ఆ ఆలయం నిర్మాణానికి ఆవే కారణం..

పరమశివుడు ఆరాధకునిగా నిర్మించిన దేవాలయం శివాలయం.

Update: 2023-02-20 11:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : పరమశివుడు ఆరాధకునిగా నిర్మించిన దేవాలయం శివాలయం. హిందూ దేవాలయాల నిర్మాణం ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం జరుగుతుంది. స్థల, కాల భేదాలను బట్టి నిర్మాణ రీతులలో భేదాలుంటాయి. భారతదేశంలో ప్రసిద్ధ శివాలయాలు శిల్పకళానిలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆలయంలో ప్రవేశించడానికి ముందే గోపురాలు కనిపిస్తాయి. గోపురాలపై రాజుల కాలంలో చెక్కిన అద్భుతమైన శిల్పాలు చెక్కి ఉంటాయి. ఆలయం అంతర్భాగంలో, గర్భగుడిలో శివలింగంబ్రహ్మ స్థానంలో ప్రతిష్ఠిస్తారు. కొన్ని ఆలయాలలో శివలింగం స్వయంభూమూర్తిగా భావిస్తారు.

ఈ శివాలయాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగి ఉంటాయి. మరి ఎంతో చరిత్ర కలిగిన శివాలయాల్లో శ్రీ గోలింగేశ్వర ఆలయం కూడా ఒకటి. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది. ఆలయంలో వెలసిన శివయ్యను గోలింగేశ్వరుడు అని ఎందుకు పిలుస్తారు. దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తూర్పు గోదావరి జిల్లా, బిక్కవోలు గ్రామంలో ఈ ఆలయం ఉంది. పూర్వకాలంలో కానేటి కోటలో బిరుదాంకుడు అనే రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. బిక్కవోలు ప్రాంతాన్ని ఈయన పాలిస్తున్న సమయంలో 118 చెరువులు తవ్వించి, 118 దేవాలయాలను నిర్మించారు. ఆయన కట్టించిన కోటల్లో కొన్ని శిథిలమైపోగా మరికొన్ని మాత్రమే మిగిలాయి. వాటిలో ఒక కోటలో మహాలక్ష్మి అమ్మవారి గుడి ఉంది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే భక్తుల కోరికలు తూచా తప్పకుండా తీరుతాయని చాలా మంది భక్తుల నమ్మకం.


పురాణ గాథ.. ఆలయ చరిత్ర..

పూర్వకాలంలో శ్రీ గోలింగేశ్వరస్వామి లింగం బిరుదాంకపురంలో మంద బయలు భూమిలో కప్పి ఉండేది. అదే గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన ఆవు ప్రతిరోజు పుట్టలో లింగం ఉన్న ప్రదేశానికి వెళ్లి దాని పాలతో లింగానికి అభిషేకించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయేదట. ఇంటికి రాగానే రైతు ఆవుపాలు పితకడానికి వెళితే ఆవు రైతుకు పాలు ఇచ్చేదికాదట. ఆవు ప్రతిరోజు ఇలాగే చేస్తుండడంతో ఆవుపాలు ఏమైపోతున్నాయి, పాలెందుకు ఇవ్వడం లేదంటూ సందేహించాడట. ఒకనాడు రైతు తన వద్ద పనిచేస్తున్న పాలికాపుకి ఆవుని కంటకనిపెట్టి ఉండమని చెప్పాడట. ప్రతిరోజులాగే పాలికాపు ఆవుల మందలో ఆవును వదిలాడట. ఆ ఆవు ఎటు వెళితే అటు వెళుతూ గమనించాడట. అప్పుడు ఆ ఆవు అక్కడక్కడ మేత వేస్తూ నేరుగా లింగాకారం ఉన్న ప్రదేశానికి చేరుకుని లింగంపైన పాలుకార్చి తిరిగి మేత మేస్తూ మందలో కలిసిపోయింది.

అది చూసిన పాలికాపు ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తే అక్కడ ఆవు కార్చిన పాలు ఉన్నాయట. ఇదే విషయాన్ని ఆవులకాపరి రైతుకు చెప్పాడట. రైతు ఈ విషయాన్ని గ్రామంలోని ఉన్నవారికి చెప్పాడట. అదివిన్న గ్రామస్థులంతా ఆవు ఎక్కడైతే పాలుకార్చిందో అక్కడికి తరలివెళ్లారట. ఆవుపాలతో మడుగుకట్టిన భూమిని చూసిన గ్రామస్థులు అక్కడ ఏ దేవుడు వెలిశాడో తెలుకునేందుకు మంచి ముహూర్తం చూసి తవ్వకాలు చేశారట. అప్పుడు పానమట్టంతో సహా లింగం బయటపడిందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ విషయాన్ని ప్రజలు రాజు చెవినవేయడంతో బిరుదాంక మహారాజు గుడి కట్టించడానికి ముందుకొచ్చాడట. గుడి నిర్మాణానికి పునాదులు తవ్వుతున్న సమయంలో ఓ పుట్ట బయటపడిందట. దాన్ని తవ్వే కొద్ది మరోపుట్ట పుట్టిందట. ఎన్నిసార్లు తవ్వినా అలాగే పుట్టుకొచ్చాయట. దాంతో చేసేదేమీలేక ఆ పుట్టను తప్పించి తిరిగి పునాదులు తవ్వుతుండగా కుమార, సుబ్రమణ్యేశ్వర స్వామి విగ్రహం బయటపడిందని పురాణాలు తెలుపుతున్నాయి. అయితే ముందుగా బయటపడిన లింగాన్ని శ్రీ గోలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే సుబ్రమణ్యేశ్వర స్వామి, కుమారస్వామి ఇద్దరు దేవుళ్లు ఉన్న ఆలయాలు రెండు ఉన్నాయి. అందులో ఒకటి దక్షిణ దేశం 'ఫలణి'లో ఉండగా మరో ఆలయం బిరుదాంకపురంలో ఉంది.

గోలింగేశ్వర స్వామి ఆలయం..

ఈ ఆలయం గోడలపై ఎన్నో రచనలు చెక్కి ఉంటాయి. ఈ ఆలయం శిల్ప కళా నైపుణ్యానికి పత్రీకగా ఉంది. శివపార్వతుల శిల్పం, కూర్చొని ఉన్న వినాయకుని ప్రతిమ ఉన్నాయి. చక్కటి శిల్పకలలతో, అందమైన ప్రకృతి నడుమ నిర్మించడం విశేషం. ఈ ఆలయంలో ఆ మహదేవుడు స్వయంభూగా వెలిశాడని, ఇక్కడ ఏ కోరిక కోరినా తప్పకుండా తీరుతుందని అక్కడి భక్తుల నమ్మకం.

Tags:    

Similar News