సెల్ఫ్ క్వారెంటైన్‌లో డాక్టర్లు, వైద్య సిబ్బంది

దిశ , హైదరాబాద్: ప్రజలే కాదు… డాక్టర్లు, వైద్య సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద 68 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. సుమారు 200 మంది ప్రైమరీ కాంటాక్టు సిబ్బంది క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. దీంతో ఇన్‌పేషెంట్లు, ఔట్ పేషెంట్లకు అందే వైద్య సేవలకు అంతరాయం కలిగింది. నగరంలోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ, ఈఎన్టీ, పేట్లబుర్జు, కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రులలో పని చేసే పలువురు వైద్యులకు కరోనా పాజిటివ్ రావడంతో […]

Update: 2020-06-06 09:37 GMT

దిశ , హైదరాబాద్: ప్రజలే కాదు… డాక్టర్లు, వైద్య సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద 68 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. సుమారు 200 మంది ప్రైమరీ కాంటాక్టు సిబ్బంది క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. దీంతో ఇన్‌పేషెంట్లు, ఔట్ పేషెంట్లకు అందే వైద్య సేవలకు అంతరాయం కలిగింది. నగరంలోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ, ఈఎన్టీ, పేట్లబుర్జు, కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రులలో పని చేసే పలువురు వైద్యులకు కరోనా పాజిటివ్ రావడంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచి అందుబాటులో ఉన్న సిబ్బందితో వైద్య సేవలందిస్తున్నారు. వారితో సన్నిహితంగా మెలిగిన పలువురు వైద్యులను క్వారెంటైన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేసే వైద్యుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఒకవైపు కరోనా కేసులు పెరిగి పోవడం, మరోవైపు వైద్యుల సంఖ్య తగ్గిపోవడం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను కలవరపరుస్తోంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను ప్రత్యామ్నాయ చర్యల వైపు దృష్టి సారించారు.

సెల్ఫ్ క్వారెంటైన్ కు 55 యేండ్ల పై బడిన వైద్యులు

నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడుతుండడంతో ఆస్పత్రులలో పనిచేస్తున్న 55 యేండ్ల వయసు పైబడిన వైద్యులు, సిబ్బంది సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్ళిపోయారు. ఇప్పటివరకు కరోనా బారిన పడిన 68 మంది వైద్యుల్లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ పరిధిలోని బోధనాస్పత్రులలో పని చేస్తున్న వారే 41 మంది ఉన్నారు. గాంధీలో నలుగురు, నిమ్స్‌లో 12 మంది, ముగ్గురు డెంటల్ విద్యార్థులు, కింగ్ కోఠి ఆస్పత్రి వైద్యులు ఉన్నారు. వీరే కాకుండా ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ ఇన్‌స్పెక్టర్లు, సెక్యూరిటీ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో వారితో సన్నిహితంగా మెలిగినవారిని కూడా క్వారెంటైన్ చేయడంతో ఆస్పత్రులలో వైద్యులు, సిబ్బంది సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఆయా ఆస్పత్రులకు వచ్చే రోగులకు వైద్య సేవలందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిమ్స్ ఆస్పత్రిలో కార్డియాలజీ బ్లాక్‌ను మూసివేయగా ఈఎన్టీ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. కోఠి మెడికల్ కాలేజ్‌లో మెస్‌లకు తాళాలు పడ్డాయి.

వారానికో బ్యాచ్

ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేసే వైద్యులు, సిబ్బందిని రెండు బ్యాచ్‌లుగా విభజించి ఒక్కో బ్యాచ్‌ను ఒక్కో వారం పాటు పని చేయించేలా రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డి డ్యూటీ ఛార్ట్ తయారుచేశారు. ఆ మేరకు అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లకు ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆస్పత్రులలో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. నగరంలో ప్రతి నిత్యం వందకు పైగా కరోనా కేసులు రావడంతో ఇప్పటివరకు కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా చికిత్సలు చేసేందుకుగాను గాంధీ ఆస్పత్రిని కోవిడ్ సెంటర్‌గా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పడకల సామర్థ్యం నిండిపోవడంతో ప్రభుత్వం గచ్చిబౌలిలోని టిమ్స్‌లో కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన పడకల నుండి 150 పడకలను అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇది కొంత మేర ఉపశమనం కల్పిస్తున్నా వైద్యం అందించే డాక్టర్లు, వైద్య సిబ్బంది సంఖ్య తగ్గిపోవడం, రానున్న రోజులలో కరోనా రోగులకు వైద్య సేవలు ఎలా అందించాలనే విషయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Tags:    

Similar News