మకర సంక్రాంతి రోజున ఏ దానం చేస్తే ఏం ఫలితాలు వస్తాయో తెలుసా..
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒకటి.
దిశ, ఫీచర్స్ : దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒకటి. మకర సంక్రాంతి రోజున వివిధ రాష్ట్రాల్లో అనేక రకాల వస్తువులను దానం చేస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైన శ్రేష్టమైనదని పండితులు చెబుతున్నారు. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు వంటి వాటిని దానం చేస్తారు. ఈ రోజున గోదానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని నమ్ముతారు.
మకర సంక్రాంతి పండుగను భారతదేశం అంతటా అలాగే నేపాల్‌లో కూడా జరుపుకుంటారు. ఈ పండుగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. తమిళనాడులో దీనిని పొంగల్ అని జరుపుకుంటారు. కొన్ని ప్రదేశాలలో ఈ పండుగను ఉత్తరాయణం అని కూడా పిలుస్తారు. మకర సంక్రాంతి నాడు సూర్య భగవానుని పూజించి పవిత్ర నదులలో స్నానం చేస్తారు. ఇలా చేయడం ద్వారా కీడు తొలగిపోతుందని ప్రజలు భావిస్తారు. సంక్రాంతి రోజున పుణ్య నదీ స్నానం చేస్తే పుణ్య ఫలితాలు వస్తాయని మత విశ్వాసాలు చెబుతున్నాయి.
ఖిచ్డీ దానం చేయండి
మకర సంక్రాంతిని ఖిచ్డీ అని కూడా అంటారు. ప్రజలు ఈ రోజున పొడి ఖిచ్డీ అంటే ఖిచ్డీ పదార్థాలను దానం చేయడం వలన మీ జాతకంలో సూర్యుడు, బృహస్పతి, చంద్రుడు ఉన్న స్థానాలు బలపడతాయని పండితులు చెబుతున్నారు. అలాగే కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుందని నమ్ముతారు.
బెల్లం, నువ్వుల దానం
సంక్రాంతి రోజున బెల్లం, నువ్వులు దానం చేస్తే శుభం కలుగుతుందని భావిస్తారు. ప్రధానంగా నల్ల నువ్వులను శని దేవుడికి సమర్పిస్తారు. ఈ రోజు నువ్వులు, అన్నంలో బెల్లం కలిపి లడ్డూలు చేసి దానం చేసే సంప్రదాయం కూడా ఉంది. ఇలా చేయడం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.
నెయ్యి దానం..
మకర సంక్రాంతి రోజున నెయ్యి దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి.
వెచ్చని బట్టలు దానం..
మకర సంక్రాంతి పండుగను శీతాకాలంలో జరుపుకుంటారు. ఈ చలికి ఎంతో మంది వెచ్చని బట్టలు లేక వణికిపోతారు. అవసరమైన వారికి వెచ్చని బట్టలు దానం చేయడం ద్వారా పుణ్యం వస్తుందని చెబుతున్నారు.
పొరపాటున కూడా ఇలా చేయకండి..
మకర సంక్రాంతి రోజున కొన్ని పనులు చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. చేయకూడని పనులు చేయడం ద్వారా ఎన్నో సమస్యలు కొని తెచ్చుకునే ప్రమాదం ఉందని పండితులు చెబుతున్నారు. మకర సంక్రాంతి రోజున స్నానం చేయకుండా ఆహారం తీసుకోవద్దు. ఎవరినీ అవమానించవద్దు, ఎవరినీ అసభ్య పదజాలంతో ధూషించవద్దు. విరాళాలు ఇవ్వడం, దానం చేయడాన్ని నిరాకరించవద్దు.