ఆ ఆలయంలో మహిళలే పూజారులు.. ఆ రహస్యం ఏంటో తెలుసా..
మన దేశంలో స్త్రీల ప్రవేశం నిషిద్ధమైన కొన్ని దేవాలయాలు, అలాగే పురుషులకు ప్రవేశం లేని దేవాలయాలు కొన్ని ఉన్నాయి.
దిశ, ఫీచర్స్ : మన దేశంలో స్త్రీల ప్రవేశం నిషిద్ధమైన కొన్ని దేవాలయాలు, అలాగే పురుషులకు ప్రవేశం లేని దేవాలయాలు కొన్ని ఉన్నాయి. అయితే కేవలం స్త్రీలు మాత్రమే దేవుడికి పూజలు చేసే దేవాలయం గురించి ఎప్పుడైనా విన్నారా. ఏంటి మహిళా పూజారులా అనుకుంటున్నారు కదా. అవునండి ఓ ఆలయంలో కేవలం మహిళలు మాత్రమే సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకి పూజలు చేస్తారట. దేశంలో మహిళా పూజారులు పూజలు చేసే ఏకైక దేవాలయం ఇదేనని చెబుతారు. ఇంతకీ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అనేక రహస్యాలు ఉన్న ఫూలనారాయణ దేవాలయం ఉత్తరాఖండ్‌లోని చమోలి-గర్వాల్ జిల్లాలో ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావనమాసంలో ఆలయ తలుపులు తెరుస్తారు. ప్రతి సంవత్సరం ఆలయం తలుపులు తెరవకముందే, ఒక పురుష పూజారితో పాటు ఒక మహిళా పూజారిని నియమిస్తారు. తర్వాత నెలన్నర పాటు నారాయణుడిని పూలతో అలంకరిస్తారు. ఈ విశిష్ట సంప్రదాయాన్ని ఇక్కడ ఏళ్ల తరబడి పాటిస్తున్నారు.
ప్రతి సంవత్సరం శ్రావనమాసంలో ఈ ఆలయ తలుపులు తెరుస్తారు. ఒకటిన్నర నెలల తర్వాత నందా అష్టమి రోజున ఒక సంవత్సరం పాటు ఆలయ తలుపులు మూసేస్తారు. ఈ ఆలయం ఏడాది పొడవునా కాకుండా ఒకటిన్నర నెలలు మాత్రమే తెరిచి ఉంటుందని. ఈ మొత్తం నెలన్నరలో కేవలం మహిళా పూజారులు మాత్రమే స్వామిని పూజిస్తారని స్థానికులు చెబుతున్నారు. ఆలయ ద్వారం తెరిచిన తర్వాత పాలు, పెరుగు, సత్తులతో చేసిన వంటకాలను స్వామికి నైవేద్యంగా పెడతారు. దేవాలయం తెరిచే రోజుల్లో గ్రామంలోని పాలు ఇచ్చే ఆవులన్నింటినీ ఇక్కడికి తీసుకొచ్చి దేవుడిని సేవిస్తారని చెబుతారు.
ఈ ఆలయంలో ఒక మహిళా పూజారి ఉండటం వెనుక ఉన్న విశ్వాసం ఏమిటంటే పూర్వం అప్సరస ఊర్వశి పూలు కోయడానికి ఉర్గం లోయకు వచ్చిందని చెబుతారు. అప్పుడు విష్ణువు ఇక్కడ సంచరించడాన్ని చూసిందట. అతడిని చూసి ఊర్వశి రంగురంగుల పూలతో అలంకరించిన దండను బహుకరించి రకరకాల పూలతో అలంకరించడం ప్రారంభించింది. అప్పటి నుంచి శ్రీ హరిని స్త్రీలు తమ చేతులతో అలంకరించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.