శాంకరి శక్తిపీఠం కనుమరుగు వెనక దాగిన రహస్యం ఇదే!
ఎంతో విశిష్టత గలిగి శక్తిపీఠాల గురించి ఎన్నో కథలు ప్రాచుక్యంలో ఉన్నాయి.
దిశ, వెబ్ డెస్క్ : ఎంతో విశిష్టత గలిగిన శక్తిపీఠాల గురించి ఎన్నో కథలు ప్రాచుక్యంలో ఉన్నాయి. ఎంతో మహిమగల అష్టాదష శక్తి పీఠాల్లో ముందుగా నమస్కరించవలసింది శాంకరీ శక్తి పీఠం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శక్తిపీఠాల్లో ఇది మొదటిది. ఈ శక్తిపీఠం శ్రీలంకలోని పశ్చిమతీరానగల, ట్రింకోమలి పట్టణంలో వెలసింది. మహర్షులు శాంకరీ దేవిని వనశాంకరి అని కూడా పిలిచేవారని పురాణాలు చెబుతున్నాయి. వనం అంటే అడవి, నీరు అని అర్ధం వస్తుంది. ఈ తల్లిచుట్టూ నీరు, దట్టమైన అడవి ఉండడంతో పూర్వీకులు, మహర్షులు వనశాంకరిగా పిలిచేవారు. ఈ తల్లి ధర్మాన్ని రక్షిస్తూ, రాక్షసగుణాలను సంహరిస్తూ భక్తులను కాస్తుంది.
శక్తిపీఠం ఎలా వెలసింది...
దక్షప్రజాపతి బృహస్పతియాగానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించి శివపార్వతులని పిలవలేదు. అయినా జగజ్జనని పార్వతీ దేవి శివుని మాట వినకుండా యాగానికివెళ్తుంది. అక్కడ జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. సతీదేవి వియోగాన్ని తట్టుకోలేని శివుడు ఆమెను తలచుకుంటూ జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు.
అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతల ప్రార్థనలు మన్నించి సుదర్శన చక్రంతో పార్వతీదేవి దేహాన్ని ఖండాలుగా చేసి శివుడికి కర్తవ్యాన్ని బోధిస్తాడు. పార్వతి శరీరాన్ని శ్రీ మహావిష్ణువు ఖండాలుగా చేసినపుడు అమ్మవారి తొడభాగం శ్రీలంక ద్వీపంలోని తూర్పు తీరప్రాంతములో ఉన్న ట్రింకోమలిపురలో పడిందని పురాణాలు చెపుతున్నాయి. అందుకే అక్కడ శాంకరీదేవి ఆలయాన్ని కట్టారని పురాణాలు చెపుతున్నాయి.
ఆలయం ఏ స్థితిలో దర్శనం ఇస్తుంది..
17 వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి శాంకరీదేవి ఆలయాన్ని కూలగొట్టేశారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. అయితే ఆ ప్రాంతంలో శక్తి పీఠం ఉంది అనడానికి ఆనవాలుగా ఓ స్థంబం మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తుందని చెపుతున్నారు. ఇదిలా ఉంటే పూర్వం బౌద్ధమతం, క్రైస్తవమతం అభివృద్ధి చెందడమే హిందూ దేవాలయాలను శిధిలం చేయడానికి కారణం అనికూడా చరిత్ర చెపుతుంది. ఇతర మతాలు ప్రాచుర్యంలోకి రాగానే హిందూమతానికి ఆదరణ కరువైందని చెప్పుకోవాలి.
దాంతో హిందూ దేవాలయాలు శిథిలావస్థకు చేరాయి. శాంకరీదేవి మందిరం కాలగర్భంలో కలిసిపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చరిత్ర చెబుతుంది. ట్రింకోమలిలో ఉన్న హిందూ ఆలయాలను పోర్చుగీసువారు కూల్చే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్న కొంత మంది పూజారులు ఆలయంలోని విగ్రహాలను దాచిపెట్టారు. బ్రిటిష్ వారు దేశాన్ని వదిలివెళ్లగానే ఆలయాలను పున:నిర్మాణం చేపట్టారని చెబుతుంటారు.