అన్నింటికీ అప్పే.. ‘తెలంగాణ రుణం’ పెనుభారం

దిశ, తెలంగాణ బ్యూరో : ఒకవైపు కరోనా పరిస్థితుల్లో ఆదాయ వనరులు పడిపోవడం, మరోవైపు సంక్షేమ పథకాలను కొనసాగించాల్సిన అనివార్య పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుల భారం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలల కాలంలో సుమారు రూ.42 వేల కోట్ల మేర రుణాలు తీసుకుంది. మొత్తం బడ్జెట్ అంచనాల్లో ఇది సుమారు 22 శాతం. గతేడాది తీసుకున్న అప్పులతో పోలిస్తే రెట్టింపుకంటే ఎక్కువ. ఇప్పుడు తీసుకున్న రుణాల్లో హెచ్చుబాగం ముఫ్పై ఏళ్ల కాలంలో తీర్చేలా […]

Update: 2020-12-26 21:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఒకవైపు కరోనా పరిస్థితుల్లో ఆదాయ వనరులు పడిపోవడం, మరోవైపు సంక్షేమ పథకాలను కొనసాగించాల్సిన అనివార్య పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుల భారం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలల కాలంలో సుమారు రూ.42 వేల కోట్ల మేర రుణాలు తీసుకుంది. మొత్తం బడ్జెట్ అంచనాల్లో ఇది సుమారు 22 శాతం. గతేడాది తీసుకున్న అప్పులతో పోలిస్తే రెట్టింపుకంటే ఎక్కువ. ఇప్పుడు తీసుకున్న రుణాల్లో హెచ్చుబాగం ముఫ్పై ఏళ్ల కాలంలో తీర్చేలా సగటున ఏడు శాతం వడ్డీతో తీసుకున్నవి. మరోవైపు ఎఫ్ఆర్‌బీఎం రుణ పరిమితి పెరగడంతో రానున్న మూడు నెలల్లో ఇంకెన్ని వేల కోట్ల అప్పులు తీసుకోవాల్సి వస్తుందో అనే ఆందోళన ఆర్థిక శాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

కరోనా పరిస్థితుల కారణంగా రాష్ట్ర స్వీయ ఆదాయ వనరులకు భారీ స్థాయిలోనే గండి పడింది. మూడు నెలల పాటు భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో మరింత ఇబ్బందులు ఏర్పడ్డాయి. చివరకు సంక్షేమ పథకాలకు అవసరమైన కేటాయింపులు కూడా చేయడానికి సరిపోయేంత నిధులు లేకపోవడంతో అనివార్యంగా రిజర్వు బ్యాంకు ద్వారా ‘స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్’ రూపంలో రుణాలను తీసుకోవాల్సి వచ్చింది. వార్షిక బడ్జెట్ అంచనాల ప్రకారం అప్పు రూ.31 వేల కోట్లు దాటకూడదు. కానీ ఎనిమిది నెలల కాలానికే ఆ పరిధి దాటిపోవాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన ప్రత్యేక వెసులుబాటు, కొన్ని సంస్కరణలను అమలుచేసినందుకు ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని పెంచడంతో ఎక్కువ అప్పులు తీసుకోడానికి మార్గం సుగమమైంది.

గతేడాది రూ.29,902 కోట్లు మాత్రమే తీసుకుంటే అది ఈసారి ఆరు నెలల్లోనే తీసుకుంది. ఈ ఏడాది డిసెంబరు నాల్గో వారం వరకు మొత్తం రూ.41,781 కోట్లను అప్పుగా తీసుకుంది. ఈ నెల 29న మరో వెయ్యి కోట్ల రూపాయలను ఇరవై ఏళ్లలో తీర్చేలా తీసుకోనుంది. దీంతో తొమ్మిది నెలల కాలానికే రూ.42,871 కోట్ల అప్పును తీసుకున్నట్లయింది. సాధారణంగా ఏదైనా ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల పాటు పెద్దగా అప్పులు తీసుకోకుండా చివరి ఆరు నెలల్లో మాత్రమే ఎక్కువగా తీసుకోవడం గత కొన్నేళ్ల గణాంకాలను చూస్తే స్పష్టమవుతోంది. ఈ ప్రకారం రానున్న మూడు నెలల్లో ఇంకెంతగా అప్పులు తీసుకుంటుందోననే చర్చ ఆర్థికశాఖ వర్గాల్లో మొదలైంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ భావించినట్లుగా కరోనా పరిస్థితుల్లో కేంద్రం నుంచి ‘హెలికాప్టర్ మనీ’ అందకపోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాలు లేకపోవడం, లాక్‌డౌన్ కారణంగా స్వీయ ఆర్థిక వనరులు సమకూరకపోవడం, జీఎస్టీ కౌన్సిల్ నుంచి నష్టపరిహారం సంతృప్తికరంగా సకాలంలో అందకపోవడం.. ఇలా అనేక కారణాల నేపథ్యంలో అప్పులు అనివార్యం కావాల్సి వచ్చింది. సంక్షేమ పథకాలకు కోత పెట్టలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో సంపదను సృష్టించే అభివృద్ధి, మౌలిక సౌకర్యాలకు ఖర్చు చేసే కాపిటల్ ఎక్స్‌పెండిచర్ గణనీయంగా తగ్గిపోయింది. తీసుకున్న అప్పులన్నింటినీ సంక్షేమ పథకాలకు, ఉద్యోగుల వేతనాలకే చెల్లించాల్సి వచ్చింది. డిసెంబరు నెలలోనే ఆరు వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకుంది.

అప్పుల్లో హెచ్చు భాగం ఇరవై ఏళ్లు, పాతికేళ్లు, ముఫ్పై ఏళ్ల కాలపరిమితితో తీసుకున్నవి కాబట్టి రానున్న కాలంలో ప్రభుత్వానికి ఇవి గుదిబండగానే మారనున్నాయి. ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే అక్టోబరు చివరి నాటికి (ఏడు నెలల కాలానికి) రాష్ట్రానికి సమకూరిన ఆదాయం రూ. 38,530 కోట్లు. గతేడాది ఇదే సమయానికి రూ. 45,286 కోట్లు వచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో పెద్దగా ఆదాయం లేకపోయినా ఆ తర్వాత మాత్రం సగటున ఆరున్నర వేల కోట్ల రూపాయల చొప్పున వస్తోంది. ఆ ప్రకారం ఇప్పటివరకు సుమారు రూ. 50 వేల కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు అంచనా.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.1.82 లక్షల కోట్లను బడ్జెట్ అంచనాలుగా పేర్కొనగా ఇందులో రూ.1.43 కోట్లు జీఎస్టీ, మద్యం, వాణిజ్యపన్నులు, ఇతర పన్నుల ద్వారా సమకూరుతుంది. జీఎస్టీతో మాత్రమే రూ. 32,671 కోట్లు సమకూరుతుందని అంచనా వేసుకుంటే అక్టోబరు చివరి నాటికి కేవలం రూ.12,887 కోట్లు మాత్రమే వచ్చాయి. అంచనాలో దాదాపు మూడో వంతు మాత్రమే సమకూరింది. రాష్ట్రంలో పెట్రోలు తదితర సేల్స్ టాక్స్ ద్వారా రూ. 26,400 కోట్లు వస్తుందనుకుంటే కేవలం పది వేల కోట్లు మాత్రమే వచ్చింది. మద్యం ద్వారా మాత్రం అనుకున్న స్థాయిలో సమకూరింది. కొన్ని నెలల పాటు మద్యం దుకాణాలను లాక్‌డౌన్ కారణంగా మూసివేయాల్సి వచ్చినా ధరలను పెంచడం ద్వారా ఆ లోటు భర్తీ అయింది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత అవసరాలకు అప్పులు పుట్టడం, అందినకాడికి తీసుకోవడం, ఖర్చులకు సర్దుబాటు చేసుకోవడం బాగానే ఉన్నా రానున్న 30 ఏళ్ల కాలంలో వీటిని పూర్తిగా తీర్చడం, ప్రతీ నెలా వడ్డీలు చెల్లించడం భారంగా మారే అవకాశం ఉంది. ఈ అప్పులను తీర్చడానికి, వడ్డీలు కట్టడానికే భవిష్యత్తులో అప్పులు తీసుకోవాల్సి ఉంటుంది. తలసరి ఆదాయం పెరుగుతూ ఉందని, రాష్ట్ర జీఎస్‌డీపీ పెరుగుతూ ఉందని సంతృప్తి పడుతున్నా ప్రజల కొనుగోలుశక్తి మాత్రం వివిధ కారణాలతో తగ్గిపోవడం భవిష్యత్తులో ఈ అప్పులను తీర్చడానికి తిప్పలు తప్పేలా లేవు.

Tags:    

Similar News