తపాలా శాఖ కీలక నిర్ణయం.. పోస్టాఫీస్‌ల ద్వారా రైతుబంధు నగదు

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణలో రైతులకు ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు నగదు డ్రా చేసుకునేందుకు ఇక ముందు రైతులు బ్యాంకులకే వెళ్లవలసిన అవసరం లేదు. పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఏర్పాటు చేసిన మైక్రో ఏటీఎంల ద్వారా ఎలాంటి చార్జీలు లేకుండానే నగదు డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం రైతు బంధు పథకం కింద నగదు జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. […]

Update: 2021-06-18 07:44 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణలో రైతులకు ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు నగదు డ్రా చేసుకునేందుకు ఇక ముందు రైతులు బ్యాంకులకే వెళ్లవలసిన అవసరం లేదు. పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఏర్పాటు చేసిన మైక్రో ఏటీఎంల ద్వారా ఎలాంటి చార్జీలు లేకుండానే నగదు డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం రైతు బంధు పథకం కింద నగదు జమ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే.. ఇలా డిపాజిట్ చేసిన నగదు డ్రా చేసుకునేందుకు గ్రామాల్లో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఉండటంతో వారు బ్యాంక్‌ల నుండి నగదు పొందేందుకు గంటల సమయం పడుతోంది. దీనికి తోడు కరోనా భయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రైతుల ఇబ్బందులు తొలగించేందుకు పోస్టల్ శాఖ ముందుకు వచ్చి మైక్రో ఏటీఎంలలో నగదు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

5,794 పోస్టాఫీస్‌ల ద్వారా..

2020-21 సంవత్సరంలో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మైక్రో ఏటీఎంలలో 1.73 లక్షల మంది రైతులు రూ.169 కోట్ల నగదు డ్రా చేసుకున్నారు. ప్రస్తుత సీజన్‌లో ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసిన నగదును డ్రా చేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 5,794 పోస్టాఫీస్‌లలో ఆఫీస్ ఆఫ్ పోస్టు మాస్టర్ జనరల్ హైదరాబాద్ రీజియన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆధార్ కార్డు లింకు కలిగి ఉన్న ఏ బ్యాంకులోనైనా.. ప్రభుత్వం రైతు బంధు నగదు డిపాజిట్ చేసినా రైతులు స్థానికంగా ఉన్న పోస్టాఫీస్‌ల ద్వారా నగదు తీసుకునే అవకాశం ఉంది.

అయితే పోస్టాఫీస్ మైక్రో ఏటీఎం‌లలో నగదు పొందేందుకు రైతు తమ బ్యాంక్ అకౌంట్ నెంబర్‌తో పాటు ఆధార్ కార్డు, రిజిస్టరైన మొబైల్‌ను తప్పనిసరి వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. పోస్టాఫీస్‌లలో వివరాలు అందించిన తర్వాత ఫింగర్ ప్రింట్ నమోదు చేస్తారు. ఈ సమయంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా రైతు మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీనిని సంబంధిత పోస్టు మాస్టర్‌కు చెప్పాల్సి ఉంటుంది. ఎలాంటి చార్జీలు లేకుండా రైతులు ఒక్క రోజులో రూ.10 వేల నగదు డ్రా చేసుకునే వీలుంది.

రైతులకు ఎంతో సౌకర్యం..

జే. శ్రీనివాస్ – ఏడీ. పోస్టు మాస్టర్ జనరల్ హైదరాబాద్ రీజియన్..

గత సీజన్‌లో కూడా రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాలలో పడిన నగదును గ్రామాలలోని పోస్టాఫీస్ మైక్రో ఏటీఎంలలో డ్రా చేసుకునే అవకాశాన్ని తపాలా శాఖ కల్పించింది. ఈ ఏడాది కూడా రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని పోస్టాఫీస్‌లలో నగదు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ప్రస్తుతం వర్షాలు పడుతున్న సమయంలో వ్యవసాయ పనులలో రైతులు తీరిక లేకుండా ఉంటారు. వారు మండల కేంద్రాలకు వెళ్లి బ్యాంక్‌లలో నగదు తీసుకోవడానికి చాలా సమయం పడుతోంది. దీనికి చెక్ పెట్టడానికి తపాలాశాఖ అందుబాటులోకి తెచ్చిన ఈ సౌకర్యం వారికి ఎంతో ఉపయోగ పడుతుంది. వారు తమ గ్రామాలలోనే సమయం వృథా కాకుండా నగదు డ్రా చేసుకోవచ్చు.

 

Tags:    

Similar News