ఆ 24 మండలాలకు కష్టకాలం
దిశ ప్రతినిధి, నిజామాబాద్: సగం వర్షకాలం పూర్తయినా సరిపడా వర్షాలు కురవలేదు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో నాట్లు వేసిన రైతన్న వానల కోసం ఆకాశం వైపు చూస్తున్నాడు. ఉమ్మడి నిజామాబాద్జిల్లాలోనే కాకుండా రాష్ర్టం మొత్తం ఇదే పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ లెక్కలు చెబుతున్నాయి. కనీసం సాధారణ సగటు వర్షపాతం పడకపోవడంతో మిగిలిన రెండునెలల కాలంపై కర్షకులు బెంగపెట్టుకున్నారు. ముఖ్యంగా వరి నాట్లు పూర్తయి మొదటి దశలో కలుపు తీసే సమయం వచ్చినా వర్షం జాడలు మాత్రం […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: సగం వర్షకాలం పూర్తయినా సరిపడా వర్షాలు కురవలేదు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో నాట్లు వేసిన రైతన్న వానల కోసం ఆకాశం వైపు చూస్తున్నాడు. ఉమ్మడి నిజామాబాద్జిల్లాలోనే కాకుండా రాష్ర్టం మొత్తం ఇదే పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ లెక్కలు చెబుతున్నాయి. కనీసం సాధారణ సగటు వర్షపాతం పడకపోవడంతో మిగిలిన రెండునెలల కాలంపై కర్షకులు బెంగపెట్టుకున్నారు. ముఖ్యంగా వరి నాట్లు పూర్తయి మొదటి దశలో కలుపు తీసే సమయం వచ్చినా వర్షం జాడలు మాత్రం లేవు.
తెలంగాణ ప్రభుత్వం మినిమం గ్యారంటీ పంటల కార్యక్రమం చేపట్టి వరి సాగును తగ్గించినప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఎనిమిది లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. అందులో నీటిపై ఆధారపడి వరి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. తెలంగాణలో ప్రతి యేటా నాలుగైదు నెలల పాటు మాత్రమే వర్షాలు కురుస్తాయి. మరో రెండు నెలల పాటు వానలు కురవకపోతే తాగునీటితో పాటు సాగునీటికి ఇబ్బందులు తప్పవని రైతులు వాపోతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 24 మండలాల్లో లోటు వర్షపాతమే..
నిజామాబాద్ జిల్లాలో 12 నెలల సగటు వర్ష పాతం 1042.4 మిల్లీ మీటర్లు. జిల్లాలో ప్రస్తుత వానాకాల సీజన్ లో 29 మండలాల్లో సాధారణ సగటు వర్షపాతం 462.3 మిల్లీ మీటర్ల వర్షం పడాల్సింది. కానీ, జూలై 31 వరకు 352.6 మిల్లీ మీటర్లు మాత్రమే పడింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు -23.7 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 29 మండలాల్లో 8 మండలాల్లో సాధారణ వర్షపాతం పడితే 21 మండలాల్లో కనీసం వర్షపాతం నమోదు కాలేదు. కామారెడ్డి జిల్లాలో ఈ రబీ, ఖరీఫ్రెండు సీజన్ లకు కలిపి 1040 మిల్లీ మీటర్ల వర్షం పడాల్సింది. ఈ సీజన్ లో 461.8 మిల్లీ మీటర్ల వర్షానికి గాను 485.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసి నిజామాబాద్ జిల్లా కంటే పరవాలేదనిపించింది. కామారెడ్డి జిల్లాలోని మూడు మండలాల్లో మాత్రం సాధారణ సగటు కంటే ఎక్కువ వర్షం కురిసింది. 10 మండలాల్లో సాధారణ వర్షపాతంతో పరువాలేదనిపించింది. నాలుగు మండలాల్లో మాత్రం లోటు వర్షపాతం నమోదు అయింది. కాగా, ఈ సారి నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల ఉత్తర భారతంలో మాత్రం వానలు దంచికొడుతున్నాయి. దీంతో గోదావరి వరద నీరు ఉత్తర తెలంగాణ వర ప్రధాయని ఎస్ఆర్ఎస్పీకి ఇప్పటికే ఈ రెండు నెలల్లో 21 టీఎంసీల నీరును తెచ్చిపెట్టింది.
వర్షాన్ని నమ్ముకున్న వారికి కష్టకాలమేనా..
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వరప్రదాయని నిజాం సాగర్ లో 17 టీఎంసీలకు గాను ప్రస్తుతం ఉన్న నీరు 0.79 టీఎంసీలే. ఈ సీజన్ లో వానకాలం పంటలకు నీరు విడుదల చేసే అవకాశాలు కను చూపు మేరలో కనిపించడం లేదు. నిజాం సాగర్ ఆయకట్టు విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలు. అయితే అందులో ఈ సారి నీరు లేకపోవడంతో ప్రాజెక్టుపై ఆధారపడిన చెరువులు, కుంటల కింద సాగు చేస్తున్న రైతులు మంజీర వరద నీటితో పాటు వర్షంపైనేభారం వేశారు. సుమారు 80 వేల ఎకరాల్లో పంటలను సాగు చేసిన రైతులు ఈ నెల, వచ్చే నెలలో సరిపడా వర్షాలు కురవకపోతే సాగు కష్టమే అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం రీ డిజైనింగ్ పథకం ప్యాకేజీ 20, 21, 22 పథకాలకు ఈ సీజన్ లో మోక్షం కలుగుతుందో లేదో అని అయా ప్రాంతాల ప్రజలు బోర్లను నమ్ముకుని, స్థానికంగా ఉన్న చెరువులు, చెక్ డ్యాంలను నమ్మి పంటలు వేశారు. జిల్లాలో ప్రస్తుతం శ్రీరాం సాగర్ నుంచి ఆలీ సాగర్, గుత్ప ఎత్తి పోతల పథకాల ద్వారా కొన్ని మండలాలకు నీరు అందిస్తున్నారు. శ్రీరాం సాగర్ లో ప్రస్తుతం 38 టీఎంసీల నీరు ఉందంటే అది గోదావరి వరద నీరే. మరో రెండు నెలలు సమృద్ధిగా వానలు కురిస్తేనే ఈ సీజన్ లో గట్టెక్కుతామని, లేకుంటే రెండు, మూడు తడులకు చెరువులు, కుంటల్లో నీరు సరిపోక ఇబ్బందులు తప్పవని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.