పడవ బోల్తా పడి నలుగురు మృతి..కశ్మీర్ లోని జీలం నదిలో ఘటన
కశ్మీర్‌లోని జీలం నదిలో మంగళవారం తెల్లవారుజామున పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
దిశ, నేషనల్ బ్యూరో: కశ్మీర్‌లోని జీలం నదిలో మంగళవారం తెల్లవారుజామున పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పడవ గందర్ బాల్ నుంచి బట్వారాకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జీలం నదిలో నీటిమట్టం పెరిగిందని..ఈ కారణంగానే పడవ బోల్తా పడినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో పడవలో11మంది ఉన్నారు. వారిలో పాఠశాల విద్యార్థులే అధికంగా ఉన్నట్టు సమాచారం. వీరంతా ప్రతిరోజూ నదిని దాటి బట్వారాకు వెళ్తారని స్థానికులు తెలిపారు. మృతి చెందిన వారిని షబీర్ అహ్మద్ (26), గుల్జార్ అహ్మద్ (41), మరో ఇద్దరు మహిళలుగా గుర్తించారు. ఈప్రమాదంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీలు స్పందించారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు.