ఇది ముమ్మాటికీ నిజం.. అది డేంజరే
దిశ, న్యూస్ బ్యూరో: డిజిటల్ రేడియేషన్.. అవును ఇది ముమ్మాటికీ నిజం. ప్రతీ ఎలక్ట్రానిక్ వస్తువుతో మనిషి ఆరోగ్యం ముడిపడి ఉంది. మొబైల్, ట్యాబ్, ల్యాప్ టాప్ లు మాత్రమే కాదు.. టీవీ, ఫ్రీజ్, వాషింగ్ మిషన్ వంటి వాటితోనే ముప్పు పొంచి ఉన్నది. అందరూ సెల్ ఫోన్ సిగ్నల్ టవర్ తోనే రేడియేషన్ ఉంటుందన్న అపోహలో ఉన్నారు. కానీ విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్లతోనూ తంటా.. సెల్ ఫోన్ రేడియేషన్ లో ఓ పార్టు మాత్రమే. మొబైల్ […]
దిశ, న్యూస్ బ్యూరో: డిజిటల్ రేడియేషన్.. అవును ఇది ముమ్మాటికీ నిజం. ప్రతీ ఎలక్ట్రానిక్ వస్తువుతో మనిషి ఆరోగ్యం ముడిపడి ఉంది. మొబైల్, ట్యాబ్, ల్యాప్ టాప్ లు మాత్రమే కాదు.. టీవీ, ఫ్రీజ్, వాషింగ్ మిషన్ వంటి వాటితోనే ముప్పు పొంచి ఉన్నది. అందరూ సెల్ ఫోన్ సిగ్నల్ టవర్ తోనే రేడియేషన్ ఉంటుందన్న అపోహలో ఉన్నారు. కానీ విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్లతోనూ తంటా.. సెల్ ఫోన్ రేడియేషన్ లో ఓ పార్టు మాత్రమే. మొబైల్ వినియోగం తగ్గించుకోవడం అనివార్యం. ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైనంత మేరకు వాడాలి. ప్రతి రోజూ ఉదయం లేచింది మొదలు మళ్లీ పడుకున్న తర్వాత కూడా మొబైల్ జీవితంలో ఓ భాగంగా కనిపిస్తుంది. ఇప్పుడీ డిజిటల్ తరగతుల నేపథ్యంలో చిన్నపిల్లలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఓ ప్రముఖ మొబైల్ సర్వీసు ప్రూవైడర్ కు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు టెక్నికల్ హెడ్, జనరల్ మేనేజర్ గా వ్యవహరిస్తున్న కృష్ణ (పేరు మార్చాం) ‘దిశ’కు వివరించారు. తాను ఓ కంపెనీ కోసం పని చేస్తున్నానని, కానీ అనుభవపూర్వకంగా ఈ రేడియేషన్ పై ఎన్నో అంశాలను గమనిస్తున్నానన్నారు.
‘మా పక్కింట్లో ఓ చిన్నారి యూకేజీ చదువుతోంది. ఆ పాపకు మూడు నెలల నుంచి ఆన్ లైన్ క్లాసులు నడుస్తున్నాయి. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులే. ఇంట్లో ఉండేది వృద్ధులు. ఇక ఆ చిన్నారి ఏం వింటుంది? ఏం చూస్తుంది? దీని వల్ల ప్రయోజనం ఏమిటి? ఫీజులు వసూలు చేయడానికే తప్ప విద్యార్జనకు అవకాశాలు తక్కువ. రోజూ చూసి చెప్తున్న’ అన్నారు.
మొబైల్ కు స్క్రీన్ గార్డ్ వేస్తారు. అది పగిలిపోకుండా ఉండేందుకని అందరూ అనుకుంటారు. కానీ స్క్రీన్ గార్డు వల్ల రేడియేషన్ ప్రభావం కొంత తగ్గుతుందని స్పష్టం చేశారు. బ్యాటరీ నిక్షిప్తం చేసే ప్రతి వస్తువు, గాడ్జెట్ తో ముప్పు పొంచి ఉన్నదన్నారు. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ తరగతులు తప్పనిసరి. దీంతో మొబైల్ డేటా వినియోగం విపరీతంగా పెరిగింది. కాగా, రేడియేషన్ పేరుతో అకడమిక్ ను ఆపలేం. డిజిటలైజేషన్ తో ఎడ్యుకేషన్, నాలెడ్జ్ వంటివి ముడిపడి ఉన్నాయి. సాంకేతిక నైపుణ్యత లేని చదువులు భవిష్యత్తు అవసరాలుగా మారాయి. చిన్నారులకు ఆన్ లైన్ క్లాసుల నిర్వహణలో యాజమాన్యాలు, తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
ఇండోర్ జనరేషన్..
కరోనా నేపథ్యంలో పిల్లలెవరూ బయట కాలు పెట్టే అవకాశం లేకపోవడంతో ఇండోర్ జనరేషన్ గా మారుతున్నారు. ఇంట్లోని గాలి కాలుష్యంతోనే 40 శాతం మంది ఆస్తమా బారిన పడుతున్నారని వివేకానంద మెడికల్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డా.రమేష్ సాగర్ అన్నారు. చీకటి గదుల్లో బందీ అవుతుండడంతో తలనొప్పి, గొంతునొప్పి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. డిజిటల్ క్లాసులు వినే క్రమంలో కృత్రిమ వెలుగులతో కాలం వెళ్లదీస్తుండడంతో కళ్లపైనా ప్రభావం పడుతుంది. అందుకే ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. కొద్దికాలమైనా పిల్లలు ఎండలో ఉండేటట్లు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆన్ లైన్ క్లాసులు కూడా సహజసిద్ధమైన వెలుగుల మధ్య వినే ప్రదేశాన్ని సూచించాలన్నారు.
డిజిటల్ తో దుష్ప్రభావం..
– మొబైల్ ను అధికంగా వినియోగించడం ద్వారా తలనొప్పి, మైగ్రెయిన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆ తర్వాత మరిన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి.
– అనవసరపు పాప్ అప్ వస్తుంటాయి. వాటిలో మంచిని స్వీకరించే స్థాయి, వయసు కలిగిన చిన్నారులకు మాత్రమే డిజిటల్ క్లాసులు నిర్వహించాలి. పాప్ అప్ తో ముందుకెళ్తే జరిగే నష్టాలు అనేకం.
– మొబైల్ ఆపరేట్ చేసేటప్పుడు వేళ్లను వాడుతాం. అప్పుడూ రేడియేషన్ ప్రభావం ఉంటుంది. అందుకే స్క్రీన్ గార్డులు వేసుకోవడం అత్యుత్తమం.
– పదేళ్ల క్రితం మొబైళ్లకు నేటి మొబైళ్లకు మధ్య వ్యత్యాసం చూడండి. హెచ్ డీ రెజల్యూషన్ తో అత్యుత్తమ పిక్చర్, విజువల్ కనబడుతున్నాయి. దీన్ని బట్టి రేడియేషన్ ప్రభావాన్ని అంచనా వేయొచ్చు.
– రోగ నిరోధక శక్తి లేని వారికి త్వరగా దీని ప్రభావం పడుతుంది.
రేడియేషన్ కు పరిష్కారాలు..
– మొబైల్ చార్జింగ్ పెట్టి ఎప్పుడూ మాట్లాడొద్దు. చూడొద్దు. వినొద్దు.
– మొబైల్ ను కాస్త దూరంగా పెట్టుకొని చూడడం మంచిది.
– స్మార్ట్ ఫోన్ ను టీవీకి కనెక్ట్ చేసుకొని వినడం చాలా శ్రేయస్కరం.
– ఆరు గంటల క్లాసులను మూడు గంటలకు కుదించాలి. హోం వర్క్, సందేహాల నివృత్తికి మరో మార్గాన్ని అన్వేషించాలి.
– ఐదో తరగతి లోపు చిన్నారులకు డిజిటల్ తరగతుల కంటే మరో మార్గాన్ని వెతకాలి.
– మొబైళ్లను రోజూ శుభ్రం చేసుకోవాలి.