హాస్పిటల్స్‌లో ‘డయాగ్నస్టిక్’ రోగం.. గవర్నమెంట్ చికిత్స శూన్యం.!
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వాసుపత్రుల్లో కీలకమైన డయాగ్నస్టిక్ యంత్రాలకు సుస్తీ అయినది. ఏరియా ఆసుపత్రుల నుంచి హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, కోఠి ఈఎన్‌టీ వరకు ఇదే తంతు కొనసాగుతున్నది. ఏళ్ల తరబడి మిషన్లు మూలకు పడ్డా.. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. మరమ్మత్తులు చేయించాల్సిన టీఎస్ఎంఎస్ ఐడీసీ(తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) కూడా స్పందించడం లేదని ఆయా ఆసుపత్రుల అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఆనారోగ్యంతో ఆసుపత్రులకు వస్తున్న పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగమేందో […]
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వాసుపత్రుల్లో కీలకమైన డయాగ్నస్టిక్ యంత్రాలకు సుస్తీ అయినది. ఏరియా ఆసుపత్రుల నుంచి హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, కోఠి ఈఎన్‌టీ వరకు ఇదే తంతు కొనసాగుతున్నది. ఏళ్ల తరబడి మిషన్లు మూలకు పడ్డా.. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. మరమ్మత్తులు చేయించాల్సిన టీఎస్ఎంఎస్ ఐడీసీ(తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) కూడా స్పందించడం లేదని ఆయా ఆసుపత్రుల అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఆనారోగ్యంతో ఆసుపత్రులకు వస్తున్న పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగమేందో తెలియక రోజుల తరబడి హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నామని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు.
గాంధీలో ఎంఆర్ఐ..
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో 16 నెలల నుంచి ఎంఆర్ఐ మిషన్ పని చేయడం లేదు. రిపేర్ కోసం అనేక సార్లు ఫిర్యాదు చేసినా టీఎస్ఎంఎస్ ఐడీసీ నుంచి ఎలాంటి స్పందన లేదని స్వయంగా ఆ ఆసుపత్రి అధికారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తయారీ సంస్థ కూడా రెగ్యులర్ చెకప్స్‌కు రావడం లేదని ఆసుపత్రుల్లోని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో ఎంఆర్ఐ స్కానింగ్ అవసరమైన పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఓపీ బిల్డింగ్ వద్ద కొత్త ఎంఆర్ఐ మిషన్‌ను ఇన్‌స్టాల్ చేస్తామని మూడు నెలల కిందట అధికారులు చెప్పారు. అది కూడా పెండింగ్‌లోనే ఉన్నది. ఇది ఇలా ఉంటే రెండు సీటీ స్కాన్ మిషన్లలో ఒకటి చెడిపోయింది. కొవిడ్ పేషెంట్లకు సీటీ స్కాన్ ఎంతో అవసరమైనప్పటికీ.. అధికారులు మాత్రం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరించడం గమనార్హం.
ఉస్మానియాలో క్యాథ్ ల్యాబ్..
ఉస్మానియాలో గుండె జబ్బులను స్పష్టంగా నిర్ధారించే క్యాథ్ ల్యాబ్ కూడా రెండేళ్ల నుంచి పనిచేయడం లేదు. మరమ్మత్తుల పేరిట అధికారులు కాలయాపన చేస్తున్నారే తప్పా.. పట్టించుకోవడం లేదని పేషెంట్లు ఆరోపిస్తున్నారు. ఇక్కడ కూడా కొత్త క్యాథ్ ల్యాబ్ మంజూరు అయిందని రెండు నెలల క్రిందట ఉస్మానియా డాక్టర్లు ప్రకటించారు. కానీ, ఏర్పాటులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజు వివిధ రకాల గుండె జబ్బులతో ఉస్మానియాకు సుమారు 50 నుంచి 100 పేషెంట్లు వస్తారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇటువంటి సమయంలో మిషన్లు అందుబాటులో లేకపోవడం దారుణం.
మరోవైపు కోఠి ఈఎన్‌టీలో కూడా సీటీ స్కాన్ పనిచేయడం లేదు. బ్లాక్ ఫంగస్ కేసులు అధికంగా వచ్చే రోజుల్లో తాత్కాలికంగా ఓ మిషన్‌ను ఏర్పాటు చేశారు. అది కేవలం పది రోజుల్లోనే పాడవడం గమనార్హం. ఇక జిల్లా ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. కనీసం ఎక్స్ రే మిషన్లను కూడా రిపేర్ చేయించడం లేదని ఆ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులే చెబుతున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే యంత్రాలు మూలకు పడ్డా పట్టించుకోకపోవడంతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని జూనియర్ డాక్టర్ల సంఘం మండిపడుతున్నది. సర్కార్ దవాఖానాలో ఉచిత వైద్యం అందుతుందనే భరోసాతో వచ్చే వాళ్లకు ల్యాబ్ చార్జీలు అదనపు భారం అవుతోందని జూడలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రిఫర్ టూ ప్రైవేట్..
సర్కారు దవాఖానల్లో డయాగ్నస్టిక్స్యంత్రాలకు రోగం రావడంతో మనుషులకు వచ్చిన రోగమేందో? తెలుసుకునేందుకు వైద్యులకు సైతం ఇబ్బందిగా మారింది. దీంతో చేసేదేమి లేక రోగులను ప్రైవేట్ ల్యాబ్‌లకు రిఫర్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ఏరియా హాస్పిటళ్ల నుంచి మెడికల్ కాలేజీ హాస్పిటళ్ల దాకా పరిస్థితి ఇట్లనే ఉన్నది. బీపీ మిషన్ల నుంచి వెంటిలేటర్ల దాకా మూలకుపడ్డాయి. ఇప్పటికే వచ్చే రోగుల సంఖ్యకు సరిపడా మిషన్లు లేక ఇబ్బంది పడుతుంటే, ఉన్నవి కాస్త మొరాయిస్తున్నాయి. దీంతో పేదల డబ్బంతా ప్రైవేట్ ఆసుపత్రులకే ఖర్చుపెట్టాల్సి వస్తున్నది.
గతంలో సింధూరి.. ఇప్పుడు టీఎస్ఎంఎస్ ఐడీసీ
ప్రభుత్వాసుపత్రుల్లోని యంత్రాలు, పరికరాల నిర్వహణ బాధ్యతను 2017లో చెన్నైకి చెందిన ఫేబర్ సింధూరి అనే సంస్థకు ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35 వేల వైద్య పరికరాలు, యంత్రాల నిర్వహణను ఆ కంపెనీ మెయింటెనెన్స్ చేసేది. ఈ మేరకు ఏటా ఆ యంత్రాలు, పరికరాల ఖరీదులో 5.7 శాతం మొత్తాన్ని ఫీజుగా చెల్లించారు. ఈ ఒప్పందం ప్రకారం ఏదైనా యంత్రం పాడైతే ఏడు రోజుల్లోగా రిపేర్ చేయాలి. కానీ, సమాచారమిచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఆ సంస్థ పట్టించుకోవడం లేదని డాక్టర్లు, ఉన్నతాధికారుల నుంచి ఫిర్యాదులు అందడంతో ఆ సంస్థ కాంట్రాక్ట్‌ను గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. అప్పట్నుంచి నేరుగా టీఎస్ఎంఎస్ ఐడీసీనే యంత్రాల నిర్వహణను చూస్తున్నది. కానీ, ఈ కార్పొరేషన్‌ది కూడా ఇదే వైఖరి ఉన్నట్లు ఆరోగ్యశాఖలోని ఓ కీలక అధికారి దిశకు తెలిపారు.