కీలక నిర్ణయం తీసుకున్న క్యాట్.. ఇక నుంచి మన..
దిశ, న్యూస్ బ్యూరో: ఉత్పత్తి రంగంలో రారాజు చైనా. గ్లోబలైజేషన్ లో ‘ఫ్యాక్టరీ టు ది వరల్డ్’ అన్న పేరు సంపాదించుకుంది. కొవిడ్-19 తో చైనా అతలాకుతలమైంది. తాజా పరిస్థితుల కారణంగా చైనా వస్తువులను బహిష్కరించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(క్యాట్) కీలక నిర్ణయం తీసుకుంది. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణ నినాదాలను సార్థకం చేసుకోవడానికి సరైన సమయమిదే. మార్చి వరకు హైదరాబాద్ లో ప్రతి రోజూ వందల సంఖ్యలో జనం చైనా […]
దిశ, న్యూస్ బ్యూరో: ఉత్పత్తి రంగంలో రారాజు చైనా. గ్లోబలైజేషన్ లో ‘ఫ్యాక్టరీ టు ది వరల్డ్’ అన్న పేరు సంపాదించుకుంది. కొవిడ్-19 తో చైనా అతలాకుతలమైంది. తాజా పరిస్థితుల కారణంగా చైనా వస్తువులను బహిష్కరించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(క్యాట్) కీలక నిర్ణయం తీసుకుంది. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణ నినాదాలను సార్థకం చేసుకోవడానికి సరైన సమయమిదే. మార్చి వరకు హైదరాబాద్ లో ప్రతి రోజూ వందల సంఖ్యలో జనం చైనా ఉత్పత్తులను కొనుగోలు చేశారు. చైనా వస్తువుల కొనుగోలు, దిగుమతి కోసం పని చేస్తోన్న లక్షలాది మందిలో తెలుగు వాళ్లు కూడా వెయ్యి మందికి పైగా ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతోంది. ప్రతి ఇంటీరియర్ డెకరేటర్ కంపెనీ కూడా అక్కడి ప్రతినిధులతో సంబంధాలు కలిగి ఉంది. మార్చి 20న కూడా చైనా ఉత్పత్తులను ఆర్డర్ చేసిన వారున్నారు. అవిప్పటికీ డెలివరీ కాలేదు. లాక్ డౌన్ ముందు వరకు చైనాలోని పలు ప్రధాన నగరాల్లో కన్సల్టెన్సీలను నిర్వహించిన వారున్నారు.
వేల కోట్ల లావాదేవీలు
ప్రస్తుతం చైనా నుంచి ఏడాదికి రూ.5.25 లక్షల కోట్ల (70$ బిలియన్) విలువ గల వస్తువులు దిగుమతి అవుతున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే ఏటా రూ.10 వేల కోట్ల పైగా ఫర్నిచర్ కొనుగోళ్లు జరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా రూ.20 వేల కోట్లకు పైగానే చైనా ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసేవారని అంచనా. ఇది కేవలం ఫర్నిచర్ రంగంలో మాత్రమే. ఫార్మా వంటి రంగాల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు ఉంటాయి. గతేడాది ప్రపంచంలోనే కెమికల్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ రంగాల్లో 20 శాతం చైనావేనని లెక్కలు ఉన్నాయి. ఊహాన్ కరోనాకు పుట్టినిల్లుగా ప్రచారంలో ఉంది. దాంతో పాటు లాక్ డౌన్, వైరస్ ప్రపంచ వ్యాప్తి చెందడంతో చైనా ఉత్పత్తుల దిగుమతి, తయారీకి బ్రేకులు పడ్డాయి. అక్కడి ఉత్పత్తులకు తెలంగాణ కేంద్రంగా మారితే ఊహించని మార్పులు రావచ్చు. చైనాలోని పలు పరిశ్రమలు దేశం వైపు చూస్తున్నాయంటూ మంత్రి కేటీఆర్ కూడా సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో ఫర్నిచర్ రంగం వైపు ప్రోత్సహించడం ద్వారా లక్ష మందికి మెరుగైన ఉపాధికి ఊతమవుతుంది. అందుకే ఇక్కడి ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇదే సరైన సమయంగా కనిపిస్తోంది. విభిన్న వస్తువుల తయారీకి పెట్టుబడులు పెట్టగలిగితే మార్కెట్ ను అందుకోవచ్చునని ఇంటీరియర్ డెకరేటర్స్ సూచిస్తున్నారు. కరోనా తర్వాత వేగం పుంజుకునే రంగాల్లో ఫర్నిచర్ రంగమొక్కటిగా ప్రచారంలో ఉంది. చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో దిగుమతులను తగ్గించుకోవడానికి అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలను ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది.
అన్ని భవంతుల్లో చైనా ఫర్నిచర్
హైదరాబాద్ లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తల ఇళ్లకు వెళ్లినా అందమైన ఫర్నిచర్ స్వాగతం పలుకుతుంది. ఏ హోటల్, ఏ రెస్టారెంటు, లాడ్జీకి వెళ్లినా అలంకరణ వస్తువులు కంటికి ఇంపుగా అనిపిస్తాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, మాదాపూర్, కొంపెల్లి, లింగంపల్లి, కూకట్ పల్లి, తిరుమలాహిల్స్, నార్సింగి, కోకాపేట, గండిపేట ప్రాంతాల్లో ఏ ఇంటికి వెళ్లినా అబ్బురపరిచే వస్తువులు ఆకట్టుకుంటాయి. ఇక విల్లాల్లోనైతే మరీ అధికం. అలంకరణకు విల్లా యజమానులు రూ.కోటి నుంచి రూ. పది కోట్ల వరకు, త్రిబుల్ బెడ్రూం ఇంటి యజమానులేమో రూ.50 లక్షల నుంచి రూ.కోటి దాకా ఖర్చు పెడుతున్నారని ఇంటిరీయర్ డెకరేటర్స్ చెబుతున్నారు. డెకరేటర్స్ తో కలిసి కొనుగోలు కోసం యజమానులు నేరుగా చైనాకు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది చైనా ఫర్నీచర్ ను కొనుగోలు చేస్తున్నట్లు కన్సల్టెంట్లు చెబుతున్నారు. ఇక్కడ రూ. లక్షకు దొరికే వస్తువు అక్కడ రూ.50 వేలకే దొరుకుతుందన్న ప్రచారం ఉంది.
తక్కువ ధరలకే ఉత్పత్తులు
యూరోప్ కంటే 3 నుంచి 8 రెట్లు తక్కువకే చైనా ఉత్పత్తులు లభిస్తాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారంతా వీటినే ఎంపిక చేసుకుంటారు. నాణ్యతతో కూడిన వస్తువులన్న నమ్మకంతోనే చాలా మంది కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియాతో పాటు కెనడా, యూఎస్, యూకే, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల నుంచి ఎక్కువగా ఆర్డర్లు వస్తుంటాయి. స్కూళ్లు, ఆసుపత్రులు ఎవరు ఏర్పాటు చేసినా చైనా మార్కెట్ నుంచి వస్తువుల తెప్పించుకుంటున్నారు. కస్టమ్స్ క్లియరెన్స్, లాజిస్టిక్ వంటి సమస్యలేవీ లేవు. చైనాలోని ఫోషన్ లోనే 5 వేల ఫర్నీచర్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. అతి తక్కువ ధరలకే అందించే మార్కెట్ ప్రపంచంలోనే ఇది అతి పెద్దది. వెబ్ సైట్లు, ఆన్ లైన్ లోనే అందించే అనేక పరిశ్రమలు ఉన్నాయి. నెట్టింట్లో వందలాది సైట్లు దర్శనమిస్తున్నాయి. వేలాది కన్సల్టెంట్ల వివరాలు కనిపిస్తున్నాయి. ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే ఇంటికి తెచ్చి ఇచ్చే కంపెనీలు కూడా చాలానే ఉన్నాయి.
రెగ్యులర్ గా వెళ్తుంటాం: తాళ్లమూడి వేణుగోపాల్, ఐ డిజైన్ ఇంటీరియర్స్, హైదరాబాద్
చైనా నుంచి అనేక రకాల ఫర్నిచర్ ను దిగుమతి చేసుకోవడం పరిపాటి. ఇక్కడి నుంచి అనేక మంది చైనాకు రెగ్యులర్ గా వెళ్తుంటారు. నేను కూడా చాలా సార్లు వెళ్లాను. అక్కడి మార్కెట్ చాలా విస్తారమైనది. కన్సల్టెంట్ల ద్వారా కొనుగోలు చేస్తుంటాం. ప్రధానంగా రూ. 2 లక్షలకు పైగా విలువుండే వస్తువుల కొనుగోలుకు, బ్రాండెడ్ సామాగ్రి కోసమే చైనాకు వెళ్తాం. ఇక్కడ రూ. లక్షకు దొరికితే అక్కడ రూ. 50 వేలకే దొరుకుతాయి. చైనాలో స్కిల్డ్ మానవ వనరులు అధికం. అందుకే ఉత్పత్తుల్లో నాణ్యత ఉంటుంది. ఒక్క విల్లా యజమాని రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు, త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్ యజమాని రూ.50 లక్షల వరకు ఫర్నిచర్ ను కొనుగోలు చేస్తుంటారు. అంతటి మార్కెట్ ను అందుకోవడం కష్టమే. మాతో పాటు వినియోగదారులు కూడా చైనాకు వస్తుంటారు. కరోనా నేపథ్యంలో మార్కెట్ మందగించింది. ఇప్పుడిప్పుడే జనం రియలైజ్ అవుతున్నారు.
లేబర్ కాస్ట్ తక్కువ: పి. ఫణీందర్, ఫణి ఇంటీరియర్స్, హైదరాబాద్
చైనాలో లేబర్ కాస్ట్ తక్కువ. యూఎస్ లో గంటకు 10 డాలర్లంటూ కూలీ లెక్కిస్తారు. అక్కడట్లా ఉండదు. పైగా కార్మికులంతా స్కిల్డ్. సోఫా తయారీ నిమిషాల్లో చేసేస్తారు. అక్కడి నుంచి రూ.50 వేలకు తీసుకొచ్చి ఇక్కడ రూ.2 లక్షలకు అమ్మేవారున్నారు. అలాంటి వారితోనే ఇబ్బంది. చైనాలో ట్యాక్సులు వంటివి 100 శాతం పర్ఫెక్టుగా ఉంటాయి. ఎలాంటి మోసం చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. చైనాలో ఎవరూ భూములను కొనలేరు. కేవలం లీజుకు తీసుకోవాల్సిందే. ఇక్కడైతే ఎవరైనా కొనొచ్చు. మనం ఆర్డర్ ఇచ్చిన 15 రోజుల్లో ఎంపిక చేసుకున్న ఐటెమ్స్ రెడీ అయిపోతాయి. చైనా మార్కెట్లో 70-80 శాతం వరకు యూఎస్, యూకేకు వెళ్తుంటాయి. కరోనా తర్వాత పడిపోతుండొచ్చు. అలాంటి వస్తువులను ఎవరు ఉత్పత్తి చేసినా డిమాండ్ ఉంటుంది.
చైనా వస్తువుల లుక్ బాగుంటుంది: లక్ష్మీకాత్యాయని, డిజైనర్, అధికార ఇంటీరియర్స్, హైదరాబాద్
చైనా వస్తువుల లుక్ బాగుంటుంది. కానీ, క్వాలిటీ అంతంత మాత్రమే. చైనాతో పాటు వియత్నాం, ఇటలీలోనూ ఫర్నిచర్ దొరుకుతుంది. వెండర్స్ ద్వారా కొనుగోలు చేస్తాం. అంతా ఆన్ లైన్ లోనే. చూడడానికి బాగుంటాయి. కానీ, లోపల అంత క్వాలిటీ ఉండదు. ఎక్కువగా విల్లా, త్రిబుల్ బెడ్రూం యజమానులే ఫర్నిచర్ కొంటారు. ఐతే మేం ఇప్పుడు ఇక్కడ తయారు చేసే ఉత్పత్తులనే కొనుగోలు చేస్తున్నాం. రెండేండ్లుగా దిగుమతి పడిపోయింది. కరోనా నేపథ్యంలో ధరలేం తగ్గలేదు.