సైబర్ దాడులు జరగొచ్చు.. అప్రమత్తంగా ఉండండి : కేంద్రం
న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలను దొంగిలించే సైబర్ దాడులు నేటి నుంచి పెద్దమొత్తంలో జరిగే ప్రమాదమున్నదని కేంద్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. కొవిడ్ 19 చికిత్స కోసమో, ప్రభుత్వ పథకంలో భాగంగానో వినియోగదారుల వివరాలను కాజేసే కుట్రకు కొందరు పూనుకునే అవకాశమున్నదని తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ncov2019@gov.in లేదా ఇతర మెయిల్ ఐడీల ద్వారా మోసపూరితంగా వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యం చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ […]
న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలను దొంగిలించే సైబర్ దాడులు నేటి నుంచి పెద్దమొత్తంలో జరిగే ప్రమాదమున్నదని కేంద్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. కొవిడ్ 19 చికిత్స కోసమో, ప్రభుత్వ పథకంలో భాగంగానో వినియోగదారుల వివరాలను కాజేసే కుట్రకు కొందరు పూనుకునే అవకాశమున్నదని తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ncov2019@gov.in లేదా ఇతర మెయిల్ ఐడీల ద్వారా మోసపూరితంగా వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యం చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం విభాగం ట్వీట్ చేసింది. ఈ రోజు నుంచి సైబర్ దాడులు భారీగా జరిగే అవకాశమున్నదని పేర్కొంది. నమ్మకంగా కనిపించేవారి నుంచి లేదా ప్రభుత్వ సంస్థల నుంచి ఈ-మెయిళ్లు, టెక్స్ట్ మెసేజీలను వచ్చినట్టుగా చూపించి వాటిని ఓపెన్ చేసి ప్రమాదకరమైన లింక్‌లను క్లిక్ చేసేలా వినియోగదారులపై కుట్ర చేస్తారని, తద్వారా మాల్వేర్ ఇన్‌స్టాల్ చేయడమో, సిస్టమ్ ఫ్రీజ్ చేయడమో, లేదా విలువైన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించడమో చేయొచ్చని తెలిపింది. ఈ కుట్రదారుల దగ్గర కనీసం 20లక్షల మెయిల్ ఐడీలున్నాయని, వాటిద్వారా ఉచిత కొవిడ్ 19 టెస్టు రిజిస్ట్రేషన్ కోసమో మరే ఇతర అవసరమో అని చెప్పి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశమున్నదని పేర్కొంది. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ వాసులకూ ప్రధానంగా ఈ ముప్పు పొంచి ఉన్నదని తెలిపింది. ఈ మెయిళ్లు, మెసేజీల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని స్వయంగా అందించేలా ప్రేరేపిస్తారని వివరించింది. ఇటువంటి మోసపూరిత మెయిళ్లు కనిపిస్తే incident@cert-in.org.inకు ఫిర్యాదు చేయాలని సూచించింది.