ట్రెండ్ సెట్టర్‌గా ‘దిశ’.. 'డిజిటల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం'తో మరో ముందడుగు
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం మీడియా సంస్థలు ఏదో ఒక రాజకీయ పక్షానికి, వ్యాపారవర్గానికి అనుకూలంగా ఉన్న సమయంలో ఎప్పుడూ ప్రజల పక్షమే ఉంటూ నిష్పక్షపాతంగా వాస్తవాలను ప్రజలకు చేరుస్తున్న ‘దిశ’కు ప్రత్యేక స్థానం లభించింది. ఉనికిలోకి వచ్చిన ఏడాదిన్నర సమయంలోనే ప్రధాన పత్రికలతో పోటీపడే స్థాయికి చేరుకున్నదని సీనియర్ సంపాదకులు, రాష్ట్ర సమాచార కమిషనర్ కట్టా శేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘దిశ’ ప్రారంభిస్తున్న ‘స్కూల్ ఆఫ్ డిజిటల్ జర్నలిజం’ ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం ఆయన విద్యార్థులను […]
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం మీడియా సంస్థలు ఏదో ఒక రాజకీయ పక్షానికి, వ్యాపారవర్గానికి అనుకూలంగా ఉన్న సమయంలో ఎప్పుడూ ప్రజల పక్షమే ఉంటూ నిష్పక్షపాతంగా వాస్తవాలను ప్రజలకు చేరుస్తున్న ‘దిశ’కు ప్రత్యేక స్థానం లభించింది. ఉనికిలోకి వచ్చిన ఏడాదిన్నర సమయంలోనే ప్రధాన పత్రికలతో పోటీపడే స్థాయికి చేరుకున్నదని సీనియర్ సంపాదకులు, రాష్ట్ర సమాచార కమిషనర్ కట్టా శేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
‘దిశ’ ప్రారంభిస్తున్న ‘స్కూల్ ఆఫ్ డిజిటల్ జర్నలిజం’ ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో యువత అన్ని రకాల ఉద్యోగాలకు ప్రయత్నాలు చేసి ఎక్కడా సక్సెస్ కాలేని పరిస్థితుల్లోనే జర్నలిజం వైపు వెళ్తున్నారని, ఏ ప్రొఫెషనల్ కోర్సులో సీటు దొరక్కపోవడంతో జర్నలిజం కోర్సులో చేరుతున్నారని అన్నారు.
ప్రజాస్వామ్యంలో నాల్గవ మూల స్థంభంగా ఉన్న జర్నలిజం ప్రస్తుతం ఈ స్థాయికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ప్రధాన మీడియా సంస్థలకు సొంతంగా జర్నలిజం స్కూల్స్ ఉన్నాయని, కానీ గత కొంత కాలంగా వాటిని మూసివేసిన సమయంలో ‘దిశ’ సంస్థ ‘స్కూల్ ఆఫ్ డిజిటల్ జర్నలిజం’ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం డిజిటల్ దిశగా సమాజం నడుస్తున్న సమయంలో ‘దిశ’ తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగినదని అన్నారు. భారీ పెట్టుబడులు, ఏదో ఒక రాజకీయ లేదా వ్యాపార అండ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలే వెన్నుదన్నుగా, విలువలపై ఆధారపడి ‘దిశ’ ఉనికిలోకి రావడం, కొన్ని ప్రధాన పత్రికల ‘అలెక్సా’ ర్యాంకును అధిగమించి స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం అది సాధించిన ప్రగతికి నిదర్శనమన్నారు.
ఎలాంటి పక్షపాతం లేకుండా వార్తలను అందిస్తూ పట్టణ, గ్రామీణ తేడా లేకుండా ఆదరణను చూరగొన్న ‘దిశ’ నేటి తరానికి కూడా వెంటవెంటనే వార్తలను చేరవేయడానికి ఈ స్కూల్ ద్వారా శిక్షణ పొందాలనుకోవడం మంచి పరిణామమన్నారు. ‘దిశ’ స్కూల్ ఆఫ్ డిజిటల్ జర్నలిజం ద్వారా భవిష్యత్ డిజిటల్ యుగానికి దిశా నిర్దేశం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
నిఖార్సయిన వార్తల కోసమే ‘దిశ’..
గతేడాది మార్చి 7న ప్రారంభమైన ‘దిశ’ సంస్థ వెబ్‌సైట్, డిజిటల్ పేపర్, వెబ్ టీవీల ద్వారా ఎప్పటికప్పుడు ఎలాంటి పక్షపాతం లేని వార్తలను ఇస్తున్నదని, అందుకే ప్రజలు ఆదరిస్తున్నారని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్‌రావు అన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మీడియా సంస్థలకు రాజకీయ పక్షపాతంతో పాటు స్వప్రయోజనాలు కూడా ఉన్నాయని, ఆ రంగంతో సంబంధం ఉన్న వ్యక్తిగా నిశితంగా పరిశీలించిన తర్వాతనే ‘దిశ’ను స్థాపించాలనుకున్నానని, తాను ఆశించినట్లుగానే సంస్థను నడిపిస్తున్నానని, ఇకపైన కూడా అదే తీరులో కొనసాగుతుందన్నారు. నిబద్ధతతో, పట్టుదలతో వృత్తిధర్మాన్ని నిర్వహించినందువల్లనే వ్యక్తిగత కెరీర్‌తో పాటు సంస్థ కూడా ఎదిగిందన్నారు. జర్నలిజంలోని నైతిక విలువలకు గౌరవం ఇచ్చే వ్యక్తిగా ఒక మీడియా సంస్థను నెలకొల్పాలన్న తన చిరకాల స్వప్నం ‘దిశ’తో సాకారమైందన్నారు.
అరచేతిలోనే ప్రపంచ వీక్షణం..
కాలం మారుతున్నాకొద్దీ జీవనశైలిలో, అలవాట్లలో తేడాలు వస్తున్నాయయని, గతంలో ఆసక్తిగా చదివినట్లుగా ఇప్పుడు ప్రింట్ రూపంలో పత్రికలను చదవడం బాగా తగ్గిపోయిందని ఎడిటర్ మార్కండేయ అన్నారు. దేశంలో జనాభాకంటే వారు వాడుతున్న స్మార్ట్ ఫోన్లు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నాయని, ఎప్పటికప్పుడు వార్తలను తెలుసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని, నిత్యం మొబైల్‌లోనే మునిగిపోతున్న పరిణామాన్ని గమనంలోకి తీసుకుని ‘దిశ’ డిజిటల్ పేపర్‌ను, వెబ్‌సైట్‌ను, వెబ్ టీవీని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ మూడు విభాగాలకూ మంచి ఆదరణ లభించిందని, ఇప్పుడు డిజిటల్ జర్నలిజంలో తర్ఫీదు అవుతున్న యువ జర్నలిస్టులే రేపటి తరానికి ట్రెండ్ సెట్టర్లుగా మారుతారని అన్నారు. ‘దిశ’ ప్రారంభమైన కొన్ని రోజులకే కరోనా రావడం ఒక అనూహ్య పరిణామమే అయినా ప్రజల్లోకి వెళ్ళడానికి వెసులుబాటు లభించిందన్నారు.
జర్నలిజంలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నవారితో పాటు స్వల్పంగా పాత్రికేయ అనుభవం ఉన్న 15 మంది యువతీ యువకులు ‘దిశ’ డిజిటల్ జర్నలిజం స్కూల్‌కు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ జర్నలిజం తొలి స్కూలు ‘దిశ’ నుంచి ప్రారంభం కావడం గమనార్హం. నేటి తరానికి ఎలాంటి వార్తలు అవసరమో, ఏం కోరుకుంటున్నారో స్పష్టమైన అవగాహన ఉన్న ఈ విద్యార్థులు.. భవిష్యత్తు డిజిటల్ న్యూస్‌కు దిక్సూచిగా నిలవనున్నారు. ‘దిశ’ స్కూల్ ఆఫ్ డిజిటల్ జర్నలిజం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఫజల్ రహమాన్, వివిధ విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు.