శివుని బొటనవేలును పూజించే ఆలయం.. అక్కడ లింగం రంగు కూడా మారుతుందట..

ప్రపంచవ్యాప్తంగా అనేక శివాలయాలు ఉన్నాయి.

Update: 2024-06-08 13:55 GMT

దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా అనేక శివాలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. శివుని ఆలయాలన్నింటిలో శివలింగాన్ని లేదా విగ్రహాన్ని పూజిస్తారు. అయితే రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో ఉన్న అచల్‌ఘర్‌లోని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం అన్ని ఇతర ఆలయాల కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆలయంలో శివలింగాన్నో, శివుని విగ్రహన్నో పూజించరు. ఆయన కాలి బొటనవేలును పూజిస్తారు.

మహాదేవుని కుడి బొటన వేలికి పూజ...

పురాణాల ప్రకారం ప్రస్తుతం మౌంట్ అబూ ఉన్న ప్రదేశంలో ఓ పెద్ద బ్రహ్మ అగాధం ఉండేదని చెబుతారు. ఆ అగాధం ఒడ్డున వశిష్ఠ మహర్షి నివసించేవాడట. ఒకానొక రోజు వశిష్ఠ మహర్షికి చెందిన కామధేనువు గడ్డి మేస్తూ అనుకోకుండా ఆ బ్రహ్మ కందకంలో పడిపోయిందట. దాంతో ఋషి గోమాతను కాపాడమని గంగాదేవిని, సరస్వతిని ప్రార్థించడం మొదలు పెట్టాడు. దీంతో ఆ బ్రహ్మకందకంలో నీళ్లు చేరి ఆవు బయటికి వచ్చింది. పదే పదే అలాగే జరగడంతో వశిష్ఠ ముని హిమాలయాలకు చేరుకుని బ్రహ్మకందకాన్ని పూడ్చమని దేవుళ్లని ప్రార్థించాడు. మహర్షి అభ్యర్థనను హిమాలయుడు అంగీకరించి తన పుత్రుడు నంది వద్రధన్‌ను వెళ్ళమని ఆదేశించింది. అప్పుడు అర్బుద్ నాగ నంది వద్రధన్‌ వశిష్ఠ ఆశ్రమానికి చేరుకున్నారు. అగాధాన్ని పూడ్చిన తర్వాత అక్కడ ఏడుగురు మహర్షుల ఆశ్రమాలు ఉండాలని, పర్వతం ఎంతో సుందరంగా, వృక్షసంపదతో ఉండాలని వరం కోరుకున్నాడు.

నంది వద్రధనునికి వశిష్ఠుడు వరాలను ఇచ్చాడు. అలాగే తన పేరును అర్బుద్ నాగ్ పర్వతానికి పెట్టాలని కూడా వరం కోరారు. వరం పొందిన కాసేపటికి నంది వద్రధనుడు బ్రహ్మఅగాధంలో దిగగానే కాస్త కాస్త మునిగిపోతూ ఉన్నాడు. అలా మునుగుతున్నసమయంలో వద్రధనుని ముక్కు పై భాగం ఒక్కటే భూమి పై ఉందట. అదే ప్రాంతం ఇప్పుడు మౌంట్ అబూగా పేరుగాంచింది. ఆ పరిస్థితుల్లో కూడా నంది కదలకుండా ఉండలేకపోయింది. ఆ సమయంలో వశిష్ఠుడు శివున్ని ప్రార్ధించడంతో ఆయన తన కుడిపాదం బొటనవేలును ఒక్కసారిగా చాచి దాన్ని కదలకుండా చేశాడు. అప్పుడే దానికి అచలఘర్ అని పేరువచ్చి, అచలేశ్వరుని ఆలయం అక్కడ ఉంది. అప్పటి నుంచి శివుని బొటనవేలు అచలేశ్వర మహాదేవునిగా పూజలందుకుంటుంది.

శివలింగం రంగు..

శ్రీ అచలేశ్వర మహాదేవ్ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం ప్రతిరోజూ 24 గంటల్లో మూడు సార్లు రంగు మారుతుందని చెప్పారు. ఉదయం ఎర్రగా, మధ్యాహ్నానికి కుంకుమ రంగులో, రాత్రి వేళ నల్లగా మారుతుంది. అయితే రోజులో మూడు సార్లు శివలింగం రంగు మారేందుకు గల కారణాలను ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలు కూడా తెలుసుకోలేకపోయారు. అంతేకాదు ఈ శివలింగం ఎంత పొడవు ఉందో అన్న విషయం కూడా ఎవరూ కనుగొనలేకపోయారు. ఇక్కడ జలహరికి ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వేసవిలో వర్షాలు కురవకపోతే జలహరి నీటితో నిండితే వీలైనంత త్వరగా వర్షాలు కురుస్తాయని, ఇక్కడ భక్తులు ఏది కోరితే అది దొరుకుతుందని చెబుతారు. కోరిన కోర్కెలు తీరగానే భక్తులు ఆలయంలోని జలహారిని నీరు, పాలతో నింపుతారు.

మిరాక్యులస్ పూల్..

శివుని బొటనవేలు కారణంగా ఇక్కడ పర్వతం స్థిరంగా ఉందని కూడా ఈ ఆలయం గురించి చెబుతారు. శివుని బొటనవేలు ఇక్కడ నుంచి అదృశ్యమైన రోజు, ఈ పర్వతం కూడా నాశనం అవుతుంది. ఇక్కడ స్వామివారి బొటన వేలి కింద సహజమైన చెరువు ఉంది. ఈ చెరువులో ఎన్ని నీళ్లు పోసినా నిండదు. అందులో పోసే నీరు ఎక్కడికి వెళుతుందో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

చక్కటి హస్తకళ..

ఈ ఆలయ హస్తకళ అద్భుతం. ఇక్కడ సింహాసనం పై కూర్చున్నప్పుడు అచలేశ్వరుడు మహాదేవుని ఆశీర్వాదం పొంది, ధర్మకాంతం కింద ప్రజలకు న్యాయం కోసం ప్రమాణం చేసేవాడని ఈ ఆలయానికి సంబంధించిన ఒక కథనం కూడా ప్రచారంలో ఉంది. ఆలయ సముదాయంలో ద్వారకాధీష్ ఆలయం కూడా నిర్మించారు. గర్భగుడి వెలుపల, వరాహ, నరసింహ, వామన, కచప, మత్స్య, కృష్ణుడు, రాముడు, పరశురాముడు, బుద్ధుడు, కల్కి అవతారాల పెద్ద నల్లరాతి విగ్రహాలు ఉన్నాయి.


Similar News