TTD: అయోధ్య రామునికి శ్రీవారి లడ్డూలు.. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి
ఈ రోజు తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్ యువర్ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.
దిశ వెబ్ డెస్క్: ఈ రోజు తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్ యువర్ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఆసక్తికర విషయాలను తెలియచేశారు. ఈ నెల 22వ తేదిన జరిగే శ్రీ రామచంద్రులవారి విగ్రహ ప్రతిష్ట, శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా విచ్చేసే భక్తులకు పంచిపెట్టేందుకు 25 గ్రాముల బరువు గల ఒక లక్ష శ్రీవారి లక్ష లడ్డూ ప్రసాదాలను తిరుమల నుండి అయోధ్యకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు.
అదేవిధంగా సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో దేశం లోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. తిరుపతి లోని అలిపిరి సప్తగోప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులు తిరుమలలో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్‌లో టికెట్ (రూ.300/-) కొనుగోలుచేసి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి 15వ తేదీ తిరుపతి లోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణం లోని పేరేడ్ మైదానంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు ‘‘శ్రీ గోదా కళ్యాణం’’ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.
శ్రీవారి భక్తులు టిటిడి పేరిట ఉన్న నకిలీ వెబ్‌సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతో టిటిడి అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in లో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని భక్తులను కోరడమైనదన్నారు.తిరుమలలో జనవరి 16వ తేదీ కనుమ పండుగ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం అలానే జనవరి 25న శ్రీరామకృష్ణతీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. అలానే డిసెంబరు నెలలో నమోదైన వివరాలు గురించి తెలియ చేశారు. డిసెంబరు నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 19.16 లక్షలని.. హుండీ కానుకలు రూ. 116.73 కోట్లని పేర్కొన్నారు. అలానే విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1 కోటి 46 వేలు కాగా 40.77 లక్షలు మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని తెలియచేసారు. ఇక 6.87 లక్షలు మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సిఈ నాగేశ్వరరావు, ఎస్‌ఇ-2 జగదీశ్వర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.