అప్పులు చెల్లించలేం- ఆరునెలల గడువివ్వండి: కేసీఆర్
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రాలు చెల్లించే అప్పుల కిస్తీని కనీసం ఆరు నెలలపాటు వాయిదా వేసేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నందున రాష్ట్రాల రెవిన్యూ వనరులు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇప్పటికే చేసిన అప్పులను తిరిగి చెల్లించడానికి డబ్బులు లేవని, అందువల్ల కనీసంగా ఆరు నెలలపాటు కిస్తీలు చెల్లించే అవసరం లేకుండా గడువు ఇవ్వాలన్నారు. కరోనా కట్టడి, లాక్‌డౌన్ […]
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రాలు చెల్లించే అప్పుల కిస్తీని కనీసం ఆరు నెలలపాటు వాయిదా వేసేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నందున రాష్ట్రాల రెవిన్యూ వనరులు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇప్పటికే చేసిన అప్పులను తిరిగి చెల్లించడానికి డబ్బులు లేవని, అందువల్ల కనీసంగా ఆరు నెలలపాటు కిస్తీలు చెల్లించే అవసరం లేకుండా గడువు ఇవ్వాలన్నారు. కరోనా కట్టడి, లాక్‌డౌన్ తదితర అంశాలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు సందర్భంగా కేసీఆర్ పైవిధంగా విజ్ఞప్తి చేశారు. దేశం మొత్తానికి పెనువిపత్తు వచ్చినప్పుడు, ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు దాన్నుంచి బయటపడడానికి వ్యూహాత్మక ఆర్థిక విధానం అవసరమని అన్నారు. ఇందుకోసం రిజర్వు బ్యాంకు ‘క్వాంటిటేటివ్ ఈజింగ్’ విధానాన్ని అనుసరించాలని సూచించారు.
ఆర్థిక పరిభాషలో ‘హెలికాప్టర్ మనీ’ అని పిలిచే ఈ విధానం వల్ల రాష్ట్రాలకు నిధులను సమకూర్చే సంస్థలకు ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని గుర్తుచేశారు. ఈ రకంగానే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవచ్చని వివరించారు. ఆయా రాష్ట్రాల జీఎస్‌డీపీలో ఐదు శాతం నిధులను క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానం ద్వారా విడుదల చేయాలని కోరారు. 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, 2008లో కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడిందని గుర్తుచేసి, ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం వల్ల దీన్ని తట్టుకుని కోలుకోగలిగామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని, దీన్ని ఎదుర్కోవడానికి అలాంటి పకడ్బందీ ఆర్థిక విధానం ఉండాలని కోరారు. అదే సమయంలో రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని 3 శాతం నుంచి 5 శాతానికి పెంచాలని కోరారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వహించాలనే విషయంలో వ్యూహం ఖరారు చేసి, అమలు చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రధాని అధ్యక్షతన ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని మోడీకి సూచించారు.
హెలికాప్టర్ మనీ అంటే…?
ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నం అయినప్పుడు, ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉన్నప్పుడు సంప్రదాయ ఆర్థిక విధానాలకు భిన్నంగా ప్రత్యామ్నాయం కల్పించడానికి కేంద్ర బ్యాంకుల నుంచి నేరుగా నిధులు విడుదల చేయడాన్ని ‘హెలికాప్టర్ మనీ’ అని అంటారు. ఆర్థికవేత్తలు దీన్ని ‘క్వాంటిటేటివ్ ఈజింగ్’గా వ్యవహరిస్తారు. రాష్ట్రాల దగ్గర నిధులు లేనప్పుడు రిజర్వు బ్యాంకు నుంచి నేరుగా డబ్బు సరఫరా అవుతుంది. బడ్జెట్ లోటు శాశ్వతంగా కొనసాగుతున్నప్పుడు కూడా దాన్ని పూడ్చడానికి ఇదే పద్ధతిలో డబ్బును సమకూర్చడం ఒక పద్ధతిగా అమలవుతోంది. జీడీపీ పెరుగుదల నామమాత్రంగా ఉండడం, సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణం వచ్చే ప్రమాదం ఉండడం లాంటి సమయాల్లో అదనపు వనరుల ద్వారా నిధులు సమకూర్చడం ఇందులో భాగమే. ఇందుకు రిజర్వు బ్యాంకు తన దగ్గర ఉన్న డబ్బును నేరుగా ఈ రూపంలో సమకూరుస్తుంది. రిజర్వు బ్యాంకు నుంచి ఇలా సమకూరుతున్నందున హెలికాప్టర్ ద్వారా డబ్బును జారవిడిచే అర్థంలో దీన్ని అలా పిలుస్తుంటారు.
లాక్‌డౌన్‌ను రెండు వారాలు కొనసాగించాలి
కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని దృష్టికి తీసుకెళ్ళారు. భారతదేశం ఏకతాటిపై నిలబడి కరోనా వైరస్‌పై పోరాడుతున్నదని, మరో రెండు వారాలపాటు ఇదే స్ఫూర్తితో కొనసాగాల్సిన అవసరం ఉందని అన్నారు. కరోనా విషయంలో భారతదేశం తీసుకుంటున్న విధానాలు చాలా గొప్పగా ఉన్నాయని, సమర్థవంతంగా ఎదుర్కొంటున్నదంటూ అంతర్జాతీయ పత్రికలు కూడా మెచ్చుకుంటున్నాయని గుర్తుచేశారు. కరోనాపై పోరాడేందుకు రాష్ట్రాలకు కేంద్రం నుంచి కావాల్సిన మద్దతు లభిస్తున్నదని, ప్రధాని నుంచి అండదండలు పుష్కలంగా లభించడం ఎంతో మనోధైర్యాన్ని ఇస్తున్నదని మోడీని కేసీఆర్ ప్రశంసించారు. కరోనాపై జరిగే యుద్ధంలో దేశం తప్పక గెలిచితీరుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో లాక్‌డౌన్ బాగా ఉపయోగపడిందన్నారు. కనీసం మరో రెండు వారాలపాటు ఈ లాక్‌డౌన్‌ను కొనసాగించడం మంచిందని సూచించారు. వైరస్ వ్యాప్తి చెందుకుండా ఉండేందుకు ఇంతకు మించిన మార్గం లేదని పేర్కొన్నారు.
వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం…
భారతదేశానికి వ్యవసాయమే జీవిక అని, దేశానికి అన్నం పెట్టడమే కాకుండా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నదని, ఈ రంగంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. 135 కోట్ల జనాభా కలిగిన భారతదేశానికి తిండి పెట్టడం మరే దేశానికి కూడా సాధ్యం కాదని, ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధితో ఉన్నామని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగాలని, అన్నం పెట్టే రైతుకు అండగా నిలవాల్సిన తరుణం ఇదేనని అన్నారు. ఇలాంటి సమయంలో అటు వ్యవసాయాన్ని కాపాడేందుకు, ఇటు ప్రజలకు నిత్యావసర సరుకుల కొరత లేకుండా ఉండేందుకు వీలుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నడిచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, ఇతర వ్యవసాయాధారిత పరిశ్రమలు నడిచేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయానికి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని సూచించారు. కనీసం రెండు నెలల పాటైనా ఈ విధానం అవలంభించాలన్నారు. రైతులు సగం కూలీ డబ్బులు భరిస్తే, మిగతావి ఆ పథకం నుంచి చెల్లించే విధానం రావాలన్నారు. దీనివల్ల కష్ట కాలంలో రైతులను ఆదుకోవడం సాధ్యమవుతుందన్నారు.
దేశవ్యాప్తంగా ఈసారి పంటలు బాగా పండాయని, కోట్ల టన్నుల ఉత్పత్తి జరిగిందని, వీటిని సేకరించడం ప్రస్తుతం ప్రభుత్వాల ముందు ఉన్న కర్తవ్యమని అన్నారు. సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి స్థలం లేనందున ప్రజలకు మూడు నెలలకు సంబంధించిన ఆహార ధాన్యాలను ముందుగానే ఇవ్వడం ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చని, దీని ద్వారా ఎఫ్‌సీఐలో ఉన్న నిల్వలు ఖాళీ అయి స్థలం దొరుకుతుందన్నారు. కొత్తగా వచ్చే పంటలను ఆ గోదాముల్లో నిల్వ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ధాన్యం సేకరణకు ప్రభుత్వం రూ.25 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చిందని ప్రధానికి గుర్తుచేశారు. సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అందిస్తున్నామని, అక్కడి నుంచి తిరిగి రాష్ట్రానికి డబ్బులు రావడానికి నాలుగైదు నెలల సమయం పడుతున్నదని, అప్పటివరకు బ్యాంకులు బకాయిల చెల్లింపుకోసం ఒత్తిడి తేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
Tags: Telangana, PM Modi, Video Conference, Helicopter Money, FRBM enhancement, Debt Payment relaxation