కలిసొచ్చిన సెంటిమెంట్.. షర్మిల పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్..

దిశ, తెలంగాణ బ్యూరో: రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల ప్రజా క్షేత్రంలోకి వెళ్లనున్నారు. పార్టీ ఆవిర్భావం నాడే మరో 100 రోజుల్లో పాదయాత్ర చేస్తానని చెప్పిన షర్మిల ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు అక్టోబర్ 18వ తేదీన సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కొనసాగించి ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. అంతేకాకుండా తన పార్టీ అధికారంలోకి వస్తే ఏయే పథకాలు అందుబాటులోకి తెస్తామో వివరించనున్నారు. తన తండ్రి, […]

Update: 2021-08-06 20:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల ప్రజా క్షేత్రంలోకి వెళ్లనున్నారు. పార్టీ ఆవిర్భావం నాడే మరో 100 రోజుల్లో పాదయాత్ర చేస్తానని చెప్పిన షర్మిల ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు అక్టోబర్ 18వ తేదీన సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కొనసాగించి ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. అంతేకాకుండా తన పార్టీ అధికారంలోకి వస్తే ఏయే పథకాలు అందుబాటులోకి తెస్తామో వివరించనున్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ గా భావించే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే ఆమె ఈ యాత్రను చేపట్టనున్నారు. దీనికితోడు తన అన్న, ఏపీ సీఎం జగన్ కోసం 2012 లో పాదయాత్ర చేపట్టిన తేదీ కూడా అక్టోబర్ 18వ తేదీనే కావడం విశేషం. ఇటు తండ్రి పాదయాత్ర చేపట్టిన ప్రాంతం, అటు అన్న కోసం తను యాత్ర చేపట్టిన తేదీ రెండూ కలిసిరావడం శుభసూచికంగా షర్మిల భావిస్తోంది.

వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల రాబోయే ఎన్నికలకు ఇదే యాత్రను అస్త్రంగా పెట్టుకున్నారు. ఈ యాత్ర చేపట్టడం ద్వారా సమస్యలు తెలుసుకోవడంతోపాటు ఎన్నికల ప్రచారం కూడా ఒకేసారి పూర్తి చేయొచ్చని ఆమె భావిస్తున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడిచి తన అన్న జగన్ కోసం ఉమ్మడి రాష్ట్రంలో 18 అక్టోబర్ 2012లో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించి 14 జిల్లాల్లో పర్యటించారు. ఎండ, వాననూ లేక్క చేయక 3,112 కిలోమీటర్ల దూరం యాత్ర చేపట్టిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ యాత్ర దాదాపు 9 నెలలపాటు కొనసాగి 4 ఆగస్టు 2013లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. అయితే ఇప్పుడు షర్మిల తను చేపట్టిన 3,112 కిలోమీటర్ల రికార్డును తనే తిరగరాయాలని ప్రణాళికలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

చేవెళ్ల నియోజకవర్గానికి వైఎస్ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. చేవెళ్ల నుంచి 2003లో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో ఆయన 1,467 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్రతో రాజశేఖర్‌రెడ్డికి జనాదరణ లభించడమే కాకుండా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేయడం వల్ల ముఖ్యమంత్రి స్థానానికి ఎలాంటి పోటీ లేకుండా ఆయనే సీఎం కుర్చీలో కూర్చుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రభుత్వ కార్యక్రమాలు దాదాపుగా అక్కడి నుంచే ప్రారంభించారు. తిరిగి 2009లో ఎన్నికల ప్రచారాన్ని కూడా చేవెళ్ల నుంచే ప్రారంభించి రెండోసారి సీఎం కుర్చీలో వైఎస్సార్ కూర్చున్నారు. అందుకే అదే సెంటిమెంట్ ను కొనసాగించాలని షర్మిల నిర్ణయించుకుంది. ఇదిలా ఉండగా తన తండ్రి సెంటిమెంట్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ సైతం కొనసాగించారు. 9 ఏప్రిల్ 2003న వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించారు. అయితే ఇదే రోజున జగన్ 2010లో ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే తన తండ్రి వైఎస్సార్ కు కలిసి వచ్చినట్లే తనకు కూడా ఈ సెంటిమెంట్ కలిసి వస్తుందోలేదో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News