అయోధ్య రామాలయానికి వెళ్లినప్పుడు ఈ ప్రదేశాలను చూడటం అస్సలు మిస్ అవ్వకండి..!
రామ జన్మభూమి అయోధ్యలో శ్రీ రాముని ఆలయాన్ని నిర్మించాలన్న ఎన్నో ఏండ్ల కల నెరవేరింది.
దిశ, ఫీచర్స్ : రామ జన్మభూమి అయోధ్యలో శ్రీ రాముని ఆలయాన్ని నిర్మించాలన్న ఎన్నో ఏండ్ల కల నెరవేరింది. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపం అయోధ్య రామమందిరం. ప్రపంచంలోనే ఇది మూడో అతి పెద్ద హిందూ దేవాలయం. ఈ ఆలయ నిర్మాణంలో ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందంగా 2500 ఏండ్లు నిలిచి ఉండేలా నిర్మించారు. ఎంతో అట్టహాసంగా నిర్మించిన ఆలయంలో జనవరి 22న ప్రాణ ప్రతిష్టాపన జరిపి ఆ తరువత శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. దేశం నలుమూలల నుంచి ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు రామ భక్తులు వేల సంఖ్యలో అయోధ్యకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. అయోధ్య శ్రీరామ మందిరాన్ని సందర్శించిన తరువాత ఇతర దేవాలయాలను కూడా సందర్శించవచ్చు. అలా సందర్శించాల్సిన ప్రదేశాలు ఇంకా ఏమేమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
గుప్తర్ ఘాట్..
ఇది రామజన్మభూమికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. అత్యంత అందమైన ప్రకృతి అందాలతో, సరయూ నది పరవళ్లతో దర్శనం ఇస్తున్న ఆరవ ఘాట్ ఇది . శ్రీరామ చంద్రుడు తన సర్వోన్నత నివాసానికి ఈ ఘాట్ నుంచే వెళ్లాడని రామాయణం చెబుతోంది. అలాగే రాముడు, సీత, లక్ష్మణులతో కలిసి రహస్యంగా ఇదే ప్రదేశంలో జలస్నానం చేశారని, అందుకే దీన్ని గుప్తర్ ఘాట్ అని పిలుస్తారని చెబుతారు.
హనుమాన్ గర్హి..
శ్రీ రాముడు నమ్మినబంటు, రామ చంద్రునికి గొప్ప భక్తుడు హనుమంతుడు. అంతటి గొప్ప భక్తుడు వెలసిన అద్భుతమైన ఆలయమే హనుమాన్ గర్హి. అయోధ్యకు రక్షకుడిగా భావించే వాయుపుత్రున్ని తప్పనిసరిగా దర్శించుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. అయోధ్యలో శ్రీరాముని దర్శనానికి వెళ్లేందుకు భక్తులు హనుమాన్ గర్హి ఆలయానికి వచ్చి ఆంజనేయుని అనుమతి పొంది అయోధ్యకు వెళ్లాలని పండితులు చెబుతున్నారు. భక్తులు పవనపుత్రుని దర్శనం చేసుకునేందుకు 76 మెట్లు ఎక్కి ఆలయానికి చేరుకోవాలి. సిరాజ్-ఉద్-దౌలా ఈ ఆలయాన్ని స్వామి అభయరామదాసు సన్నిధిలో 300 ఏండ్ల క్రితం నిర్మించారు. రాజ ద్వారానికి ఎదురుగా ఎత్తైన గుట్టపై ఆలయాన్ని నిర్మంచారు.
నాగేశ్వరనాథ్ ఆలయం..
శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించించిన ఆలయమే నాగేశ్వరనాథ్ ఆలయం. ఇది ఎంతో ప్రసిద్ధి గాంచిన శివాలయం. శివయ్యకు ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలోని శివలింగానికి భక్తులు సరయూనది నుంచి నీటిని తీసుకువచ్చి అభిషేకం చేస్తారు.
కనక భవన్..
కనక భవన్ అద్భుతమైన శిల్పకళా వైభవానికి సంకేతం. ఈ కనక భవనాన్ని దశరథుని మూడో భార్య కైకేయి రాజభవనం అని చెబుతారు. దశరథ మహారాజు రాణి కైకేయికి ఈ భవనాన్ని బహుమతిగా ఇస్తే కైక తన కోడలు సీతాదేవికి ఇచ్చినట్లు చరిత్ర చెబుతుంది. ఈ భవనంలో సీత, లక్ష్మణ సమేతంగా రాముని విగ్రహం కొలువుదీరింది.
దేవకాళి దేవాలయం..
అయోధ్యకు నైరుతి దిశలోని ఫైజాబాద్ నగరంలో దేవకాళి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో మాతా గిరిజా దేవి కొలువై ఉన్నారు. సీతామాత దేవకాళీ విగ్రహాన్ని తనతో పాటు తీసుకువచ్చిందని, దశరథ మహారాజు ఆలయాన్ని నిర్మించి ఆ విగ్రహాన్ని ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి.