హైకోర్టుకు ఏం చెప్పాలి?

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు పూర్తి వివరాలతో అఫిడవిట్‌ను, దానికి అనుబంధంగా ‘సపోర్టెడ్ డాక్యుమెంట్లు’ ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్, వైద్య విద్య డైరెక్టర్, పలువురు అధికారులు శనివారం సమావేశమయ్యారు. పై నలుగురూ కోర్టు విచారణకు స్వయంగా హాజరుకావాలని కూడా డివిజన్ బెంచ్ ఆదేశించడంతో […]

Update: 2020-07-25 10:14 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు పూర్తి వివరాలతో అఫిడవిట్‌ను, దానికి అనుబంధంగా ‘సపోర్టెడ్ డాక్యుమెంట్లు’ ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్, వైద్య విద్య డైరెక్టర్, పలువురు అధికారులు శనివారం సమావేశమయ్యారు. పై నలుగురూ కోర్టు విచారణకు స్వయంగా హాజరుకావాలని కూడా డివిజన్ బెంచ్ ఆదేశించడంతో ఈ నెల 28న వీరు హాజరుకావడం అనివార్యమైంది. పూర్తి వివరాలను, హైకోర్టు కోరిన డాక్యుమెంట్లన్నింటినీ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా స్పష్టం చేయడంతో ఇప్పుడు సమర్పించాల్సిన వివరాలపై కసరత్తు చేస్తున్నారు.

కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వానికి గతంలో చేసిన ఆదేశాలను అమలుచేయడం లేదంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అధికారులపై ఎందుకు తగిన చర్యలు తీసుకోరాదో తెలియజేయాలని కూడా వ్యాఖ్యానించింది. బులెటిన్‌లో వివరాలు ఉండడంలేదని, జిల్లా కలెక్టర్లు బులెటిన్లు ఇవ్వడంలేదని, ప్రజలకు పూర్తి స్థాయిలో వివరాలు అందడంలేదని, నిలిపివేసిన వెబ్‌సైట్‌ను సైతం వెంటనే అందుబాటులోకి తేవాలని.. ఇలా అనేక అంశాలను హైకోర్టు సూచించింది. కానీ ఇవేవీ ఇప్పటికీ అమలుకాకపోవడంతో ఈ నెల 28న జరిగే విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది.

జిల్లాల్లో వైద్యారోగ్య శాఖ అధికారులు జారీ చేస్తున్న కరోనా పాజిటివ్, మృతుల గణాంకాలకు, రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ జారీ చేస్తున్న బులెటిన్ వివరాలకు పొంతన ఉండడంలేదని గ్రహించిన హైకోర్టు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు ప్రతీరోజు బులెటిన్‌లను విడుదల చేయాలని స్పష్టం చేసింది. కానీ అప్పటివరకూ జిల్లా వైద్యారోగ్య అధికారులు విడుదల చేసే బులెటిన్లు సైతం నిలిచిపోయాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం ఎన్ని బెడ్‌లు ఖాళీగా ఉన్నాయో డిస్‌ప్లే చేయాలని కూడా ఆదేశించింది. అది కూడా అమలుకావడంలేదు.

ప్రభుత్వంవైపు నుంచి సమగ్రమైన సమాచారం లేకపోవడంతో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పెరిగిపోతున్నాయి. వైద్యశాఖ అధికారులకే 87 పిటిషన్లు దాఖలైనట్లు చెప్పి కోర్టు విచారణలకు హాజరుకావడానికే సమయం సరిపోతూ ఉందని, వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నారు. దీంతో పూర్తి వివరాలను, హైకోర్టు ఏం అడిగినా ఇవ్వండంటూ అధికారులను ఆదేశించడంతో మంగళవారం జరిగే విచారణ సమయానికి సమర్పించాల్సిన అంశాలపై శనివారం జరిగిన సమావేశంలో లోతుగా చర్చించారు. ఏం అంశాన్ని డివిజన్ బెంచ్ లేవనెత్తినా అక్కడికక్కడే వివరాలు ఇచ్చేలా సమస్త సమాచారాన్ని సిద్ధం చేస్తున్నారు.

Tags:    

Similar News