిక్కులేదు…?
గతేడాది హెర్బల్ పార్క్ లో కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మొక్కలు నాటారు. కానీ మొక్కల పెంపకంతో పాటు భూముల పరిరక్షణకు గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొక్కలు నాటి ఏడాది గడుస్తున్నా వాటిని పట్టించుకున్న నాథుడే కరువయ్యా ప్రస్తుతం హెర్బల్ పార్క్ ఎండిపోయిన మొక్కలతో దర్శనమిస్తోంది. నిధులను దుర్వినియోగం చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జవహర్ నగర్ లో ఫైరింగ్ రేంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని సర్వే నంబర్ 510లో ఈ మధ్యకాలంలో చిల్డ్రన్స్ పార్క్ ను ఏర్పాటు చేశారు. 20 ఏళ్ల స్థానికుల సంకల్పంతో చిల్డ్రన్స్ పార్క్ స్థలాన్ని కాపాడుకున్నారు. కానీ, దానిపై కొందరు కన్నేయడం, మంత్రి మల్లారెడ్డి నేటికీ ప్రారంభించక పోవడం పలు అనుమానాలకు తావునిస్తోంది. ఈ యేడాది కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నందనవనం పార్క్ ను అధికారికంగా ప్రారంభించాల్సి ఉండేదని ప్రజలు పేర్కొంటున్నారు.
మంత్రిదే పూర్తి బాధ్యత…!
గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ సమక్షంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా, జవహార్ నగర్ తన గుండె కాయ, దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని మంత్రి మల్లారెడ్డి వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో మల్లారెడ్డికి భారీ మెజార్టీతో గెలిపించి మంత్రి పదవి దక్కడంలో కీలక భూమిక పోషించారు జవహర్ నగర్ ప్రజలు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో స్వయంగా మంత్రి మల్లారెడ్డి ప్రస్తావించిన విషయం విధితమే. జవహర్ నగర్ పరిధిలో ఎన్నో విలువైన ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని, వాటిని ప్రజా అవసరాల కోసం వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు. అయితే, అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులే అధికారులకు సహకరించకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని జవహర్ నగర్ ప్రజలు మండిపడుతున్నారు.