BREAKING: గచ్చిబౌలిలో విస్తృతంగా పోలీసుల తనిఖీలు.. రూ.4.34 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు కేసుల్లో పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు శాఖకు ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే టాస్క్‌ఫోర్స్, ఎస్‌వోటీ, ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా, శుక్రవారం తెల్లవారుజామున ఎస్‌వోటీ పోలీసులు గచ్చిబౌలిలోని టెలికాంనగర్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వారి నుంచి రూ.4.34 కోట్ల విలువ చేసే 620 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పట్టుబడిన వారిలో నలుగురు రాజస్థాన్‌కు చెందిన డ్రగ్స్ పెడ్లర్లు ఉన్నారు.