ఢిల్లీలో డీల్ కుదిరిందా.. మోడీ, కేసీఆర్ ప్లాన్ అదేనా..?

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ రాజకీయ చర్చలకు దారితీసింది. ప్రధాని మొదలు కేంద్ర మంత్రుల వరకు వరుస భేటీలపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో సరికొత్త రాజకీయ సమీకరణల్లో భాగమేనన్న వాదనా ఉన్నది. దేశవ్యాప్తంగా మోడీ గ్రాఫ్ పడిపోతుండడంతో ఇప్పటి నుంచే ఎంపీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నదనే వ్యాఖ్యానాలు తెరమీదకు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల పవనాలు లేకపోవడంతో అధికారం అనుమానమేనని ఆ పార్టీ […]

Update: 2021-09-05 22:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ రాజకీయ చర్చలకు దారితీసింది. ప్రధాని మొదలు కేంద్ర మంత్రుల వరకు వరుస భేటీలపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో సరికొత్త రాజకీయ సమీకరణల్లో భాగమేనన్న వాదనా ఉన్నది. దేశవ్యాప్తంగా మోడీ గ్రాఫ్ పడిపోతుండడంతో ఇప్పటి నుంచే ఎంపీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నదనే వ్యాఖ్యానాలు తెరమీదకు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల పవనాలు లేకపోవడంతో అధికారం అనుమానమేనని ఆ పార్టీ జాతీయ నేతలే నర్మగర్భంగా చెప్పుకుంటున్నారు. అక్కడ ఓటమి ప్రభావం రెండున్నరేళ్ల తర్వాత జరిగే సాధారణ ఎన్నికలపై పడుతుందని, ఇతర పార్టీల ఎంపీల మద్దతు అవసరం ఏర్పడుతుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది. ఆ ఆలోచనతోనే టీఆర్ఎస్ లాంటి పార్టీలతో స్నేహ సంబంధాన్ని నెలకొల్పుకుంటున్నదని తెలుస్తున్నది.

నిజానికి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తులు, బహిరంగ స్నేహం లేకపోయినా పరోక్షంగా పరస్పర సహకారం మాత్రం ఉన్నది. స్వయంగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు పలు సందర్భాల్లో “బీజేపీకి మా పార్టీ అంశాలవారీ మద్దతు ఇస్తున్నది“ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను జైల్లో పెట్టే రోజు ఎంతో దూరంలో లేదు అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఢిల్లీలో ప్రధానితో, అమిత్ షా తో సుదీర్ఘంగా ఒంటరి సమావేశాలు జరగడం గమనించదగిన పరిణామం. కేసీఆర్‌ను జైలుకు పంపించే సంగతేమోగానీ కేసీఆర్‌ను భద్రంగా కాపాడుకుని ఆ పార్టీకి చెందిన ఎంపీల మద్దతును పదిలంగా ఉంచుకోవడం ముఖ్యమనే అభిప్రాయం ఢిల్లీ నేతల ద్వారా వ్యక్తమవుతున్నది.

మాకు కేంద్రం.. మీకు రాష్ట్రం

వరుసగా రెండు టర్ములు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్ల సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కష్టమని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇప్పటి నుంచే సర్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. “రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మంచిదేగానీ.. అంతకంటే ముఖ్యం కేంద్రంలో నిలదొక్కుకోవడం“ అనే అభిప్రాయాన్ని ఒక నేత వ్యక్తం చేశారు. అందువల్లనే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలతో సంబంధం లేకుండా కొనసాగుతున్న పార్టీలను దగ్గర చేసుకోవడంపై మోడీ, అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల కాంగ్రెస్ నేతృత్వంలో పలు పార్టీలు సమావేశం కావడం బీజేపీకి ఆందోళన కలిగించింది. నితీష్ కుమార్ అసంతృప్తి రానున్న కాలంలో ఏ షేప్ తీసుకుంటుందోననే చర్చ కూడా బీజేపీలో చర్చనీయాంశంగానే ఉన్నది.

గడచిన ఏడేళ్ళుగా టీఆర్ఎస్ అందిస్తున్న సహకారాన్ని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ మరింత బలోపేతం చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. నోట్ల రద్దు, జీఎస్టీ, వ్యవసాయ బిల్లులకు మద్దతు, రాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్టు మొదలు అనేక అంశాల్లో టీఆర్ఎస్ తన స్నేహహస్తాన్ని అందించింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరించి కొన్నింటిని సాధించుకున్నది. ఇప్పటికీ సాకారంకాని అంశాలపై ఒత్తిడి చేయడంకంటే ఇలాంటి పొలిటికల్ మీటింగుల ద్వారానే సాధించుకోవచ్చని టీఆర్ఎస్ భావిస్తున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌పై రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఫైర్ అవుతున్నప్పటికీ కేంద్రంతో సఖ్యత ద్వారా కేసీఆర్ మరోవైపు నుంచి తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు.

ఆ రెండు పార్టీలు ఒక తాను ముక్కలే..

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ఒకే తాను ముక్కలని కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తున్నది. తాజాగా ఢిల్లీ టూర్‌లో గంటల వ్యవధిలోనే ప్రధానితో భేటీకి అవకాశం లభించడం పరస్పర ప్రయోజనాలను నెరవేర్చుకోవడంలో భాగమేనని వ్యాఖ్యానించింది. “ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ సమావేశం కావడం దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లే ఉంది. కేసుల నుంచి బయటపడేందుకే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధానితో, అమిత్ షా తో భేటీ కావడం. నిజానికి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వెళ్లినట్లు చెప్పుకుంటున్నా వాస్తవం అది కాదు. ఇప్పుడు కేసీఆర్ విన్నపాలన్ని విభజన చట్టంలోనే ఉన్నాయి. ఏడేళ్లుగా వాటిపై ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం రాజకీయాలను మాట్లాడుకోడానికే వీరి మధ్య భేటీలు“ అని కాంగ్రెస్ నేత మధు యాష్కీ వ్యాఖ్యానించారు.

ఢిల్లీకి గులాములు అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై నిత్యం విమర్శలు చేసే టీఆర్ఎస్ మంత్రులు ఇప్పుడు ప్రధానితో ఎందుకు భేటీ కావాల్సి వచ్చింది, వంగి వంగి దండాలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వెల్లడించాలని మధు యాష్కీ డిమాండ్ చేశారు. “బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటే. ఇంతకాలం మేం చెప్పినదే ఇప్పుడు రుజువైంది. మా వ్యాఖ్యలకు ఢిల్లీలో భేటీ బలం చేకూర్చింది. బీజేపీ జాతీయ నాయకత్వం, కేసీఆర్ డ్రామాలో రాష్ట్ర బీజేపీ నాయకులు పావులుగా మారారు. కేసీఆర్ ఢిల్లీలో ప్రధానితో భేటీ అయిన తర్వాతనే హుజూరాబాద్ ఎన్నిక వాయిదా పడింది. కేసీఆర్ అవసరాలను బీజేపీ కేంద్ర నాయకత్వం తీరుస్తున్నది“ అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.

డైలమాలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం..

ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లతో కేసీఆర్ భేటీ కావడం రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని డైలమాలో పడేసింది. కేసీఆర్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వవద్దని మొత్తుకుంటున్నా ప్రోటోకాల్ ప్రకారం సీఎంలను కలవడంలో తప్పేముందంటూ సీనియర్ నేతలు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర నేతలను నిరుత్సాహానికి గురిచేసింది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవడానికి, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే కేంద్ర నాయకత్వం దాన్ని నీరుగారుస్తున్నదని, ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళగలమని, టీఆర్ఎస్‌ను ఎలా ఢీకొట్టగలమని మనసులోనే మదనపడుతున్నారు. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అనే వ్యంగాస్త్రాలు వినిపిస్తున్న సమయంలో దానికి ఊతమిచ్చేలా కేంద్ర నాయకత్వం ప్రదర్శిస్తున్న తీరుపై రాష్ట్ర బీజేపీ నేతలు, శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News