ఐపీఎల్.. తెర వెనుక అసలు కథ ఏమిటి?
దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బాస్ గంగూలీ ఐపీఎల్-2020 షెడ్యూల్ ప్రకటించగానే తెలుగు రాష్ట్రాల్లో కలకలం మొదలైంది. ‘కార్తీక దీపం’ సీరియల్ టైంలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఎలా పెడతారు సార్ అంటూ అడిగి కడిగి పారేశారు. కొవిడ్ మహమ్మారి మూలంగా లాక్ డౌన్ లో, వర్క్ ఫ్రం హోంలో బోర్ కొట్టి ఉన్న దేశమంతా ఇన్నాళ్లూ ఎప్పుడు మ్యాచ్ లు స్టార్ట్ అవుతాయా.. ఎప్పుడు టీవీల ముందు కూర్చుందామా.. అని ఎదురుచూసింది. ఓ […]
దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బాస్ గంగూలీ ఐపీఎల్-2020 షెడ్యూల్ ప్రకటించగానే తెలుగు రాష్ట్రాల్లో కలకలం మొదలైంది. ‘కార్తీక దీపం’ సీరియల్ టైంలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఎలా పెడతారు సార్ అంటూ అడిగి కడిగి పారేశారు. కొవిడ్ మహమ్మారి మూలంగా లాక్ డౌన్ లో, వర్క్ ఫ్రం హోంలో బోర్ కొట్టి ఉన్న దేశమంతా ఇన్నాళ్లూ ఎప్పుడు మ్యాచ్ లు స్టార్ట్ అవుతాయా.. ఎప్పుడు టీవీల ముందు కూర్చుందామా.. అని ఎదురుచూసింది.
ఓ చెన్నై సూపర్ కింగ్స్, ఓ ముంబై ఇండియన్స్, ఓ సన్ రైజర్స్ లాంటి పాపులర్ టీంలకు.. ఓ ధోని, ఓ కోహ్లి, ఓ మ్యాక్స్ వెల్, ఓ గేల్ లాంటి ప్రముఖ ప్లేయర్లకు మన కుర్రకారులో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికి తెలుసు. ఏ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఎక్కువ సిక్సులు కొడతారు? ఎక్కువ వికెట్లు ఎవరు తీస్తారు? చాంపియన్ షిప్ ఎవరిని వరిస్తుంది? లాంటి చర్చలు ఇప్పడు ఇంటింటా, వాడవాడా మొదలయ్యాయి. చివరకు, ఆట మొదలైంది. అప్పుడే ఐదు మ్యాచ్ లు పూర్తయ్యాయి కూడా. డ్రీం లెవెన్, అన్ అకాడెమీ లాంటి టైటిల్ స్పాన్సరర్ల ప్రకటనలతో, ఫ్రాంచైజీల, బ్రాండ్ల లోగోలు ధరించిన క్రికెటర్లు కొట్టే సిక్సర్లు, ఫోర్లతో టీవీలు మార్మోగిపోతున్నాయి. గెలుపుల పైనా, సిక్సర్ల పైనా జిల్లాల్లో బెట్టింగులు సైతం జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వరదలా పారుతున్న కోట్లు..
ఐపీఎల్ వెనకాల అసలు కథ ఏమిటి? ఒక్కో ప్లేయర్ ను కొనుక్కోవడానికి రూ. 17 కోట్ల నుంచి ఒక కోటి వరకు ఎనిమిది ఫ్రాంచైజీలు కలిసి ఖర్చు చేస్తున్న వందలాది కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రాష్ట్రం, దేశం అనే ప్రాతిపదిక లేకుండా దేశ విదేశాలకు చెందిన ప్లేయర్లతో కొన్నిటీంలు చాలా బలంగా ఉండగా మరికొన్ని బలహీనంగా ఎందుకు కనబడుతున్నాయి? స్టార్ ప్లేయర్లకు అధికారిక చెల్లింపులే కాకుండా అనధికారిక చెల్లింపులు కూడా చేస్తూ తమ టీంను వదిలివెళ్లకుండా చేసేది నిజమేనా?
ఐపీఎల్ ద్వారా బీసీసీఐ ఆర్జిస్తున్న ఎమౌంట్ ఎంత? బ్రాడ్ క్యాస్టింగ్, డిజిటల్ హక్కుల కోసం స్టార్ ఇండియా బీసీసీఐకి చెల్లించే రూ.3270 కోట్లు తిరిగి ఎలా రాబట్టుకుంటుంది? పైసలు ఎక్కువ ఖర్చు చేసి మంచి ప్లేయర్లను కొనుక్కున్న టీమే ఎందుకు గెలుస్తుంది? రిలయన్స్ అంబానీ నుంచి మొదలుకొని స్టీల్ కంపెనీ జేఎస్ డబ్ల్యూ, సన్ టీవీ వరకు టీంలను ఎందుకు స్పాన్సర్ చేస్తున్నారు? దీనివల్ల వాళ్లు పొందే లాభమేంటి? అంపైర్లను సైతం కొనేసి మ్యాచ్ ల ఫిక్సింగ్ చేస్తున్నారన్న ఆరోపణల్లో నిజమెంత? వగైరా చాలా మందికి తెలియని విషయాలు అనేకం ఉన్నాయి.
ఐపీఎల్ మీదనే మోజు…
ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ. అలాంటి బీసీసీఐకి ఐపీఎల్ అనేది బంగారు బాతుగుడ్డు. కరోనా సాకుతో ఐసీసీ వరల్డ్ కప్ లాంటి ఈవెంట్లనే వాయిదా వేయించి.. వేదికను మార్పించి క్యాష్ రిచ్ లీగ్‌కు అది మార్గం సుగమమం చేసింది. ఐపీఎల్ అంటే క్రికెట్ ప్రేమికులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్.. కానీ చాలా మందికి అది ఇండియన్ పైసల లీగ్..డబ్బులు గోదావరి వరదలా పారే క్రికెట్ లీగ్.. అందరూ క్రికెట్ మ్యాచులే చూస్తారు.
మరి ఐపీఎల్ వెనుక దాగున్న రహస్యాలు ఎవరు చెబుతారు?. మేం చెబుతాం. క్రికెట్ లీగ్ కాదు.. అంతకు మించి.. అని మేం ఆధారాలతో మీ ముందుంచుతాం.
ఐపీఎల్ అసలు కథ.. కథనాలు రేపటి నుంచి…
ఐపీఎల్ విలువ ఇదీ
- ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ రూ. 47 వేల కోట్లకు పైనే.
- ప్రతీ టీమ్‌కు రూ. 82 కోట్లే పర్స్ వాల్యూ.
- ఖర్చు చేసేది మాత్రం అంతకు ఎన్నో రెట్లు.
- ఐపీఎల్‌ను ఇప్పుడు డ్రీమ్ ఎలెవెన్ రూ. 222 కోట్లకు స్పాన్సర్ చేస్తోంది.
- గతంలో వీవో రూ. 440 కోట్లు ప్రతీ సీజన్ కు ఇచ్చేది.
- బెట్టింగ్ సర్కిల్స్‌లో సీఎస్కే. ముంబయి జట్లే అందరికీ ఫస్ట్ ఛాయిస్.
- ఇండియాలో బెట్టిగ్ నిషేధం.. కానీ బెట్టింగ్ లీగ్స్ నడిపించే డ్రీమ్ ఎలెవెన్ ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్.
- నిత్యం దేశంలో కోట్లల్లో బెట్టింగ్ జరుగుతోంది.
- ముంబయి ఇండియన్స్ జట్టు ఓనర్ రిలయన్స్. కానీ ఇదే కంపెనీ మరో ఆరు జట్లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.
- ఐపీఎల్‌ను ప్రసారం చేసే స్టార్ ఇండియా ఐదేండ్లకు రూ.16,347 కోట్లకు హక్కులు కొనుక్కుంది.
- పది సెకన్ల యాడ్ కోసం స్టార్ ఇండియా వసూలు చేసేది- రూ. 12.5 లక్షలు.
- స్టార్ గ్రూప్‌కు చెందిన హాట్‌స్టారే ఇండియాలో స్ట్రీమింగ్ పార్ట్‌నర్.
- గతంలో కంటే ప్రేక్షకులు పెరిగారు. తొలి మ్యాచ్ 20 కోట్ల మంది చూశారు.
- 2017-18 బ్యాలన్స్ షీట్ ప్రకారం బీసీసీఐ వద్ద ఉన్న డబ్బు నిల్వలు- 5526.18.
వివిధ ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూ 2018లోనే రూ. 782 కోట్ల నుంచి 297 కోట్ల మధ్య ఉంది. ఒక్క విరాట్ కోహ్లి రేటు రూ. 17 కోట్లు.. కమ్మిన్స్ రూ. 15.5 కోట్లు.. ధోని, రోహిత్ శర్మలకు రూ.15 కోట్లు.