వేములవాడ ఆలయంలో దారుణం.. ఈవో ముందే SPF సిబ్బందిపై దాడి..!
దిశ, వేములవాడ : వేములవాడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అనునిత్యం కాపలా కాస్తూ, పటిష్ట రక్షణ చర్యలు తీసుకుంటున్న ఎస్పీఎఫ్ సిబ్బందికి, హోమ్ గార్డులకే చివరకు రక్షణ కరువైంది. నిత్యం ఏదో రకంగా వారు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఓ వైపు ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు రావడం, మరోవైపు వీఐపీలు వస్తుండటంతో ఇటు భద్రత చర్యలతో పాటు అటు భక్తులకు […]
దిశ, వేములవాడ : వేములవాడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అనునిత్యం కాపలా కాస్తూ, పటిష్ట రక్షణ చర్యలు తీసుకుంటున్న ఎస్పీఎఫ్ సిబ్బందికి, హోమ్ గార్డులకే చివరకు రక్షణ కరువైంది. నిత్యం ఏదో రకంగా వారు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఓ వైపు ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు రావడం, మరోవైపు వీఐపీలు వస్తుండటంతో ఇటు భద్రత చర్యలతో పాటు అటు భక్తులకు ఎలాంటి లోటు పాట్లు కలగకుండా చర్యలు తీసుకోవడం వారికి కష్టతరంగా మారింది. ఈ క్రమంలో కొంతమంది భక్తులు వ్యవహరించే తీరు సిబ్బందిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. తాము ఎంత చెప్పిన వినకుండా భక్తులు తమకు నచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారని, కొందరు తమపై దాడులు కూడా చేస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ బలం చేకూరేలా సోమవారం కొంతమంది భక్తులు డ్యూటీ ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది కాలర్ పట్టుకొని పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఎస్పీఎఫ్ సిబ్బందికి, భక్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడం భక్తుల తరఫున ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ కలుగ చేసుకోవడం క్షణాల్లో జరిగిపోయింది.
మరోవైపు అదే రోజున శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయంలో విధులు నిర్వర్తించిన ఓ మహిళ హోంగార్డు విధి నిర్వహణలో భాగంగా భక్తులతో నిండిన క్యూలైన్లను క్రమబద్దీకరిస్తుండగా ఒక్కసారిగా భక్తులు తోసివేయడంతో సదరు మహిళ హోమ్ గార్డుకు మోచేతి భాగంలో తీవ్ర గాయమైంది. ఆలయ ముఖద్వారం ముందు ఎస్పీఎఫ్ సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వీరికి అనుసంధానంగా ఆలయ సిబ్బంది సైతం విధులు నిర్వర్తించాలి. కానీ, ఆ డ్యూటీ కూడా ఎస్పీఎఫ్ సిబ్బంది నిర్వహిస్తున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతుండటం వలన ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోందని కొందరు చెబుతున్నారు. ఆలయానికి లక్షల్లో ఆదాయం వస్తున్నా సిబ్బంది కొరత వేధిస్తోంది.
ఆలయానికి వస్తున్న భక్తుల సౌకర్యార్థం ఆలయ భద్రత పర్యవేక్షణకు తక్కువలో తక్కువ కనీసం 100 మంది సిబ్బంది అయినా ఉండాలి. కానీ, కేవలం 12 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది(ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, 10 మంది కానిస్టేబుళ్లు) విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో షిఫ్టుల ప్రకారం రోజుకు 6 మంది సిబ్బంది విధుల్లో ఉంటే మరో ఆరుగురు విశ్రాంతి తీసుకుంటారు. వీరితో పాటు మరో 30 మంది హోమ్ గార్డులు అదనంగా విధులు నిర్వహిస్తున్నారు. కానీ, వారు కేవలం కొన్ని ఏరియాలకే పరిమితంగా ఉంటారు. ఈ క్రమంలో ఎస్పీఎఫ్ సిబ్బంది విధులు కత్తిమీద సాములా మారాయి. ఓ వైపు భద్రత పర్యవేక్షణ, మరోవైపు భక్తుల క్యూలైన్లను క్రమబద్ధీకరణ చేయడం, మధ్యలో వీఐపీలు వస్తే ప్రోటోకాల్ ప్రకారం వారికి రక్షణ కల్పించడం ఇలా అన్ని రకాల పనులు చేస్తూ వెళ్తున్నప్పటికీ మళ్ళీ భక్తుల నుంచి, అధికారుల నుంచి చీవాట్లు తప్పడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆలయ అధికారులు ఉత్సవ విగ్రహాలుగా మారడంతో ఆలయంలో తమపై ఇంతలా దాడులు జరుగుతున్నా పట్టించుకునే నాధుడే లేడని, ఆలయ సిబ్బంది చేయాల్సిన పనులు కూడా తామే చేయాల్సి వస్తుందని, అయిన్నప్పటికీ ఇక్కడి పరిస్థితులను పర్యవేక్షించి, తమకు అండగా నిలిచేవారే లేరని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆలయ ఉన్నత అధికారులు స్పందించి రక్షణ కల్పించే వారి రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.