ఒక లాక్‌డౌన్.. 20 ప్రసవాలు

ఉగ్గంపల్లిలో పీహెచ్‌సీ వైద్యుడి పనితీరు కరోనా వారియర్‌గా ప్రకటించిన మహబూబాబాద్ కలెక్టర్ దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ సమయంలో ఎలా విశ్రాంతి తీసుకోవాలా ? అని ఉద్యోగస్తులు చూస్తుంటే.. అసలు సెలవన్నదే లేకుండా పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు ఓ కాంట్రాక్ట్ వైద్యుడు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన సదరు డాక్టర్‌కు గైనకాలజీతో సంబంధం లేకపోయినా.. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలు చేస్తూ స్థానికుల అభిమానాన్ని పొందుతున్నాడు. ఓ వైపు కరోనాకు సంబంధించిన డ్యూటీతో పాటు లాక్‌డౌన్‌ రోజుల్లో […]

Update: 2020-04-25 11:06 GMT

ఉగ్గంపల్లిలో పీహెచ్‌సీ వైద్యుడి పనితీరు

కరోనా వారియర్‌గా ప్రకటించిన మహబూబాబాద్ కలెక్టర్

దిశ, న్యూస్ బ్యూరో:
లాక్‌డౌన్ సమయంలో ఎలా విశ్రాంతి తీసుకోవాలా ? అని ఉద్యోగస్తులు చూస్తుంటే.. అసలు సెలవన్నదే లేకుండా పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు ఓ కాంట్రాక్ట్ వైద్యుడు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన సదరు డాక్టర్‌కు గైనకాలజీతో సంబంధం లేకపోయినా.. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలు చేస్తూ స్థానికుల అభిమానాన్ని పొందుతున్నాడు. ఓ వైపు కరోనాకు సంబంధించిన డ్యూటీతో పాటు లాక్‌డౌన్‌ రోజుల్లో 20 ప్రసవాలు నిర్వహించిన ఆ డాక్టర్ పేరు గుగులోతు రవి.. మహబూబాబాద్ జిల్లా, ఉగ్గంపల్లి పీహెచ్‌సీలో పని చేస్తున్నారు.

2017లో పీహెచ్‌సీ నందు విధుల్లో చేరిన రవి.. అదే ఏడాది జూన్ నెలలో మొదటి నార్మల్ డెలివరీ చేశారు. కాగా, ఇప్పటి వరకు 250 సాధారణ ప్రసవాలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ఉగ్గంపల్లితో పాటు అవసరమైన సందర్భాల్లో మరిపెడ పీహెచ్‌సీలోనూ అత్యవసర కేసులు చూసేందుకు వెళ్తుంటారు. ప్రత్యేకంగా డెలీవరీ కేసుల కోసమే రవిని అక్కడికి పిలిపిస్తుంటారు. ఉగ్గంపల్లి పీహెచ్‌సీలో ఒక్క ఏప్రిల్ నెలలోనే 8 డెలివరీలు చేసిన రవి, ఈ లాక్‌డౌన్ రోజుల్లో మొత్తం 20 డెలివరీలను నిర్వహించారు. అయితే ఈయన గైనకాలజిస్ట్ కాదు, ఎంబీబీఎస్ డాక్టరే. అయినా ప్రైవేటు ఆస్పత్రుల్లో డెలివరీ కేసుల్లో పనిచేసిన అనుభవాన్ని ఇలా ప్రజల కోసం ఉపయోగిస్తున్నారు. క్రిటికల్ కేసులు ఎదురైతే, మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు.

2011 లెక్కల ప్రకారం ఉగ్గంపల్లి పీహెచ్‌సీ డాక్టర్.. 2,373 మందికి వైద్యం అందిస్తున్నట్టు లెక్క. ఉగ్గంపల్లి ఏరియాలో కరోనా వైరస్ లేదు. ప్రభుత్వం గ్రీన్‌ జోన్‌గా ప్రకటించింది. ఈ సమయంలో ఆస్పత్రికి వెళ్లి మామూలుగా వచ్చిన కేసులు చూసుకుంటే సరిపోతుంది. కానీ తాను ‘ప్రతీ రోజూ మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు ఇంటింటికీ వెళ్లి దగ్గు, జలుబు ఇతర సమస్యలేవైనా ఉన్నాయోమోననని తెలుసుకుంటానని, ఉదయం పూట పీహెచ్‌సీలో అవుట్ పేషంట్లను చూడటంతో పాటు అత్యవసర కేసులను కూడా చూస్తానని’ రవి తెలిపారు. లాక్‌డౌన్ కాలంలో కరోనా నివారణకు రవి చేపడుతున్న డ్యూటీతో పాటు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రసవాలు, ఇతర అత్యవసర కేసులను పరిష్కరిస్తున్న రవి సేవలను ఆ జిల్లా కలెక్టర్ గుర్తించారు. కరోనా స్పెషల్ డ్యూటీతో పాటు డెలివరీలు చేస్తున్న డాక్టర్ రవికి ‘తనో కరోనా వారియర్’ అంటూ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు.

Tags: corona, health, lockdown, normal delivery, PHC, Ravi Gugulothu, Mahabubabad, Uggampally

Tags:    

Similar News