అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక.. ఇన్విటేషన్ లో ఉన్న ప్రత్యేకతలు ఇవే..

రామ జన్మభూమి అయోధ్య నగరంలో భవ్య రామ మందిరం నిర్మాణం పూర్తై ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంది.

Update: 2024-01-05 07:18 GMT

దిశ, ఫీచర్స్ : రామ జన్మభూమి అయోధ్య నగరంలో భవ్య రామ మందిరం నిర్మాణం పూర్తై ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంది. 2.77 ఎకరాల విస్తీర్ణంలో, 161 అడుగుల ఎత్తులో, 360 అడుగులు పొడవుతో, 235 అడుగులు వెడల్పుతో, 392 స్తంభాలు 44 తలుపులతో రామమందిరం నిర్మితమైంది. ఎంతో అద్భుతంగా నిర్మితమైన భవ్య రామ మందిరం ఈనెల 22 వ తేదీన ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ముందుగా రామచంద్రుని ప్రాణప్రతిష్ఠ చేసి అనంతరం రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు. ఇందులో భాగంగానే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రత్యేకంగా ఓ ఆహ్వాన పత్రికను డిజైన్ చేసింది. ఈ పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇంతగా వైరల్ అవుతున్న ఆ కార్డులో ఏ అంశాలు ఉన్నాయో చూద్దామా..

ప్రతి ఆహ్వాన పత్రిక పై శ్రీరాముడి చిత్రం, రామమందిరం కోసం చేసిన ఉద్యమానికి సంబంధించిన వివరాలను ఓ బుక్ లెట్ లో ప్రచురించారు. 1528 నుండి 1984 వరకు రామమందిర నిర్మాణం కోసం చేసిన 76 పోరాటాల్లో పాల్గొన్న వారికి ఈ బుక్‌లెట్‌ను అంకితం చేశారు. అలాగే ప్రధాన పత్రిక పై అయోధ్య రామమందిర చిత్రం ఉంది. అలాగే విల్లు, బాణాలు ధరించిన బాలరాముని చిత్రాలను కూడా ప్రచురించారు. ఆహ్వాన పత్రిక కింది భాగంలో శ్రీరామ్ ధామ్’ అని.. దానికింద అయోధ్య అని ముద్రించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్‌ దాస్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విచ్చేస్తున్నట్లు ఆహ్వాన పత్రికలో ప్రచురించారు. జనవరి 22 ఉదయం 11:30 గంటలకు అయోధ్య రాముని ‘ప్రాణ ప్రతిష్ఠ’ పూజ, ప్రారంభమవుతుంది. అనంతరం ప్రధాని మోదీ మధ్యాహ్నం 12:30 నిమిషాలకు ప్రముఖ అతిథులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఈ ఆహ్వాన పత్రికలను దేశవ్యాప్తంగా 7 వేల మంది అతిథులకు అందజేయనున్నారట. ఆహ్వాన పత్రికను అందుకునే వారి జాబితాలో బిలియనీర్స్ ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ లు ఉన్నారు. వీరితో పాటు రామాలయ ఉద్యమంలో మరణించిన 50 మంది కరసేవకుల కుటుంబ సభ్యులు, దేశవ్యాప్తంగా ఉన్న 4 వేల మంది సాధువులు ఉన్నట్లు ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.

ఆలయ విశేషాలు..

ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాల రూప విగ్రహం (శ్రీరామ్ లల్లా విగ్రహం) ఉంటుంది. మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బార్ ఉంటుంది. రామ మందిరంలో ఐదు మండపాలు ఉన్నాయి. అవి నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన, కీర్తన మండపాలు. ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతో అలంకరించనున్నారు.మందిరానికి తూర్పు వైపు సింహద్వారం గుండా 32 మెట్లతో గుడి లోపలికి వెళ్లాలి. మందిరంలో వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంప్‌లు,లిఫ్టులు ఉన్నాయి. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో ప్రాకార గోడ నిర్మించారు. మందిరంలోని నాలుగు మూలల్లో సూర్యుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలున్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం, దక్షిణాన హనుమంతుని గుడి ఉన్నాయి.

మందిరం సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి (సీతా కూప్) ఉంది. శ్రీ రామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్‌లో, వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్ రాజ్, శబరీ మాత, దేవి అహల్య మందిరాలు ఉన్నాయి. కాంప్లెక్స్ నైరుతి భాగంలో, కుబేర్ తిలా వద్ద, శివుని పురాతన మందిరం, జటాయువు విగ్రహంతో పాటుగా పునరుద్ధరించబడింది.

Tags:    

Similar News