ఈ దేవాలయాల్లో ఏ ఆలయానికి వెళ్లినా శని దోషం తొలగిపోతుందట..!
చాలా మంది జాతకాలు చెప్పించుకోవడానికి, తమ రాశిఫలం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఉత్సాహంతో ఉంటారు.
దిశ, వెబ్ డెస్క్ : చాలా మంది జాతకాలు చెప్పించుకోవడానికి, తమ రాశిఫలం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఉత్సాహంతో ఉంటారు. ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది, ఎలాంటి మార్పులు తమ జీవితంలో రాబోతున్నాయో అని తెలుసుకుంటారు. ఏ గ్రహం ఎలా ఉన్నా శని ప్రభావం జాతకంలో ఎక్కువగా ఉందంటే చాలు బెంబేలెత్తిపోతుంటారు. నిజానికి శని దేవుడు న్యాయానికి అధిపతి. ఇలాంటి న్యాయాధిపతి అయిన శనిదేవుడు ఎవరి జాతకంలో బలంగా ఉంటారో వారు త్వరలోనే ధనవంతులుగా మారిపోతారని జ్యోతిష్యశాస్త్రంలో చెబుతున్నారు. అదే జాతకంలో ప్రతికూలంగా ఉంటే కష్టాలు తప్పవంట. ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో శని దోషాలను ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. శనిదేవుడు సానుకూలంగా ఉండాలన్నా, ఆయన అనుగ్రహం కావాలనుకోవాలన్నా శనిదేవుని ఆలయానికి వెళ్లి నల్ల నువ్వులు, ఆవాల నూనె సమర్పిస్తే ప్రయోజనం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. మరి అంత పవర్ ఫుల్ శనిదేవుని ఆలయాలు ఎక్కడ ఉన్నాయి, మన దేశంలో ఎన్ని శనిదేవాలయాలు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం.
శని ధామ్ ఆలయం (ఢిల్లీ)..
శనిధామ్ ఆయలం ఢిల్లీలోని ఛతర్ పూర్‌ఎంతో ప్రసిద్దమైన శని ఆలయం. ఈ ఆలయానికి చాలా మంది భక్తులు శనిదేవుని అనుగ్రహం కోసం వస్తుంటారు. ఈ ఆలయంలో వెలసిన శనిదేవున్ని దర్శించుకుంటే శని దోషాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. ఈ ఆలయంలో ప్రపంచంలోనే ఎక్కడా లేనంత అత్యంత ఎత్తైన శని దేవుడి విగ్రహాన్ని దర్శించవచ్చు.
కోకిలవ ధామ్(ఉత్తరప్రదేశ్)..
కోకిలవ ధామ్ దేవాలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర జిల్లాలోని క్రిష్ణానగర్‌లో ఉంది. ఈ శనీశ్వరాలయంలో శనీశ్వరుడికి నైవేద్యంగా ఏడు శనివారాలు ఆవాల నూనె సమర్పిస్తే ఎలాంటి శనిదోషాలు ఉన్నా తొలగిపోతాయని అక్కడి భక్తుల నమ్మకం. కోకిలవ ధామ్ క్షేత్రంలో శ్రీక్రిష్ణుడు ఆ శనిదేవునికి కోకిల రూపంలో దర్శనమిచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ దేవాలయాన్ని కోకిలావనంగా పిలుస్తారని అంటారు.
తిరునల్లార్ దేవాలయం (తమిళనాడు)..
తిరునల్లార్ శనీశ్వరాలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో వెలసింది. ఎవరి జాతకంలో ఐనా శని స్థానం మార్పు చెందినప్పుడు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయిస్తారట. అలా చేయడం ద్వారా మంచి జరుగుతుందని అక్కడి భక్తుల నమ్మకం. రెండు నదుల మధ్య ఉన్న ఈ శనీశ్వరాలయంలో శనిదేవునితో పాటు శివున్ని పూజిస్తే శని దోషం తొలగిపోతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.
శని సింగ్నాపూర్ (మహారాష్ట్ర)..
శని సింగ్నాపూర్ శనీశ్వరాయం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని శింగనాపూర్ లో ఉంది. ఈ ఆలయంలోని శనీశ్వరున్ని దర్శించుకుంటే ఒక్కరోజులోనే శనిదోషం తొలగిపోతుందని చెబుతారు. ఇక్కడి శని దేవుడికి భయపడి దొంగలు ఎలాంటి దొంగతనాలు చేయరట. అంతే కాదు ఊళ్లో ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులు ఉండవట.
శని దేవాలయం (కర్నాటక)
కర్నాటక రాష్ట్రంలోని తుమ్‌కూర్ జిల్లాలో కూడా ఓ శనిదేవాలయం ఉంది. ఈ ఆలయంలోని శనిదేవుడు కాకి పై కూర్చుని భక్తులకు దర్శనం ఇస్తాడు. శని దోషం ఉన్నవారు ఈ ఆలయానికి వెళ్లి పూజలు చేస్తే దోషం తొలగిపోతుందని చెబుతుంటారు.