ఆర్టీఐపై సీఎస్ అంతర్గత ఉత్తర్వులు.. మాడభూషి శ్రీధర్ ఆగ్రహం

దిశ, తెలంగాణ బ్యూరో : సమాచార హక్కు చట్టం స్ఫూర్తి మసకబారుతున్న సమయంలో తెలంగాణ సర్కారు మరింతగా దాని కోరలు పీకేసే పనిలో పడింది. దరఖాస్తుదారులు కోరుతున్న సమాచారాన్ని తొందరపడి ఇవ్వవద్దని, విధిగా ఆయా శాఖల ఉన్నతాధికారులు లేదా కార్యదర్శుల నుంచి పర్మిషన్ తీసుకున్నాకే ఇవ్వాలంటూ సీఎస్ సోమేశ్ కుమార్ అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. అరకొర సమాచారాన్ని రొటీన్‌గా ఇస్తున్నారని, అవసరమైన తీరులో పున:పరిశీలన చేసుకోవడం లేదని అన్ని శాఖలకు ఇచ్చిన ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. […]

Update: 2021-10-19 23:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సమాచార హక్కు చట్టం స్ఫూర్తి మసకబారుతున్న సమయంలో తెలంగాణ సర్కారు మరింతగా దాని కోరలు పీకేసే పనిలో పడింది. దరఖాస్తుదారులు కోరుతున్న సమాచారాన్ని తొందరపడి ఇవ్వవద్దని, విధిగా ఆయా శాఖల ఉన్నతాధికారులు లేదా కార్యదర్శుల నుంచి పర్మిషన్ తీసుకున్నాకే ఇవ్వాలంటూ సీఎస్ సోమేశ్ కుమార్ అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. అరకొర సమాచారాన్ని రొటీన్‌గా ఇస్తున్నారని, అవసరమైన తీరులో పున:పరిశీలన చేసుకోవడం లేదని అన్ని శాఖలకు ఇచ్చిన ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఆయా శాఖల్లోని ప్రజా సమాచార అధికారులకు (పీఐఓ) విషయాన్ని అర్థం చేయించాలని అందులో వివరించారు. రొటీన్ పద్ధతుల్లో సమాచారం ఇవ్వకుండా ఉన్నతాధికారుల నుంచి పూర్తి వివరాలను తీసుకుని అనుమతి పొందిన తర్వాత మాత్రమే అందించాలంటూ సర్య్కులర్‌లో సీఎస్ చెబుతున్నా.. చట్టాన్ని మొత్తంగా తొక్కి పెట్టాలనే ఉద్దేశమే ఇందులో ఇమిడి ఉన్నదని ఆర్టీఐ యాక్టివిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు.

వాస్తవానికి దరఖాస్తు చేసిన తర్వాత 30 రోజుల్లో సమాచారం ఇవ్వాల్సిన పీఐఓలు.. ఇవ్వడం లేదు. ఫస్ట్ అప్పీల్ వేసినా స్పందన రావడం లేదు. కమిషన్ ఆదేశించినా లెక్కచేయడంలేదు. ఎలాంటి ఆంక్షలు లేనప్పుడే ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారాన్ని తెప్పించుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. సమాచారం అడిగినవారిపై ఒత్తిడి తీసుకురావడం సైతం అప్పుడప్పుడూ జరుగుతున్నది. కొన్ని సందర్భాల్లో కుంటిసాకులు చెబుతూ, మరికొన్ని సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేయడం, అసంపూర్తి సమాచారాన్ని ఇవ్వడం, అడిగినదానితో సంబంధం లేని వివరాలను ఇవ్వడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం సర్క్యులర్ అడ్డుపెట్టుకుని ఉన్నతాధికారుల నుంచి అనుమతి లభించలేదనే కారణంతో పీఐఓలు ఆ దరఖాస్తులను తిరస్కరించడం లేదా సమాచారం ఇవ్వకుండా నిలిపేసే ప్రమాదం ఏర్పడింది.

స్వతంత్ర వ్యవస్థకే విఘాతం

ప్రతి విభాగంలోని పీఐఓలు స్వతంత్రంగా పనిచేస్తారు. ఆర్టీఐ చట్టంలోని నిబంధనల మేరకు విధులు నిర్వర్తిస్తారు. వ్యవస్థ సంతృప్తికరంగా పనిచేయడానికి ప్రధాన కార్యదర్శిగా నిర్దిష్ట విధానాన్ని రూపొందించే స్వేచ్ఛ ఉంటుంది. కానీ, తాజాగా ఇచ్చిన సర్క్యులర్ మాత్రం ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. ఆర్టీఐ దరఖాస్తుదారులు కోరిన అన్ని రకాల సమాచారాన్ని విధిగా ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే ఇవ్వాలంటే ఆచరణలో సాధ్యం కాదు. తాజా నిబంధనలతో 30 రోజుల్లో సమాచారం ఇవ్వడం సాధ్యం కాదు. దీనికి తోడు పీఐఓలు స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఉండదు. ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ రాలేదన్న కారణంతో పీఐఓలు సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తారు. ఇది ఆర్టీఐ చట్టానికి అర్థం లేకుండా చేస్తుంది.

మాడభూషి శ్రీధర్, కేంద్ర మాజీ సమాచార కమిషనర్

Tags:    

Similar News