లాక్‌డౌన్.. ఏం జరగనుంది !

– ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ – కొనసాగింపునకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు దిశ, న్యూస్ బ్యూరో : కరోనా వైరస్‌ను నివారించేందుకు ఈ నెల 14 వరకు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో 15వ తేదీ తర్వాత ఎత్తివేస్తారా లేదా కొనసాగిస్తారా ? అని దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. లాక్‌డౌన్ రోజుల్లో ప్రజల నిత్యావసరాలు, వసతి కల్పనకు ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేసినా.. చిన్న, మధ్య తరగతి కుటుంబాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓ పక్క వలస, […]

Update: 2020-04-10 05:17 GMT

– ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

– కొనసాగింపునకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు

దిశ, న్యూస్ బ్యూరో : కరోనా వైరస్‌ను నివారించేందుకు ఈ నెల 14 వరకు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో 15వ తేదీ తర్వాత ఎత్తివేస్తారా లేదా కొనసాగిస్తారా ? అని దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. లాక్‌డౌన్ రోజుల్లో ప్రజల నిత్యావసరాలు, వసతి కల్పనకు ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేసినా.. చిన్న, మధ్య తరగతి కుటుంబాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓ పక్క వలస, అడ్డా కూలీలు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు వేతనాన్ని కోల్పోతున్నారు. మరోవైపు దేశీయ, రాష్ట్రీయ ఆర్థిక వ్యవస్థలపైనా ఈ ప్రభావం పడుతున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌కు మించిన పరిష్కార మార్గం కనబడటం లేదు. కాగా, లాక్‌డౌన్‌ను పొడగించాలా లేదా అనే అంశాలపై శనివారం ( ఏప్రిల్ 11న) అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

లాక్‌డౌన్ ఎత్తివేతలో వ్యూహాత్మకంగా..

లాక్‌డౌన్‌ను ఒకేసారి ఎత్తివేయకూడదని, దశల వారీగా సడలించాలని గతంలోనే రాష్ట్రాలు కేంద్రానికి సూచించాయి. ప్రపంచ దేశాల అనుభవాలను గమనిస్తే.. మన దేశంలో లాక్‌డౌన్ విధించడంతోనే కరోనా మరణాలు, వ్యాప్తిని సమర్థవంతంగా నివారించడానికి వీలు కలిగిందనేది సుస్పష్టం. అధికారిక లెక్కల ప్రకారం మనదేశంలో 6,912 పాజిటివ్ కేసులను గుర్తించగా, 642 మంది పూర్తిగా కోలుకున్నారు. 230 మంది కరోనా వైరస్‌ కారణంగా మరణించారు. తెలంగాణలో 471 పాజిటివ్ కేసుల్లో 45 మంది కోలుకోగా.. 12 మంది చనిపోయారు. జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన భారత్‌లో కరోనాను కట్టడి చేయడంలో లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇచ్చినట్టు ప్రపంచ దేశాలు అభినందించాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను అనుకున్న సమయానికే ఎత్తివేయాలా.. లేక కొనసాగించాలా అనే అంశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారమైతే పొడిగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

లాక్‌డౌన్ ఒకేసారి ఎత్తివేస్తే ప్రజలు ఎవరి పనుల కోసం వారు గుంపులు గుంపులుగా తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్నవారు ప్రస్తుతం హోం క్వారెంటైన్‌లో ఉన్నారు. సాధారణ పరిస్థితి విధించిన తర్వాత కరోనా మళ్లీ విజృంభిస్తే ఎదుర్కోవడం కష్టమవుతుంది. వైరస్‌కు ఉన్న లక్షణం దృష్ట్యా దీర్ఘకాలం తర్వాత అది బయటపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎవరి శరీరంలోనైనా ఉన్నా, అది తర్వాతి కాలంలో బయటపడే అవకాశం లేకపోలేదు. ఇలాంటి పలు అంశాలను గమనంలో ఉంచుకుని లాక్‌డౌన్‌ను పొడిగించడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగానే ఒరిస్సా, పంజాబ్ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఈ నెల చివరి వరకూ పొడిగించనున్నట్టు అధికారిక ప్రకటనలు విడుదల చేశాయి. పలు విమానయాన సంస్థలు సైతం ఏప్రిల్ 30 వరకు అంతర్జాతీయ విమాన సేవలను ప్రారంభించేది లేదని స్పష్టం చేశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా లాక్‌డౌన్‌ను జూన్ 3 వరకు పొడిగించాలని వ్యక్తిగతంగా తన అభిప్రాయాన్ని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకుంటే దేశంలోని మూడు రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు అనుకూలంగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వానికి ముందుగానే సంకేతాలు వెళ్లాయి. దీంతో లాక్‌డౌన్ కాలాన్ని ఈ నెల చివరి వరకూ కొనసాగిస్తున్నట్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చినట్టు భావిస్తే లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయడానికి లేదా మళ్లీ కొనసాగించేందుకు అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్రాలతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్

కరోనా ప్రభావం, రాష్ట్రాల్లో చేపడుతున్న చర్యలు, ఫలితాలను తెలుసుకునేందుకు ప్రధాన మంత్రి ఈ నెల 11న ఉదయం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ ఫలితాలతో పాటు కొనసాగించాలా, ఎత్తివేయాలా అనే అభిప్రాయాలను కూడా రాష్ట్రాలను అడిగి తెలుసుకోనున్నారు. ఒకవేళ కేంద్రం తప్పనిసరిగా లాక్‌డౌన్ ఎత్తివేయాలని భావిస్తే దశలవారీగా చేపట్టాలని రాష్ట్రాలు కోరనున్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేస్తే రాష్ట్రాల వారీగా సర్వీసులను ఎలా ప్రారంభిస్తారు. ప్రజా జీవనాన్ని సాధారణ స్థితిలోకి ఎలా తేవాలనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

రాష్ట్ర కేబినెట్ సమావేశం

కరోనా పరిస్థితులపై చర్చించేందుకు శనివారం మ‌ధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. అప్పటికే ప్రధానితో భేటీ ముగిస్తుండటంతో లాక్‌డౌన్‌పై కేంద్రం ఏ విధంగా నిర్ణయం తీసుకోనుందో కొంత స్పష్టత రానుంది. కేంద్రమే లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇతర ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఉంటే రాష్ట్రంలో ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలపై కేబినెట్ చర్చించనుంది. లాక్‌డౌన్ కార‌ణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, వలస కార్మికుల, ప్రజల సమస్యలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితాలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Tags: corona, lockdown,kcr, prime minister, cabinet, video conferance

Tags:    

Similar News