'ఆప్' కు సై… మోడీకి నై!

అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు స్పష్టమైన నిర్ణయాన్ని వెలువరించారు. గుడికి, బడికి మధ్య జరిగిన పోరులో బడి గెలిచింది. ప్రజల కనీస సౌకర్యాలు, దైనందిన అవసరాలను పేరుకు తగ్గట్లుగానే ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ నెరవేరుస్తుందని ఓటర్లు నమ్మారు. గడచిన ఐదేళ్ళ పాలనను కళ్ళారా చూసిన ప్రజలు దేశభక్తి, రామమందిరం, మతం లాంటివాటి కంటే నిత్యజీవితంలో సమస్యల పరిష్కారానికే పట్టం కట్టారు. సెంటిమెంట్ల కంటే రోజువారీ జీవితావసరాలే కీలకమని భావించారు. ప్రధానితోపాటు పన్నెండు మంది ముఖ్యమంత్రులు ఢిల్లీ ఎన్నికల […]

Update: 2020-02-11 08:17 GMT

అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు స్పష్టమైన నిర్ణయాన్ని వెలువరించారు. గుడికి, బడికి మధ్య జరిగిన పోరులో బడి గెలిచింది. ప్రజల కనీస సౌకర్యాలు, దైనందిన అవసరాలను పేరుకు తగ్గట్లుగానే ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ నెరవేరుస్తుందని ఓటర్లు నమ్మారు. గడచిన ఐదేళ్ళ పాలనను కళ్ళారా చూసిన ప్రజలు దేశభక్తి, రామమందిరం, మతం లాంటివాటి కంటే నిత్యజీవితంలో సమస్యల పరిష్కారానికే పట్టం కట్టారు. సెంటిమెంట్ల కంటే రోజువారీ జీవితావసరాలే కీలకమని భావించారు. ప్రధానితోపాటు పన్నెండు మంది ముఖ్యమంత్రులు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ ప్రకటనలు చేశారు. కానీ ‘మఫ్లర్‌మ్యాన్’ ముందు ఆ భావోద్వేగ ప్రకటనలు, హామీలు నిలవలేకపోయాయి. ఐదేళ్ళ ఆచరణనే ప్రజలు విశ్వసించారు. అరవింద్ కేజ్రీవాల్‌కు పట్టంకట్టారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలు, ప్రతీ చిన్నారికి ఉచిత విద్యాసౌకర్యం, ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం, 20 వేల లీటర్ల వరకు ఉచిత తాగునీరు, ఇంటి ముంగిటకే రేషన్ సరుకులు, మహిళలకు ఉచితంగా మెట్రో రైల్, సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లాంటి హామీలన్నీ ఆచరణ రూపం తీసుకోవడంతో ‘ఆప్’ ప్రజల పక్షపాతి అని ఓటర్లు భావించారు. గతేడాది మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలను బీజేపీకి కట్టబెట్టిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ‘ఆప్’ వైపు నిలబడ్డారు.

ఈసారి ఎన్నికల్లో ‘టెన్ గ్యారంటీస్’ పేరుతో ‘ఆప్’ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పది హామీలను ప్రకటించారు. ఇందులో కొన్ని ఇప్పటికే పాక్షికంగా అమల్లోకి రాగా రానున్న ఐదేళ్ళలో పూర్తిస్థాయిలో అమలు చేస్తామని తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు. ఇవికాక ఇంకా చాలా హామీలనే గుప్పించారు. ప్రతీ ఇంటికీ 24 గంటల నీటి సరఫరా, మురికివాడల్లోని ప్రజలకు ఉచిత పక్కా ఇండ్ల నిర్మాణం, అనధికార కాలనీలను క్రమబద్ధీకరించడంతోపాటు ఆ స్థలాలను అనుభవిస్తున్నవారిపేరు మీదనే యాజమాన్య హక్కులను కల్పిస్తామని, ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లిషు తరగతులు నిర్వహిస్తామని, సిలబస్‌లో ‘దేశభక్తి’ పాఠ్యాంశాలను జోడిస్తామని, నగరంలో కాలుష్యాన్ని తగ్గించే విధంగా రెండు కోట్ల మొక్కలను నాటుతామని, మురుగులేని నగరంగా తీర్చిదిద్దుతామని, వృద్ధులకు తీర్థయాత్ర … ఇలా అనేక హామీలు ఇచ్చారు. ఐదేళ్ళ పాలనను బేరీజు వేసుకున్న ప్రజలు రానున్న ఐదేళ్ళ భవిష్యత్తు ‘ఆప్’తో సాధ్యమవుతుందని ఓటర్లు నమ్మారు. చివరి అపూర్వ మెజారిటీతో గెలిపించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీ ఏడు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వరుసగా మూడుసార్లు షీలా దీక్షిత్ నేతృత్వంలో అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ కనీసం ఒక్కచోట కూడా గెలవలేకపోయింది. అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీల ప్రాభవం మసకబారుతోంది. గతేడాది జరిగిన ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఢిల్లీలో కూడా ప్రాంతీయపార్టీదే పైచేయి అయింది. రామమందిరం, మతం, పౌరసత్వం, భారతీయత లాంటి ఎన్ని భావోద్వేగ ప్రకటనలు చేసినా సామాన్య ప్రజానీకానికి పనిచేసే నాయకులు, పార్టీ అవసరమన్న అభిప్రాయాన్ని ఓటర్లు ఎన్నికల ద్వారా నిరూపించారు. ప్రధాని నరేంద్రమోడీ, ఇంతకాలం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా ఎన్ని రకాల సెంటిమెంట్లను రెచ్చగొట్టినా ప్రజలు ప్రలోభానికి గురికాలేదు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లేమి, రాష్ట్ర స్థాయిలో బలమైన నేతలు లేకపోవడం, ఆ పార్టీ అంతర్గత సంక్షోభం లాంటివన్నీ చివరకు అడ్రస్ లేకుండా పోవడానికి కారణమయ్యాయి.

ప్రజలకు మొహల్లా క్లినిక్‌ల ద్వారా ఉచిత వైద్యం, కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే రీతిలో ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, మహిళల భద్రత కోసం మొహల్లా మార్షల్స్ నియామకం, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, మహిళలకు సిటీ బస్సుల్లో, మెట్రో రైల్‌లో ఉచిత ప్రయాణం, ఇంటి దగ్గరకే రేషను దుకాణాల ద్వారా లభ్యమయ్యే నిత్యావసర వస్తువులను అందించడం… ఇలాంటివన్నీ ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంచాయి. కేంద్రంతో ఎన్ని ఘర్షణలు ఉన్నా ప్రజలకు సౌకర్యాలు అందించడంలో అరవింద్ కేజ్రీవాల్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్న నమ్మకం వారిలో ఏర్పడింది. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారన్న నమ్మకం కలిగింది. అందుకే మరో ఐదేళ్ళ పాటు ఆయన్ను ఎన్నుకున్నారు.

Tags:    

Similar News