మందమర్రి కేకే-5 గనిలో ప్రమాదం.. ప్రమాదవశాత్తు కార్మికుడు దుర్మరణం
ప్రమాదవశాత్తు కార్మికుడు దుర్మరణం పాలైన ఘటన మందమర్రి ఏరియా కేకే-5 గనిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
దిశ, మందమర్రి: ప్రమాదవశాత్తు కార్మికుడు దుర్మరణం పాలైన ఘటన మందమర్రి ఏరియా కేకే-5 గనిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. లక్ష్మణ్ (33) అనే కార్మికుడు కేకే-5 గని రెండో బదిలీ కోల్ కట్టర్ విధులకు హాజరయ్యాడు. విధులు ముగించుకుని తిరిగి గని నుంచి బయటికి వస్తుండగా మ్యాన్ రైడింగ్ నుంచి జారిపడ్డాడు. గమనించిన తోటి కార్మికులు లక్ష్మణ్‌ను పైకి తీసుకొచ్చే క్రమంలో సరైన స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. మృతుడు లక్ష్మణ్ నివాసం శ్రీపతినగర్ కాగా అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లుగా సమాచారం. ప్రమాద ఘటనను తెలుసుకున్న కార్మిక నేతలు రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. మరణించిన లక్ష్మణ్ కుటుంబానికి న్యాయం చేయాలని సింగరేణి గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, భీమనాధుని సుదర్శన్, ఐఎన్‌టీయూసీ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య, కేంద్ర కమిటీ నాయకులు కాంపల్లి సమ్మయ్య డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల రక్షణ, సంక్షేమానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సింగరేణి యాజమాన్యం కేకే-5 గనిలో స్ట్రెచక్ లేకపోవడంపై మండిపడుతున్నారు.