దీపావళి బతుకమ్మ.. ఆ గ్రామం స్పెషల్!
దిశ ప్రతినిధి, వరంగల్ : తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు ప్రతి ఏడాది భాద్రపదం, ఆశ్వీయుజం మాసాల మధ్య తొమ్మిది రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. కానీ తెలంగాణలోని ఓ గ్రామంలో దీపావళి రోజు నుంచి మూడు రోజులు బతుకమ్మ ఆడడం ఆచారంగా వస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలంలోని సీతంపేట ఈ వైవిధ్యమైన వేడుకలకు నిలయంగా మారింది. ఆదివారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఏంటీ.. ఈ బతుకమ్మ ప్రత్యేకత.. తెలంగాణలో ఆత్మగౌరవ పండుగగా బతుకమ్మ […]
దిశ ప్రతినిధి, వరంగల్ : తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు ప్రతి ఏడాది భాద్రపదం, ఆశ్వీయుజం మాసాల మధ్య తొమ్మిది రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. కానీ తెలంగాణలోని ఓ గ్రామంలో దీపావళి రోజు నుంచి మూడు రోజులు బతుకమ్మ ఆడడం ఆచారంగా వస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలంలోని సీతంపేట ఈ వైవిధ్యమైన వేడుకలకు నిలయంగా మారింది. ఆదివారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి.
ఏంటీ.. ఈ బతుకమ్మ ప్రత్యేకత..
తెలంగాణలో ఆత్మగౌరవ పండుగగా బతుకమ్మ ఆడుతారు. ఎక్కడా లేని విధంగా ఒక్క సీతంపేట గ్రామంలోనే నేతకాని కులస్తుల దీపావళి నుంచి మూడు రోజుల పాటు బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తారు. ఈ ఆచారాన్ని నేతకాని కులస్తులు వారి పూర్వీకుల నుంచి కొనసాగిస్తూ వస్తున్నారు. ఇందుకు కారణాన్ని కూడా వాళ్లు వివరించారు. పూర్వం అందరి గ్రామస్తులతోపాటే బతుకమ్మ ఆడేందుకు నేతకాని కులస్తులు రాగా.. వారితో ఆడేందుకు గ్రామస్తులు నిరాకరించారట. దీంతో నేతకాని కులస్తులే ప్రత్యేకంగా బతుకమ్మ ఆడేందుకు నిర్ణయించుకోని.. గ్రామస్తులతో కాకుండా దీపావళి రోజు నుంచి మూడు రోజులు ఉత్సవాలు చేసుకోవడం ప్రారంభించారట. అప్పటి నుంచి ఆ కులస్తులు దీపావళికి బతుకమ్మ ఆడడం ఆచారంగా భావిస్తూ.. వస్తున్నారు.
ఆ మూడు రోజులు ప్రత్యేకమే..
మూడు రోజుల పండుగలో మొదటి రోజు కేదార్వీశ్వరస్వామి వత్రకల్పం, రెండో రోజు మగవారు ప్రత్యేకంగా రేగడి మట్టితో చేసిన జోడెద్దుల విగ్రహ ప్రతిమల నిమజ్జనం, మూడో రోజు మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చే అద్భుతమైన ఘట్టం ఉంటుంది. చివరి రోజు మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా చెరువు కట్టకు చేరుకుంటారు. పురుషులు కోలాటాలతో పాటలు పాడుతూ ఊరేగింపులో పాల్గొంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కులస్తుల బంధువులు వేడుకల్లో పాల్గొని సంబురాలు చేసుకుంటారు.
గంగమ్మ ఒడికి గౌరమ్మ..
దీపావళి బతుకమ్మ వేడుకల్లో గౌరమ్మను గంగమ్మ ఒడికి చేర్చే ప్రక్రియ మంగళవారంతో పూర్తి అయ్యింది. రాష్ర్టంలో ఎక్కడా లేని విధంగా నేతకాని కులస్తులు జరుపుకునే దీపావళి బతుకమ్మకు సద్దుల బతుకమ్మ శోభ సంతరించుకుంది. సద్దుల బతుకమ్మ వేడుకలను తలపించపజేసే విధంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జరిగాయి. మహిళలు బతుకమ్మలను ఎత్తుకుని చెరువు గట్టుకు చేరుకోవడంతో ఆవరణ తీరొక్కపూలతో తీర్చిదద్దిన బతుకమ్మలతో పూల సింగిడిని తలపించింది. మొదటి రోజున కేదారీశ్వర స్వామి వ్రత కల్పం, రెండో రోజు జోడెద్దుల నిమజ్జన పండుగ. చివరి రోజు మహిళలు పసుపుకుంకుమలు, పిల్లాపాపలు ఆయురారోగ్యంగా సల్లంగా ఉండాలని గౌరమ్మను వేడుకున్నారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకుని బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేశారు. దీంతో నేతకాని కులస్తుల మూడు రోజుల దీపావళి బతుకమ్మ అత్యంత వైభవంగా ముగిసింది.