దళితబంధు కలిసొస్తుందా?

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు పథకంపై అధికార పార్టీ టీఆర్ఎస్ గంపెడాశలు పెట్టుకున్నది. ఇది ఓటింగ్ సరళిని మార్చేస్తుందని భావిస్తున్నది. దీనికి తోడు ఈటల రాజేందర్ బీసీ సామాజికవర్గానికి చెందిన ప్రత్యర్థి కావడంతో అదే బీసీ అభ్యర్థిని బరిలోకి దించి ఎత్తుకు పై ఎత్తు వేసింది. ఇప్పుడు ఈ రెండు అంశాలు అనుకూలంగా మారుతాయని టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. ఈ నియోజకవర్గంలో సుమారు 46 వేల పైచిలుకు […]

Update: 2021-10-27 16:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు పథకంపై అధికార పార్టీ టీఆర్ఎస్ గంపెడాశలు పెట్టుకున్నది. ఇది ఓటింగ్ సరళిని మార్చేస్తుందని భావిస్తున్నది. దీనికి తోడు ఈటల రాజేందర్ బీసీ సామాజికవర్గానికి చెందిన ప్రత్యర్థి కావడంతో అదే బీసీ అభ్యర్థిని బరిలోకి దించి ఎత్తుకు పై ఎత్తు వేసింది. ఇప్పుడు ఈ రెండు అంశాలు అనుకూలంగా మారుతాయని టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. ఈ నియోజకవర్గంలో సుమారు 46 వేల పైచిలుకు ఉన్న దళిత ఓట్లు గంపగుత్తగా పడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నది. కానీ బీసీ కులాలు తనకు అనుకూలంగా ఉంటాయని ఈటల రాజేందర్ నమ్మకంతో ఉన్నారు. ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నా.. కులాలవారీగా చీలే ఓట్లు కొంప ముంచుతాయనే ఆందోళనతో ఉన్నాయి.

ఓటింగ్ సరళి తర్వాత కూడా ఈ టెన్షన్ కొనసాగే అవకాశం ఉన్నది. పోలింగ్ శాతం పెరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే లెక్కలూ మొదలయ్యాయి. దళితబంధు విషయంలో అధికార పార్టీ ఒకింత ధీమాతో ఉన్నప్పటికీ అదే ఆ పార్టీకి ప్రతికూలంగా మారుతుందని బీజేపీ భావిస్తున్నది. కేవలం దళితులకు మాత్రమే ఈ పథకాన్ని తీసుకొచ్చి బీసీ వర్గాల అసంతృప్తికి కారణమైందని, ఆ బీసీ కులాల ఓట్లే అనుకూలంగా మారుతాయని బీజేపీ ఆశలు పెట్టుకున్నది. దీనికి తోడు దళితబంధు పథకం అమల్లోకి వచ్చినా లబ్ధిదారుల్లో ఉన్న అసంతృప్తి, గందరగోళం చివరకు చీలిపోయే ప్రమాదం ఉన్నదని, అది పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా మారకపోవచ్చని అంచనా వేస్తున్నది.

పథకం మంచిదే.. కానీ..

దళితబంధు పథకం లబ్ధిదారుల అభిప్రాయాలు మరో రకంగా ఉన్నాయి. ఈ పథకం ద్వారా పది లక్షల రూపాయలు తమ ఖాతాల్లో పడ్డాయిగానీ, వాటిని స్వేచ్ఛగా వాడుకునే అవకాశం లేదని దళితులు పెదవి విరుస్తున్నారు. ఆరు నూరైనా ఈ పథకాన్ని అమలుచేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానిస్తున్నా గతంలో ‘దళితుడే సీఎం’, ‘మూడెకరాల భూమి’ తరహాలోనే అందని ద్రాక్షగా మారుతుందేమోననే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి ఉద్యమకారుడు మాత్రమే కాక బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఈటల రాజేందర్‌ను ఢీకొట్టడానికి మార్గం సుగమమైందని టీఆర్ఎస్ భావిస్తున్నది. కానీ దళితబంధు కారణంగా బీసీల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత తనకు లాభిస్తుందని ఈటల రాజేందర్ ధీమాతో ఉన్నారు. అటు దళితులుగానీ, ఇటు బీసీలుగానీ పూర్తిగా టీఆర్ఎస్ పార్టీకో, బీజేపీకో మద్దతు పలికే అవకాశం లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఈ ఓటు బ్యాంకు ఏ మేరకు చీలుతుంది, ఏ పార్టీకి చేటు తెస్తుంది, ఏ పార్టీకి లాభం చేకూరుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

కులాలవారీగా హుజూరాబాద్ ఓటర్లను పరిశీలిస్తే, దళితులు 46 వేల మంది, యాదవులు 22 వేల మంది ఉన్నారు. ఈ రెండు ఓట్లలో చీలిక అనివార్యం కానున్నది. ఇక మున్నూరుకాపు ఓటర్లు 29 వేల మంది, పద్మశాలి ఓటర్లు 26 వేల మంది, ఈటల రాజేందర్ సామాజికవర్గమైన ముదిరాజ్ ఓటర్లు 23 వేల మంది చొప్పున ఉన్నారు. ఈ ఓట్లు కూడా గంపగుత్తగా ఒకే పార్టీకి పడతాయని పార్టీలు భావించడంలేదు. రెడ్డి కుల ఓట్లు కూడా దాదాపు 22 వేలు ఉన్నాయి. ఇటు టీఆర్ఎస్, ఈటల భార్య జమున ఇదే కులానికి చెందిన వ్యక్తి కావడంతో కొన్ని ఓట్లు బీజేపీకి, మరికొన్ని ఓట్లు సంప్రదాయకంగా ఉండే కాంగ్రెస్ పార్టీల మధ్య చీలే అవకాశం ఉన్నది. ఈ చీలిక ఏ మేరకు ఉంటుందనేది ఇప్పటికింకా క్లారిటీ రాలేదు.

ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలు కులాలవారీగా ‘ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో సమావేశాలు ఏర్పాటు చేసి వీలైన రూపాల్లో ఆర్థిక సాయం చేశాయి. ఆయా కులాల పెద్దల ద్వారా ఓట్లను ఆకర్షించడానికి ప్రయత్నించాయి. చీలే ఓట్లను ఏ పార్టీ అనుకూలంగా మల్చుకుంటుందనేది కీలకం. చీలే ఓట్లు లాభం చేకూర్చే సంగతి ఎలా ఉన్నా.. ప్రత్యర్థి పార్టీకి నష్టం చేకూర్చడమే ప్రధానంగా మారింది. బీసీ సంఘాలు కూడా చీలిపోయి ఒక వర్గం ఈటలకు అనుకూలంగా, మరో వర్గం ఆయనకు వ్యతిరేకంగా పిలుపు ఇవ్వడంతో ఎలాంటి ప్రభావం కలిగిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News