కరోనా అనుమానిత మృతులకు ఇక టెస్టులు చేయరు!

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ పేషెంట్ల, మృతుల సంఖ్య పెరుగుతుండడంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా లక్షణాలతో ఉన్న పేషెంట్ నుంచి శాంపిల్‌ తీసుకుని లేబొరేటరీకి పంపిన తర్వాత రిపోర్టు వచ్చే లోపలే చనిపోయినట్లయితే అలాంటివారిని ‘డీమ్డ్ టు బి కరోనా డెత్’ అనే విధంగానే పరిగణించాలని ఆ శాఖ సిబ్బందికి అంతర్గత ఆదేశాలు వెళ్ళాయి. ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు సర్క్యులర్ కూడా జారీ కానుంది. మరికొన్ని సందర్భాల్లో పేషెంట్ […]

Update: 2020-04-20 12:29 GMT

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ పేషెంట్ల, మృతుల సంఖ్య పెరుగుతుండడంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా లక్షణాలతో ఉన్న పేషెంట్ నుంచి శాంపిల్‌ తీసుకుని లేబొరేటరీకి పంపిన తర్వాత రిపోర్టు వచ్చే లోపలే చనిపోయినట్లయితే అలాంటివారిని ‘డీమ్డ్ టు బి కరోనా డెత్’ అనే విధంగానే పరిగణించాలని ఆ శాఖ సిబ్బందికి అంతర్గత ఆదేశాలు వెళ్ళాయి. ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు సర్క్యులర్ కూడా జారీ కానుంది. మరికొన్ని సందర్భాల్లో పేషెంట్ నుంచి శాంపిల్ తీసుకునే లోపే చనిపోతున్నారు కాబట్టి అలాంటివారిని కూడా కరోనా కారణంగా చనిపోయిన వ్యక్తిగానే పరిగణించాలనే ఆదేశం వెళ్ళింది. చనిపోయిన తర్వాత వారి నుంచి శాంపిల్స్ తీసుకోవద్దని, కరోనా ఉందో లేదో నిర్ధారించవద్దని ప్రభుత్వం విధాన నిర్ణయమే తీసుకుంది. ఎలాగూ మనిషి ప్రాణంతో లేనందువల్ల కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చినా చేయగలిగిందేమీ లేదనేది ప్రభుత్వ భావన. అయితే ‘డీమ్డ్ టు బి కరోనా డెత్’ అని పరిగణించడం ద్వారా మృతదేహాన్ని తరలించడంలో, అంతిమయాత్ర నిర్వసించడంలో దహనం లేదా ఖననం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం కోసం మాత్రమే ఈ ఆలోచన చేసినట్లు వైద్యారోగ్య శాఖ వర్గాల ద్వారా తెలిసింది.

కరోనా లక్షణాలు ఉండి ఎంతమంది మృతి చెందారనే గణాంకాలతో నిమిత్తం లేకుండా వైరస్ వ్యాపించడానికి ఆస్కారమున్న అన్ని కోణాల నుంచి ఆలోచించి ఇలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి వస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కింగ్ కోఠి ఆసుపత్రిలో ఇటీవల ఒక పేషెంట్ మృతి చెందితే కరోనా ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో మృతదేహాన్ని తీసుకెళ్ళిన పరమపద ఆంబులెన్స్ డ్రైవర్లకు కరోనా ఇన్‌ఫెక్షన్ సోకింది. ప్రస్తుతం వారు ఐసొలేషన్‌లో ఉన్నారు. ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఇన్‌ఫెక్షన్, వైరస్ వ్యాప్తికి ఆస్కారం లేకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. కరోనా అనుమానితులను ఐసొలేషన్‌లో పెట్టే అన్ని ఆసుపత్రులకు రెండు మూడు రోజుల్లో అంతర్గత సర్క్యులర్ వెళ్ళనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

‘డీమ్డ్ టు బి…’ అనే నిర్ణయం తీసుకున్నంత మాత్రాన వారిని కరోనా పాజిటివ్ కేసుగా పరిగణించాల్సిన అవసరం లేదని, బులెటిన్‌లో పేర్కొనే లెక్కల్లో చేర్చాల్సిన అవసరం లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా పరిగణించడానికి కారణం మృతి చెందిన పేషెంట్ పాజిటివ్ అయినట్లయితే వైరస్ సోకకుండా ఉండేందుకు జాగ్రత్తపడడం కోసమేనని పేర్కొన్నాయి. కరోనా కారణంగా మృతిచెందినవారి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది. అవన్నీ ఇప్పుడు ‘డీమ్డ్ టు బి…’ విషయంలోనూ వర్తిస్తాయి. ఆ మార్గదర్శకాల ప్రకారం మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితంగా మెలిగినవారికి ఆరోగ్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి వారిని క్వారంటైన్‌లో ఉంచడమో లేదా ఐసొలేషన్‌కు పంపడమో చేయాల్సి ఉంటుంది. ‘డీమ్డ్ టు బి…’ సర్క్యులర్ అధికారికంగా వచ్చేంతవరకు ఈ ఆదేశాలను వైద్యారోగ్య సిబ్బంది పాటించాల్సి ఉంటుంది.

గత నెల రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండడంతో లక్షణాలతో చాలా మంది ఆసుపత్రులకు వస్తున్నారు. కొద్దిమంది నుంచి శాంపిల్స్ తీసుకోకముందే చనిపోతున్నారు. ఇటీవల సత్తుపల్లి మండలంలోని ఒక గ్రామం నుంచి వచ్చిన పేషెంట్ ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళగా అక్కడి వైద్యులు ప్రాథమిక పరీక్ష చేసి కరోనా లక్షణాలున్నాయని వివరించి గాంధీ ఆసుపత్రికి పంపారు. శాంపిల్స్ తీసుకోకముందే చనిపోయాడు. చనిపోయిన తర్వాత శాంపిల్ తీసుకునే ప్రయత్నం చేసినా కొన్ని వత్తిళ్ళ కారణంగా అది సాధ్యం కాలేదు. కానీ కరోనా కారణంగానే మృతి చెందినట్లు వైద్యులు నోటిమాటగా ధృవీకరించారు. దీంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ముందు ఆసుపత్రి నర్సులు జాగ్రత్తలు చెప్పారు. అంతకుముందు గ్లోబల్ ఆసుపత్రిలో ఇతర అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్న పేషెంట్ చనిపోయిన తర్వాత శాంపిల్ తీసుకుని పరీక్షిస్తే పాజిటివ్ అని తేలింది. అందువల్ల ఇలాంటి గందరగోళాలకు తావివ్వకుండా కరోనా లెక్కల్లోకి వచ్చినా రాకున్నా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు బలంగా అనుమానించినప్పుడు మృతదేహం విషయంలో మాత్రం ‘పాజిటివ్’ అనే భావనతోనే మార్గదర్శకాలను పాటించేలా స్పష్టత ఉండాలనేది వైద్యారోగ్యశాఖ అధికారుల ఉద్దేశం.

Tags: Telangana, Corona, Deemed to be Corona Death, Patients, Dead body, Hearse Vehicle, Drivers, Infection,

Tags:    

Similar News