ఎయిర్ ఫోర్స్ మహిళా అధికారిపై.. వింగ్ కమాండర్ లైంగిక దాడి!
జమ్మూకాశ్మీర్ లోని ఎయిర్ ఫోర్స్(Air force)లో వింగ్ కమాండర్ గా పనిచేస్తున్న అధికారి ఒకరు.. తనపై లైంగిక దాడి చేసినట్లు మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్(Women flying officer) పేర్కొనడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లోని ఎయిర్ ఫోర్స్(Air force)లో వింగ్ కమాండర్ గా పనిచేస్తున్న అధికారి ఒకరు.. తనపై లైంగిక దాడి చేసినట్లు మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్(Women flying officer) పేర్కొనడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తనను గత కొంత కాలంగా మానసికంగా వేధిస్తూ, లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు మహిళా ఆఫీసర్ ఆరోపించడంతో.. స్పందించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian airforce) ఇంటర్నల్ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.లైంగిక దాడికి గురైన మహిళా ఆఫీసర్ ఫిర్యాదు చేయడంతో.. వింగ్ కమాండర్ పై ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేసినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే..
మహిళా అధికారి ఫిర్యాదును పరిశీలిస్తే.. డిసెంబర్ 31, 2023 న రాత్రి, ఆఫీసర్స్ మెస్ లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో వింగ్ కమాండర్ ఆయన గదిలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా తనను వేధిస్తున్నాడని, అయితే న్యూ ఇయర్ వేడుకలో జరిగిన పార్టీలో నీకు బహుమతి ఏమైనా వచ్చిందా? అని ఆ అధికారి నన్ను అడిగారని, తాను రాలేదని చెప్పడంతో.. నీకు రావలసిన బహుమతులు తన గదిలో ఉన్నాయని చెప్పి, తనను ఆయన గదిలోకి తీసుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. తర్వాత గదిలో ఎవరూ లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఎక్కడున్నారని తాను అడగ్గా, వారు వేరే చోట ఉన్నారని అతను చెప్పాడని అన్నారు. ఆ తర్వాత మాటల్లో పెట్టి తనపై లైంగిక దాడి చేసినట్లు చెప్పారు. తాను ఆ అధికారిని ఎంత బతిమిలాడినా అతను వినలేదని, అతనిపై తాను శతవిధాలా ప్రతిఘటించి అక్కడినుండి పారిపోయానని అన్నారు. అయితే ఈ విషయంలో తనకు సీనియర్ అధికారుల నుంచి ఎటువంటి సాయం లభించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు తాళలేక సదరు అధికారిపై కంప్లైంట్ చేశానని బాధితురాలు తెలపగా.. వింగ్ కమాండర్ పై భారత శిక్షాస్మృతి లో ఉన్న సెక్షన్ 376(2) కింద, బుద్గాం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.