Karthika Masam: కార్తీక మాసంలో నదీస్నానం ఎందుకు చేయాలి? దాని పరమార్థం ఏమిటి?

కార్తీకమాసంలో నదీస్నానానికి ఎంతో విశిష్టత ఉంది. అయితే.. నదీస్నానం చేస్తే ఏడాదంతా ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతున్నారు.

Update: 2024-11-03 07:15 GMT

దిశ, వెబ్ డెస్క్: కార్తీకమాసం (Karthika Masam)అంటే గుర్తొచ్చేది.. పూజలు, పుణ్యస్నానాలు, శైవ క్షేత్రాలు, వనభోజనాలు, అయ్యప్ప మాలలు. హరహర మహాదేవ శంభోః శంకర, ఓం నమః శివాయ, ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః.. అనే మంత్రాలు పఠిస్తూ.. ఆ శివయ్యను తలచినా చాలు. ఏ కష్టమొచ్చినా తీరుస్తాడని భక్తుల నమ్మకం. కార్తీకమాసంలో.. శివపూజలు భక్తి, శ్రద్ధలతో చేస్తారు. వేకువజామునే చేసి.. చన్నీటి స్నానం, లేదా నదీస్నానం చేసి.. పూజలు ఆచరిస్తారు. ఈ మాసంలో దీప దానానికి, శివ కేశవుల పూజకు అత్యంత విశిష్టత ఉంది. నెలరోజులపాటు.. ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే స్నానం చేసి దీపాలు పెట్టి.. పూజలు చేస్తే.. అంతా శుభమే జరుగుతుందని నమ్మకం.

శాస్త్రీయ కోణం..

అయితే కార్తీక మాసం నుంచే చలి మొదలవుతుంది. క్రమంగా చలి పెరగ్గా.. చన్నీటి స్నానం కష్టమవుతుంది. అలాంటి వారు గోరువెచ్చని నీటితో కూడా స్నానం చేయవచ్చు. ఈ నెలల నదుల్లోకి చేరిన వరదనీరు తేటగా మారుతుంది. రాళ్లు, వృక్షాలను తాకుతూ వచ్చే నది నీటిలో ఎన్నో ఖనిజాలు, మూలికల గుణాలు కలుస్తాయి. ఫలితంగా ఆ నీరు ఔషధీనీరుగా మారుతుంది. అందుకే ఈ నెలలో నదీ స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదని నదీస్నానం చేయాలని చెబుతారు. ఎక్కడ స్నానం చేసినా.. "గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి..నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిథింకురు" అనే మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేయాలని పెద్దలు చెబుతారు.

కార్తీకమాసంలో చంద్రుడు చాలా శక్తివంతుడిగా ఉంటాడట. నీటిపై, మానవులపై చంద్రుడి ప్రభావం అధికంగా ఉంటుంది. రాత్రంతా చంద్రకిరణాల తాకిడి ఉండటంతో.. నదులు, చెరువుల్లో నీటిలో ఔషధ గుణాలు పెరుగుతాయి. ఆ నీటిలో ఉదయాన్నే స్నానం చేస్తే.. శరీర రుగ్మతలు దరిచేరవు.

కార్తీక నదీస్నానం (Karthika Punya Snanam) వెనుక మరో కథ ఉంది. శ్రీ మహావిష్ణువు ఈ నెలలో చెరువులు, దిగుడు బావులు, పిల్ల కాలువల్లో నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. వాపీ, కూప, తటాకాదుల్లో స్నానం చేయాలని పెద్దలు చెబుతారు. బద్ధకం, నొప్పులు, చలి అన్నీ తగ్గుతాయని నదీస్నానం చేయాలంటారు. ఈ ఒక్క నెల ఇలా స్నానం చేస్తే.. ఏడాదంతా ఆరోగ్యంగా ఉంటారంటారు. అంతే కాదు.. శివానుగ్రహం కూడా ఉంటుంది. భక్తి, ముక్తితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది కాబట్టే.. కార్తీమాసం స్నానాలకు అంత విశిష్టత ఉంది. 

Tags:    

Similar News